సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్‌లీలా బన్సాలీ తీసిన బాలీవుడ్ చిత్రం 'పద్మావతి' విడుదలను నిరవధికంగా వాయిదా వేసినప్పటికీ, దానికి వ్యతిరేకంగా దేశంలో ఏదో చోట గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ సినిమాకు వ్యతిరేకంగా ఇలా గొడవలు జరగడం దేశంలో ఇదే మొదటి సారి కాదు. కేంద్రంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా తమ మనోభాలకు విరుద్ధంగా ఉందంటూ ఏదో సినిమాకు వ్యతిరేకంగా ఎప్పుడూ ఆందోళనలు దేశంలో జరుగుతూనే ఉన్నాయి. ఓసారి హిందూ కమ్యూనిటీ వారు గొడవలు చేస్తే మరోసారి ముస్లిం కమ్యూనిటీ వారు, మరోసారి మరో కమ్యూనిటీ వారు గొడవలు చేయడం మామూలయింది. భావ ప్రకటనా స్వేచ్ఛ కలిగిన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నా, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన చలనచిత్ర సర్టిఫికేట్ బోర్డు కలిగి ఉన్నా, సినిమాలపై గొడవలు చేయడం కొన్ని వర్గాలకు రివాజుగా మారిపోయింది.
ఇప్పుడు పద్మావతి సినిమాకు వ్యతిరేకంగా గొడవ చేస్తున్న రాజస్థాన్‌లోని రాజ్‌పుత్ కర్ణిసేన ఇంతకుముందు 2008లో అశుతోష్ గోవారీకర్ తీసిన బాలీవుడ్ చిత్రం జోధా అక్బర్ చిత్రాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సినిమాలో హృతిక్ రోషన్ ముఘల్ చక్రవర్తి అక్బర్‌గాను, ఐశ్వర్యరాయ్ ఆయన భార్య జోధాగాను నటించారు. తమ కమ్యూనిటీ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ వారు గొడవ చేయడంతో అప్పడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజస్థాన్‌లో సినిమా విడుదలను నిషేధించింది. అప్పుడు బహుజన సమాజ్‌వాది అధికారంలో ఉన్న యూపీలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న హర్యానాలో, బీజీపీ ఆధీనంలోని ఉత్తరాఖండ్‌లో కూడా ఈ సినిమా విడుదలను నిషేధించారు.
1975లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడంపై అమృత్ నహతా నిర్మించిన వ్యంగ్య చిత్రం 'కిస్సా కుర్సీ కా' పై కాంగ్రెస్ యువజన సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటి కాంగ్రెస్ యువజన నాయకుడు సంజయ్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఆ సినిమా ప్రింట్లనే కాకుండా ఒరిజనల్ నెగెటివ్ ప్రింట్‌ను కూడా దగ్ధం చేశారు. ఆ తర్వాత 1978లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నహతా ఆ సినిమాను పునర్మించి విడుదల చేశారు. గొడవ, రాజకీయ జోక్యం వల్ల మణిరత్నం తీసిన 'బాంబే' సినిమా కూడా ఆలస్యంగా విడుదలయింది. అందులో హిందూ హీరోకు ముస్లిం భార్యకు మధ్య ప్రేమ సన్నివేశాలను చిత్రీకరించడాన్ని ముస్లిం వర్గాలు వ్యతిరేకించాయి. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం చెలరేగిన ముంబై అల్లర్ల నేపథ్యంలో సినిమా తీయడం, అప్పటి శివసేన చీఫ్ బాల్‌ఠాక్రేను పోలిన పాత్రలో టూ ఆనంద్‌ను చూపించడం వివాదాస్పదమైంది. ఆయన పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించాకనే ఆ సినిమా విడుదలను హిందూ సంఘాలు అనుమతించాయి. దాంతో 1995, మార్చి 10వ తేదీన ఆ సినిమా విడుదలయింది. ఆ సినిమా అప్పుడు సూపర్ హిట్టయింది.
1998లో విడుదలయిన దీపా మెహతా తీసిన చిత్రం 'ఫైర్' కూడా ప్రకంపనలు సృష్టించింది. ఇద్దరు మహిళల మధ్య స్వలింగ సంపర్కాన్ని చూపించడం పట్ల కొన్ని హిందూ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అది మన సంస్కృతి కానందున ఆ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశాయి. ఆ సినిమాకు వ్యతిరేకంగా ముంబై, ఢిల్లీ, సూరత్, పుణెలలో శివసేన, భజరంగ్ దళ్‌లు ఆందోళన చేశాయి. సినిమా థియేటర్లను ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమాను పునస్సమీక్షకు సెన్సార్ బోర్డుకు ప్రభుత్వం మళ్లీ పంపించిగా, రెండోసారి కూడా ఎలాంటి కత్తిరింపులు లేకుండా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతించింది. అయినప్పటికీ వారు దీపా మెహతను మరచిపోలేదు.
ఆమె షబానా ఆజ్మీ, నందితా దాస్, అక్షయ్ కుమార్‌తో కలసి తన 'వాటర్' చిత్ర నిర్మాణం కోసం 2000 సంవత్సరంలో వారణాసికి వెళ్లారు. అక్కడ ఆమె సిట్టింగ్‌లనూ హిందూ మూకలు దగ్ధం చేయడమే కాకుండా ఆమె దిష్టిబొమ్మలను తగులబెట్టి నదిలో పడేశారు. అక్కడ ఒక్క షాట్‌ను మాత్రమే తీయగలిగినా దీపా మెహతా తన పూర్తి చిత్రాన్ని ఇతర నటీ నటులతో శ్రీలంకలో పూర్తి చేశారు. ఇక అనిల్ శర్మ తీసిన 'గదర్-ఏక్ ప్రేమ్ కహాని' కమల్‌హాసన్ నటించిన 'విశ్వరూపం' బన్సాలీ తీసిన 'బాజీరావ్ మస్తానీ' సినిమాలన్నీ వివాదాస్పదమయ్యాయి. వాటన్నింటికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఆ ఆందోళనలన్నీ కూడా సినిమాలు బాగా ఆడేందుకే ఉపయోగపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment