ఆస్కార్‌.. కొత్త బెస్ట్‌ యాక్టర్‌ ఎవరో..? | oscars 2018 best actress nominees | Sakshi
Sakshi News home page

కొత్త బెస్ట్‌ యాక్టర్‌!!

Published Mon, Feb 12 2018 12:55 AM | Last Updated on Mon, Feb 12 2018 9:08 AM

oscars 2018 best actress nominees - Sakshi

తిమోతీ ఛాలమేట్‌, గ్యారీ ఓల్డ్‌మన్‌, డేనియల్‌ కలూయా

ఈరోజుకి ఇరవై రోజులు ముందుకెళ్తే లాస్‌ ఏంజిల్స్‌లో జరిగే ఓ పెద్ద వేడుకను సినీ అభిమానులంతా చూస్తూ కూర్చుంటారు. ఆ వేడుక పేరే ఆస్కార్స్‌. హాలీవుడ్‌ అంతా ఈ వేడుక కోసం ఎదురు చూస్తోంది. ‘‘అండ్‌ ది అవార్డ్‌ గోస్‌ టూ..’’ అన్న లైన్‌ ఇరవై నాలుగుసార్లు వినిపిస్తుంది ఆ రోజు. అందులో బెస్ట్‌ పిక్చర్, బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డుల తర్వాత ఆ లైన్లో అందరూ ఎదురు చూసే మూడో విభాగం బెస్ట్‌ యాక్టర్‌. ఎప్పట్లానే ఈసారి కూడా బెస్ట్‌ యాక్టర్‌ లిస్ట్‌లో గట్టి పోటీనే ఉంది. ఐదుగురిలో ఇద్దరు ఫస్ట్‌ టైమ్‌ నామినేషన్‌ పొందినవారు కావడం ఇక్కడ విశేషం. అలాగే వాళ్లిద్దరిలోనే ఒకరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సినీ పండితులు లెక్కలేస్తూ ఉండడం మరింత విశేషం. నామినేషన్స్‌ దక్కించుకున్నది ఎవరెవరో చూద్దాం...

తిమోతీ ఛాలమేట్‌ (‘కాల్‌ మీ బై యువర్‌ నేమ్‌’)
ఈ ఏడాది బెస్ట్‌ యాక్టర్‌కు నామినేషన్స్‌ దక్కించుకున్నవారిలో చిన్నవాడు తిమోతీ. 22 ఏళ్లు ఇతనికి. ఇంతకుముందు ఎప్పుడూ నామినేషన్‌ దక్కించుకోలేదు. అవార్డు గనక ఇతనికే వస్తే అతి చిన్న వయసులో బెస్ట్‌ యాక్టర్‌గా ఆస్కార్‌ అందుకున్నవాడిగా రికార్డులకెక్కుతాడు. ‘కాల్‌ మీ బై యువర్‌ నేమ్‌’ సినిమాలో తిమోతీ ఒక టీనేజ్‌ బాయ్‌గా నటించాడు. అందరూ అద్భుతంగా నటించిన సినిమాలో తిమోతీ వాళ్లందరినీ మరిపించేలా నటించాడని విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆస్కార్‌ రేసులో అందరికంటే తిమోతీనే ముందున్నాడని చెప్పుకోవచ్చు. మరి ఆస్కార్‌ అతన్ని వరిస్తుందా?

డేనియ్‌ డే లూయీజ్‌ (‘ది ఫాంటమ్‌ థ్రెడ్‌’)
1950 కాలంలో నడిచే ‘ది ఫాంటమ్‌ థ్రెడ్‌’ అనే సినిమాలో ఓ ఫేమస్‌ డ్రెస్‌మేకర్‌గా లూయిజ్‌ కనిపించాడు. ఈ పాత్రలో ఆయన నటనకు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. లూయిజ్‌ ఇప్పటికే మూడుసార్లు బెస్ట్‌ యాక్టర్‌గా అవార్డు అందుకున్నాడు. అతని నటన గురించి ప్రత్యేకించి ఈరోజు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ‘మై లెఫ్ట్‌ ఫూట్‌’ (1990)తో 18 ఏళ్ల క్రితమే ఆస్కార్‌ అందుకొని అప్పట్నుంచీ ఆయన తానేంటో నిరూపించుకుంటూ వస్తున్నాడు. ‘దేర్‌ విల్‌ బి బ్లడ్‌’ (2003), ‘లింకన్‌’ (2013) తర్వాత ఇప్పుడు మళ్లీ ఆస్కార్‌ కొడితే లూయీజ్‌కి ఇది నాలుగో ఆస్కార్‌ అవుతుంది. ఇవి కాకుండా లూయిజ్‌.. ‘నేమ్‌ ఆఫ్‌ ది ఫాదర్‌’ (1994), ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ న్యూయార్క్‌’ (2003) సినిమాలకు నామినేషన్స్‌ దక్కించుకున్నాడు.

డేనియల్‌ కలూయా (‘గెట్‌ ఔట్‌’)
డేనియల్‌ కలూయా బెస్ట్‌ యాక్టర్‌గా నామినేషన్స్‌ దక్కించుకున్న చిన్నవాళ్ల లిస్ట్‌లో ఉంటాడు. ఇతనికిప్పుడు 28 ఏళ్లు. ‘గెట్‌ ఔట్‌’ సినిమాకు గాను డేనియల్‌ కలూయా ఈ నామినేషన్‌ దక్కించుకున్నాడు. ఇది ఇతనికి ఫస్ట్‌ నామినేషన్‌. ఒకవేళ ఇతనే గనక అవార్డు దక్కించుకుంటే బెస్ట్‌ యాక్టర్‌గా ఆస్కార్‌ అందుకున్న అతి చిన్నవాడిగా రికార్డులకెక్కుతాడు. తెల్లజాతి అమ్మాయిని ప్రేమించిన నల్లజాతి అబ్బాయి, ఆ అమ్మాయి ఇంటికి వెళ్లడం, వాళ్ల ఫ్యామిలీని కలుసుకోవడం.. ఈ క్రమంలో కథ రకరకాల మలుపులు తిరగడమే సినిమా. డేనియల్‌ నటనకు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. లిస్ట్‌లో గట్టి పోటీ ఇచ్చేట్టే కనిపిస్తున్నాడు. తిమోతీ, కలూయా.. ఇద్దరిలో ఎవరో ఒకరు ఆస్కార్‌ దక్కించుకుంటారని ఎక్కువమంది అంచనా. ఎవరు దక్కించుకున్నా ఆస్కార్‌ అందుకున్న చిన్న వయసు యాక్టర్‌గా రికార్డు దక్కించుకుంటారు.

గ్యారీ ఓల్డ్‌మన్‌ (‘డార్కెస్ట్‌ అవర్‌’)
‘టింకర్‌ టైలర్‌ సోల్జర్‌ స్పై’ (2012) సినిమాకుగాను గతంలో గ్యారీ ఓల్డ్‌మన్‌ ఒకసారి ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యాడు. కాకపోతే అప్పుడు అవార్డు ఆయనను వరించలేదు. ఈసారి ‘డార్కెస్ట్‌
అవర్‌’తో ఓల్డ్‌మన్‌ తన రెండో ఆస్కార్‌ నామినేషన్‌ దక్కించుకున్నాడు. ఈసారి గ్యారీ ఓల్డ్‌మన్‌ ఆస్కార్‌ను అందుకుంటాడా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరం. ఈ మధ్యే ఇదే సినిమాకుగాను బెస్ట్‌ యాక్టర్‌గా గ్యారీ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకున్నాడు. దీంతో ఆస్కార్‌ కూడా ఈయన్నే వరిస్తుంది అనేవారు కూడా చాలామందే ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. అప్పటి బ్రిటీష్‌ ప్రధానిగా విన్‌స్టన్‌ చర్చిల్‌ తీసుకునే ఒక కీలక నిర్ణయం చుట్టూ సినిమా నడుస్తుంది.

డెంజెల్‌ వాషింగ్టన్‌ (‘రోమన్‌ జె. ఇజ్రాయెల్‌ ఎస్క్‌’)
డేనియల్‌ లూయీజ్‌ తర్వాత ఈ లిస్ట్‌లో ఆస్కార్‌కు దగ్గరి వ్యక్తి అంటే డెంజెల్‌ వాషింగ్టన్‌. గతంలో గ్లోరీ (1989), ట్రైనింగ్‌ డే (2002) సినిమాలకు ఆస్కార్‌ అందుకున్న డెంజెల్, ఇవి కాకుండా ఎనిమిది నామినేషన్స్‌ కూడా దక్కించుకున్నాడు. నామినేషన్స్, అవార్డులు కలిపి చూస్తే ఈ లిస్ట్‌లో ఆస్కార్‌కు బాగా దగ్గరి వ్యక్తి అంటే డెంజెల్‌ అనే చెప్పుకోవాలి. తన జీవితాన్నంతా న్యాయం కోసం పోరాడటానికే అంకితం ఇచ్చేసిన న్యాయవాది పాత్రలో డెంజిల్‌ ఈ సినిమాలో కనిపిస్తాడు.  

ఆస్కార్‌ 2018 ‘బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు’ ఎవరికి వస్తుందనే దానిపై ఎన్ని చర్చలు జరిగినా, అసలు ఫలితం తేలాలంటే మార్చి 4 వరకూ ఆగాల్సిందే! ఈ ఐదుగురూ ఎవరికి వారే గట్టి పోటీ ఇచ్చేవాళ్లే కావడంతో ‘అండ్‌ ది అవార్డ్‌ గోస్‌ టూ..’ అనే టైమ్‌కి ఎవరు లేచి నిలబడి, స్టేజ్‌ వరకూ వెళ్లి అవార్డు అందుకుంటారో వేచి చూడాలి!!

                            డేనియ్‌ డే లూయీజ్‌, డెంజెల్‌ వాషింగ్టన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement