hollwood
-
హిట్ జోడీ రిపీట్
టామ్ హాలండ్, జెండయా హిట్ జోడీ. ‘స్పైడర్ మేన్’ సిరీస్‌లో వెండితెరపై ప్రేమికులుగా కనిపించిన ఈ ఇద్దరూ నిజంగానే ప్రేమికులు కూడా. అయితే బ్రేకప్ చెప్పుకున్నారనే వార్తలు ఈ మధ్య వస్తే... ‘అలాంటిదేం లేదు’ అంటూ ఈ జంటను ఇష్టపడేవారిని ఖుషీ చేశారు టామ్. ఇప్పుడు హాలీవుడ్ నుంచి మరో ఖుషీ కబురు అందింది. ‘స్పైడర్‌మేన్’ సిరీస్‌లోని నాలుగో భాగంలోనూ ఈ ఇద్దరూ జంటగా నటించనున్నారన్నది ఆ కబురు. నిజానికి ‘యుఫోరియా’ సిరీస్‌లోని మూడో సీజన్లో నటిస్తున్నందున జెండయా ‘స్పైడర్‌మేన్ 4’లో నటించడానికి వీలుపడని పరిస్థితి. అయితే ‘యుఫోరియా’ కథ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆ సిరీస్ కమిట్ అయిన నటీనటులకు వేరే ప్రాజెక్ట్ ఒప్పుకునే వెసులుబాటుని ఇచ్చిందట యూనిట్. దాంతో తాను ఎంతగానో ఇష్టపడే ‘స్పైడర్‌మేన్’ చిత్రానికి డేట్స్ కేటాయించే పని మీద ఉన్నారట జెండయా. ఇక టామ్ హాలండ్ తాను ఇష్టపడే చిత్రాల్లో ‘స్పైడర్‌మేన్’కి ప్రముఖ స్థానం ఉందని అంటుంటారు. సో.... పీటర్ పార్కర్ (టామ్ చేసే స్పైడర్‌మేన్ పాత్ర పేరు), ఎమ్జె (పీటర్ గాళ్ ఫ్రెండ్‌గా జెండయా చేసే పాత్ర పేరు)ల ప్రేమను మరోసారి ‘స్పైడర్‌మేన్ 4’లో చూడొచ్చన్న మాట. ఈ హిట్ జోడీ రిపీట్ అయ్యే విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జస్టిన్ లిన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ లేదా అక్టోబరులో ఆరంభం కానుంది. -
గన్ షాట్‌తో చనిపోయిన నటుడు.. హత్య ? ఆత్మహత్య ?
హాలీవుడ్ పాపులర్ టీవీ సిరీస్‌లలో ఒకటి 'ది వాకింగ్ డెడ్'. ఇందులో 'పెట్ జాంబీ'గా అద్భుతంగా నటించిన మోసెస్ జె. మోస్లీ అకాల మరణం చెందాడు. 31 ఏళ్ల మోసెస్ ఈ ఏడాది జనవరిలో మరణించాడు. పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన వైద్యులు మోసెస్ తుపాకీ గాయం కారణంగా చనిపోయడని తెలిపారు. అయితే మోస్లీ ప్రమాదవశాత్తు మరణించాడా ? ఆత్మహత్య చేసుకున్నాడా ? లేదా ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతను మరణించిన ప్రదేశంలో ఒక లేఖను కూడా పోలీసులు కనుగొన్నట్లు సమాచారం. పోలీసులు మోసెస్ జె. మోస్లీ మృతదేహాన్ని జార్జియాలోని ఓ పార్కింగ్ లాట్లో కనిపెట్టారు. మోసెస్ చనిపోయిన నెలకు పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్స్ రావడం గమనార్హం. మోసెస్ మృతిపట్ల అవేరి సిస్టర్స్ ఎంటర్టైన్మెంట్ నివాళి అర్పించింది. తన అధికారిక ఫేస్బుక్ పేజీలో సంతాపం తెలుపుతూ పోస్ట్ పెట్టింది. అనేక మంది సెలబ్రిటీలు మోసెస్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా మోసెస్ 'పెట్ జాంబీ' పాత్రలో మూడేళ్లు 'ది వాకింగ్ డెడ్' సిరీస్‌లో నటించాడు. వాచ్మెన్, టేల్స్, అమెరికన్ సోల్, క్వీన్ ఆఫ్ ది సౌత్ వంటి సినిమాల్లో సహాయక పాత్రలు పోషించాడు. అలాగే లూజ్ స్క్రూస్, అటాక్ ఆఫ్ ది సౌతెర్న్ ఫ్రైడ్ జాంబీస్, డాల్ మర్డర్ స్ప్రీ వంటి మూవీస్‌లలో అలరించాడు. మోసెస్ జె. మోస్లీ చివరిగా నటించిన హాంక్, డిసెండింగ్ చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. -
రికార్డ్ సృష్టించిన ‘నే జా’
ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైనీస్ యానిమేటెడ్ సినిమా నే జా చరిత్ర సృష్టిస్తోంది. బాక్సాఫీస్ ముందుగా కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా గత చిత్రాల రికార్డ్లను తిరగరాస్తూ దూసుకుపోతోంది. జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన నే జా ఇప్పటి వరకు 2.4 బిలియన్ యాన్స్ (2 వేల 4 వందల కోట్లకు పైగా) వసూళ్లు చేసినట్టుగా చిత్ర నిర్మాతలు ప్రకటించారు. చైనీస్ యానిమేటెడ్ సినిమాల చరిత్రలో ఇవే అత్యధిక వసూళ్లు కావటం విశేషం. ఇన్నాళ్లు 2016లో రిలీజ్ అయిన జుటోపియా పేరిట ఉన్న రికార్డ్‌ను నే జా చెరిపేసింది. భారతీయ ఇతిహాసాల్లోని పాత్రలను పోలిన క్యారెక్టర్స్‌తో రూపొందించిన ఈ సినిమాకు జోజి దర్శకుడు. ఇప్పటికీ మంచి వసూళ్ల ను సాధిస్తూ దూసుకుపోతున్న ఈ యాక్షన్ అడ్వంచరస్ 3డీ యానిమేషన్ మూవీ ఫుల్ రన్లో 4.4 బిలియన్ యాన్ (4 వేల 420 కోట్లకు పైగా) కలెక్షన్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. యానిమేషన్ సినిమాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచిన నే జా ఓవరాల్‌గా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్ మూడో స్థానంలో నిలవటం విశేషం. -
లావయ్యానని కామెంట్ చేస్తే..!
అన్నె హతవేకి యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలోనూ ఆమె పోస్ట్‌లను ఫ్యాన్స్ ఎగబడి ఫాలో అవుతుంటారు. తాజాగా ఆమె ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె భారీ ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంది. సన్నగానే ఉంది కదా? ఈ స్థాయిలో ఎక్సర్సైజ్లు ఎందుకు? అని ఎవ్వరూ ప్రశ్నించకముందే ఆమె చెప్పేసింది, తను ఆ ఎక్సర్సైజ్లు చేస్తోంది బరువు పెరగడానికని! క్రిస్టొఫర్ నోలన్ సినిమాలు ‘ది డార్క్ నైట్ రైజెస్’, ‘ఇంటర్స్టెల్లార్’ సినిమాలతో హాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరుగా ఎదిగిన హతవే, తాజాగా ఓ సినిమాకు లావు అమ్మాయిగా కనిపించనుంది. అందుకు ఈ ఎక్సర్సైజ్లు చేస్తోంది. ‘‘త్వరలోనే నేను బాగా లావవుతా. నేను లావయ్యానని ఎవరైనా కామెంట్ చేస్తే, బాడీ షేమింగ్‌కు వెళితే, నేనొక్కటేమాట చెబుతా.. నేను కాదు, మీరు లావవుతారు. ఇలా బాడీ షేమింగ్‌కు దిగితే!’’ అంటూ ఆ వీడియోతో పాటు కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్! బాడీ షేమింగ్ ఒక్క సినీ పరిశ్రమ అనే కాకుండా అన్ని చోట్లా ఒక అబ్యూజ్గా మారిపోతున్న రోజుల్లో దాని గురించి ఒక టాప్ హీరోయిన్ మాట్లాడటం మంచి విషయమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమాకోసం హతవే లావెక్కుతుందన్న విషయం మాత్రం సస్పెన్స్!! -
హాలీవుడ్ పిలుపొచ్చింది!
గత పదేళ్లుగా హాలీవుడ్‌కు ఇండియన్ మార్కెట్లో క్రేజ్ బాగా పెరిగింది. మరోపక్క ఇండియన్ సినిమా బాక్సాఫీస్ స్టామినా కూడా రెట్టింపయింది. ఈ పరిస్థితుల్లో ఇండియన్ మార్కెట్‌కు మరింత దగ్గరవ్వాలని హాలీవుడ్ పెద్ద స్టూడియోలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఇక్కడి స్టార్స్‌తో హాలీవుడ్ సినిమాలు నిర్మించాలన్న ఆలోచనలు చేస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇక్కడ ముందు వరుసలో ఉంటున్నాడు. హృతిక్ ఆరడుగులు ఉంటాడు. సిక్స్‌ప్యాక్ బాడీ. చూడ్డానికి హాలీవుడ్ హీరోలా ఉంటాడని పేరు. ఆ పేరుకు తగ్గట్టే ఆయన చేసిన ‘క్రిష్’ తరహా సూపర్ హీరో సినిమాలు కూడా హాలీవుడ్‌ను తలపిస్తాయి. ఇంకేం! హృతిక్ హాలీవుడ్ హీరో అయిపోవచ్చని చాలామంది బాలీవుడ్ నిర్మాతలు అనేసుకున్నారు. హాలీవుడ్ నిర్మాతల వరకూ చేరింది ఈ మాట. దీంతో ఇప్పటికి హృతిక్‌కు రెండు, మూడు హాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి. కాకపోతే అవన్నీ సెకండ్ లీడ్ అట. హాలీవుడ్లో అయితే ఫుల్ లెంగ్త్ హీరోగానే చేయాలనుకుంటున్న హృతిక్, ఈ ఆఫర్లు ప్రస్తుతానికి రిజెక్ట్ చేశాడట. మరి ఆ ఫుల్ లెంగ్త్ రోల్ ఎప్పుడొస్తుందో చూడాలి! -
ఆస్కార్.. కొత్త బెస్ట్ యాక్టర్ ఎవరో..?
ఈరోజుకి ఇరవై రోజులు ముందుకెళ్తే లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఓ పెద్ద వేడుకను సినీ అభిమానులంతా చూస్తూ కూర్చుంటారు. ఆ వేడుక పేరే ఆస్కార్స్. హాలీవుడ్ అంతా ఈ వేడుక కోసం ఎదురు చూస్తోంది. ‘‘అండ్ ది అవార్డ్ గోస్ టూ..’’ అన్న లైన్ ఇరవై నాలుగుసార్లు వినిపిస్తుంది ఆ రోజు. అందులో బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ అవార్డుల తర్వాత ఆ లైన్లో అందరూ ఎదురు చూసే మూడో విభాగం బెస్ట్ యాక్టర్. ఎప్పట్లానే ఈసారి కూడా బెస్ట్ యాక్టర్ లిస్ట్‌లో గట్టి పోటీనే ఉంది. ఐదుగురిలో ఇద్దరు ఫస్ట్ టైమ్ నామినేషన్ పొందినవారు కావడం ఇక్కడ విశేషం. అలాగే వాళ్లిద్దరిలోనే ఒకరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సినీ పండితులు లెక్కలేస్తూ ఉండడం మరింత విశేషం. నామినేషన్స్ దక్కించుకున్నది ఎవరెవరో చూద్దాం... తిమోతీ ఛాలమేట్ (‘కాల్ మీ బై యువర్ నేమ్’) ఈ ఏడాది బెస్ట్ యాక్టర్‌కు నామినేషన్స్ దక్కించుకున్నవారిలో చిన్నవాడు తిమోతీ. 22 ఏళ్లు ఇతనికి. ఇంతకుముందు ఎప్పుడూ నామినేషన్ దక్కించుకోలేదు. అవార్డు గనక ఇతనికే వస్తే అతి చిన్న వయసులో బెస్ట్ యాక్టర్‌గా ఆస్కార్ అందుకున్నవాడిగా రికార్డులకెక్కుతాడు. ‘కాల్ మీ బై యువర్ నేమ్’ సినిమాలో తిమోతీ ఒక టీనేజ్ బాయ్‌గా నటించాడు. అందరూ అద్భుతంగా నటించిన సినిమాలో తిమోతీ వాళ్లందరినీ మరిపించేలా నటించాడని విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆస్కార్ రేసులో అందరికంటే తిమోతీనే ముందున్నాడని చెప్పుకోవచ్చు. మరి ఆస్కార్ అతన్ని వరిస్తుందా? డేనియ్ డే లూయీజ్ (‘ది ఫాంటమ్ థ్రెడ్’) 1950 కాలంలో నడిచే ‘ది ఫాంటమ్ థ్రెడ్’ అనే సినిమాలో ఓ ఫేమస్ డ్రెస్మేకర్గా లూయిజ్ కనిపించాడు. ఈ పాత్రలో ఆయన నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లూయిజ్ ఇప్పటికే మూడుసార్లు బెస్ట్ యాక్టర్‌గా అవార్డు అందుకున్నాడు. అతని నటన గురించి ప్రత్యేకించి ఈరోజు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ‘మై లెఫ్ట్ ఫూట్’ (1990)తో 18 ఏళ్ల క్రితమే ఆస్కార్ అందుకొని అప్పట్నుంచీ ఆయన తానేంటో నిరూపించుకుంటూ వస్తున్నాడు. ‘దేర్ విల్ బి బ్లడ్’ (2003), ‘లింకన్’ (2013) తర్వాత ఇప్పుడు మళ్లీ ఆస్కార్ కొడితే లూయీజ్కి ఇది నాలుగో ఆస్కార్ అవుతుంది. ఇవి కాకుండా లూయిజ్.. ‘నేమ్ ఆఫ్ ది ఫాదర్’ (1994), ‘గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్’ (2003) సినిమాలకు నామినేషన్స్ దక్కించుకున్నాడు. డేనియల్ కలూయా (‘గెట్ ఔట్’) డేనియల్ కలూయా బెస్ట్ యాక్టర్‌గా నామినేషన్స్ దక్కించుకున్న చిన్నవాళ్ల లిస్ట్‌లో ఉంటాడు. ఇతనికిప్పుడు 28 ఏళ్లు. ‘గెట్ ఔట్’ సినిమాకు గాను డేనియల్ కలూయా ఈ నామినేషన్ దక్కించుకున్నాడు. ఇది ఇతనికి ఫస్ట్ నామినేషన్. ఒకవేళ ఇతనే గనక అవార్డు దక్కించుకుంటే బెస్ట్ యాక్టర్‌గా ఆస్కార్ అందుకున్న అతి చిన్నవాడిగా రికార్డులకెక్కుతాడు. తెల్లజాతి అమ్మాయిని ప్రేమించిన నల్లజాతి అబ్బాయి, ఆ అమ్మాయి ఇంటికి వెళ్లడం, వాళ్ల ఫ్యామిలీని కలుసుకోవడం.. ఈ క్రమంలో కథ రకరకాల మలుపులు తిరగడమే సినిమా. డేనియల్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లిస్ట్‌లో గట్టి పోటీ ఇచ్చేట్టే కనిపిస్తున్నాడు. తిమోతీ, కలూయా.. ఇద్దరిలో ఎవరో ఒకరు ఆస్కార్ దక్కించుకుంటారని ఎక్కువమంది అంచనా. ఎవరు దక్కించుకున్నా ఆస్కార్ అందుకున్న చిన్న వయసు యాక్టర్‌గా రికార్డు దక్కించుకుంటారు. గ్యారీ ఓల్డ్మన్ (‘డార్కెస్ట్ అవర్’) ‘టింకర్ టైలర్ సోల్జర్ స్పై’ (2012) సినిమాకుగాను గతంలో గ్యారీ ఓల్డ్మన్ ఒకసారి ఆస్కార్‌కు నామినేట్ అయ్యాడు. కాకపోతే అప్పుడు అవార్డు ఆయనను వరించలేదు. ఈసారి ‘డార్కెస్ట్ అవర్’తో ఓల్డ్మన్ తన రెండో ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నాడు. ఈసారి గ్యారీ ఓల్డ్మన్ ఆస్కార్‌ను అందుకుంటాడా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరం. ఈ మధ్యే ఇదే సినిమాకుగాను బెస్ట్ యాక్టర్‌గా గ్యారీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నాడు. దీంతో ఆస్కార్ కూడా ఈయన్నే వరిస్తుంది అనేవారు కూడా చాలామందే ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. అప్పటి బ్రిటీష్ ప్రధానిగా విన్స్టన్ చర్చిల్ తీసుకునే ఒక కీలక నిర్ణయం చుట్టూ సినిమా నడుస్తుంది. డెంజెల్ వాషింగ్టన్ (‘రోమన్ జె. ఇజ్రాయెల్ ఎస్క్’) డేనియల్ లూయీజ్ తర్వాత ఈ లిస్ట్‌లో ఆస్కార్‌కు దగ్గరి వ్యక్తి అంటే డెంజెల్ వాషింగ్టన్. గతంలో గ్లోరీ (1989), ట్రైనింగ్ డే (2002) సినిమాలకు ఆస్కార్ అందుకున్న డెంజెల్, ఇవి కాకుండా ఎనిమిది నామినేషన్స్ కూడా దక్కించుకున్నాడు. నామినేషన్స్, అవార్డులు కలిపి చూస్తే ఈ లిస్ట్‌లో ఆస్కార్‌కు బాగా దగ్గరి వ్యక్తి అంటే డెంజెల్ అనే చెప్పుకోవాలి. తన జీవితాన్నంతా న్యాయం కోసం పోరాడటానికే అంకితం ఇచ్చేసిన న్యాయవాది పాత్రలో డెంజిల్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ఆస్కార్ 2018 ‘బెస్ట్ యాక్టర్ అవార్డు’ ఎవరికి వస్తుందనే దానిపై ఎన్ని చర్చలు జరిగినా, అసలు ఫలితం తేలాలంటే మార్చి 4 వరకూ ఆగాల్సిందే! ఈ ఐదుగురూ ఎవరికి వారే గట్టి పోటీ ఇచ్చేవాళ్లే కావడంతో ‘అండ్ ది అవార్డ్ గోస్ టూ..’ అనే టైమ్‌కి ఎవరు లేచి నిలబడి, స్టేజ్ వరకూ వెళ్లి అవార్డు అందుకుంటారో వేచి చూడాలి!! డేనియ్ డే లూయీజ్, డెంజెల్ వాషింగ్టన్ -
ఆస్కార్ వర్సెస్ గోల్డెన్ గ్లోబ్
ఏటా లక్షలాది మంది ఆ అవార్డు వేడుక వస్తోందంటే టీవీల ముందు వాలిపోతుంటారు. ఒక్కో క్యాటగిరీల్లో అవార్డులు అనౌన్స్ అవుతూంటే.. ‘‘అండ్ ది అవార్డ్ గోస్ టూ..’’ అనగానే కళ్లన్నీ అప్పగించి చూస్తూంటారు. వాళ్లకిష్టమైన సినిమాకో, నటుడికో, టెక్నీషియన్కో అవార్డు వస్తే ఇక పండగే! ప్రపంచవ్యాప్తంగా ఆ స్థాయి క్రేజ్ తెచ్చుకున్న అవార్డు ‘ఆస్కార్’. ఆస్కార్ అనేది హాలీవుడ్ సినిమాకు ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ తమ సినిమాకు దక్కాలని అందరు ఫిల్మ్‌మేకర్స్ కోరుకుంటూ ఉంటారు. అందుకే ఆస్కార్ అవార్డ్స్ అనౌన్స్ చేస్తున్నారంటే అభిమానులకు అదొక పండగ. సినిమాను సెలెబ్రేట్ చేసుకునే పండగ. వారం క్రితమే 2017 సంవత్సరానికి సంబంధించిన ఆస్కార్ నామినేషన్స్‌ను స్వీకరించే ప్రక్రియ పూర్తయింది. రేపు (జనవరి 23) నామినేషన్స్ ప్రకటిస్తారు. మార్చి 4న అవార్డుల ప్రదానం. ఇంకా చాలా టైమ్ అయితే ఉంది. కానీ సందడి మాత్రం ఇప్పటికే మొదలైపోయింది. ముఖ్యంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానం కూడా జరిగిపోయాక ఆస్కార్ సందడి ఎక్కువయింది. హాలీవుడ్లో ఆస్కార్ స్థాయిని మించింది ఇంకేదీ లేకపోయినా గోల్డెన్ గ్లోబ్ అవార్డులను కూడా ఓ రకంగా గొప్ప అవార్డులుగానే చెప్పుకుంటారు. ఆస్కార్ కంటే ముందే ఈ అవార్డుల ప్రదానం జరుగుతుంది కాబట్టి ప్రతిసారీ ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు వేడుక అయిపోయిన రోజు నుంచీ ఆస్కార్ వరుస ఎలా ఉంటుందీ అన్న చర్చ మొదలవుతుంది. ఈ ఏడాది జనవరి 7న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానం జరిగిపోయింది. ఇక అప్పట్నుంచీ గోల్డెన్ గ్లోబ్లో సత్తా చాటిన సినిమాలే ఆస్కార్‌లోనూ సత్తా చాటుతాయా అన్న చర్చ మొదలైంది. ఇక ఇక్కడే ప్రధానంగా అర్థమవుతోన్న విషయం ఏంటంటే.. ఆస్కార్‌కు, గోల్డెన్ గ్లోబ్‌కు చాలా తేడా ఉండడం. గోల్డెన్ గ్లోబ్ బెస్ట్ పిక్చర్ అనిపించుకున్న సినిమా, ఆస్కార్‌లో కనిపించకుండా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్లో ‘త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి’ అనే సినిమా బెస్ట్ ఫిల్మ్‌గా డ్రామా జానర్లో అవార్డ్ అందుకుంది. ఇక కామెడీ/మ్యూజికల్ జానర్లో ‘లేడీబర్డ్’ బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపికైంది. ఈ రెండిట్లో ఏదో ఒక సినిమా ఆస్కార్ అవార్డు అందుకుంటుందా? చెప్పలేం! ఇప్పటికైతే సినీ విశ్లేషకులు ఈ రెండు సినిమాలూ కాకుండా ఆస్కార్‌లో బెస్ట్ ఫిల్మ్ అందుకునే సినిమా ‘షేప్ ఆఫ్ వాటర్’ కానీ, ‘ది పోస్ట్’ కానీ, ‘డంకర్క్’ కానీ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆశ్చర్యంగా ఈ రెండిట్లోనే ఏదో ఒక సినిమాయే ఆస్కార్‌నూ అందుకోవచ్చు కూడా! నామినేషన్స్‌లో ఎలాగూ పైన చెప్పుకున్న సినిమాలన్నీ ఉండొచ్చు. మరి అందులో ఆస్కార్‌ను అందుకునే సినిమా ఏదో తెలియాలంటే మార్చి 4 వరకూ ఎదురుచూడాల్సిందే!! ► గోల్డెన్ గ్లోబ్ అవార్డులు సినిమాలతో పాటు టీవీ సిరీస్‌లకు కూడా ఇస్తూంటారు. ► గోల్డెన్ గ్లోబ్ అవార్డులను హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ ప్రదానం చేస్తుంది. ► గోల్డెన్ గ్లోబ్లో ఓటర్లు 90 మంది మాత్రమే. ► ఆస్కార్స్ కేవలం సినిమాలకు మాత్రమే. ► ఆస్కార్ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రదానం చేస్తుంది. ► ఆస్కార్స్‌లో 6,000మంది ఓట్లను పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తారు. గోల్డెన్ గ్లోబ్ 2018 విన్నర్స్ లిస్ట్ ఉత్తమ చిత్రం (డ్రామా) త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి ఉత్తమ చిత్రం (మ్యూజికల్/కామెడీ): లేడీబర్డ్ ఉత్తమ విదేశీ భాషా చిత్రం : ఇన్ ద ఫేడ్ (జర్మనీ) ఉత్తమ దర్శకుడు: గిలియర్మొ దెల్తొరొ (ది షేప్ ఆఫ్ వాటర్) ఉత్తమ ఒరిజినల్ స్కోర్ అలెగ్జాండర్ డెస్ప్లాట్ (ది షేప్ ఆఫ్ వాటర్) ఉత్తమ నటుడు (డ్రామా): గ్యారీ ఓల్డ్‌మేన్ (డార్కెస్ట్ అవర్) ఉత్తమ నటుడు (కామెడీ/మ్యూజికల్) జేమ్స్ ఫ్రాంకో (ది డిజాస్టర్ ఆర్టిస్ట్) ఉత్తమ నటి (డ్రామా) ఫ్రాన్సెస్ మెక్డొర్మాండ్ (త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి) ఉత్తమ నటి (కామెడీ/మ్యూజికల్) : సొయర్స్ రోనన్ (లేడీ బర్డ్) ఉత్తమ స్క్రీన్‌ప్లే మార్టిన్ మెక్‌డొనా (త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి) గ్యారీ ఓల్డ్‌మేన్, ∙ జేమ్స్ ఫ్రాంకో -
త్రీడీలో మన్రో జీవితకథ
సినిమా తారల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనే ఆకాంక్ష చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా మార్లిన్ మన్రో వంటి సంచలన తార జీవిత విశేషాలు తెలుసుకోవాలనుకునే వారి సంఖ్య చాలానే ఉంటుంది. ఈ అద్భుత సౌందర్య రాశి హాలీవుడ్లో 17 ఏళ్లు ఓ వెలుగు వెలిగారు. భౌతికంగా ఆమె దూరమై దాదాపు 52 ఏళ్లవుతోంది. అయినప్పటికీ ఆమెను ఎవరూ మర్చిపోలేదు. ఇప్పటికీ అడపా దడపా మన్రో ఫొటోలు, ఆమె వాడిన వస్తువులను వేలం వేస్తుంటారు. వాటిని సొంతం చేసుకోవడానికి భారీ ఎత్తున అభిమానులు పోటీపడుతుంటారు. అలాంటి అభిమానులకు ఓ తీపి వార్త. మన్రో జీవితం ఆధారంగా స్వీయదర్శకత్వంలో రూపేష్ పౌల్ ఓ సినిమా తీయనున్నారు. త్రీడీలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. దీనికి ‘36 ఎంఎం త్రీడీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ వారంలో ఫ్రాన్స్‌లో కేన్స్ చలన చిత్రోత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ ప్రచార చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు రూపేష్. స్టార్‌గా ఎదగడానికి మన్రో చేసిన కృషి, స్టార్ అయిన తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? తదితర అంశాలతో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రం కోసం యూనివర్సల్ స్టూడియోలో భారీ సెట్ వేస్తున్నారు. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రాన్ని ఇంగ్లిష్, హిందీ భాషల్లో రూపొందించనున్నారు. మన్రో పాత్రను ఎవరు చేస్తారనేది దర్శకుడు ఇంకా బయటపెట్టలేదు. వాస్తవానికి గత ఏడాదే ఈ చిత్రాన్ని ప్రకటించారు రూపేష్. అప్పట్లో కొంతమంది నటీనటుల పేర్లు కూడా చెప్పారట. ఆ జాబితాలో భారతీయ నటీనటులు లేరని సమాచారం. సో.. మన్రోగా చేయబోతున్నది హాలీవుడ్ తార అని ఊహించవచ్చు.