'ఆయన సినిమా నాలెడ్జికి కాలం చెల్లింది'
ముంబయి: తన చిత్రాల విడుదలకు సంబంధించి తాను కూడా గతంలో సెన్సార్ బోర్డు నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నానని ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా అన్నారు. ఈ సందర్బంగా ఆయన కేంద్ర సెన్సార్ బోర్డు అధ్యక్షుడు పహ్లాజ్ నిహలానీని తప్పుబట్టారు. నిహ్లాజ్కు ప్రస్తుతం ఉన్న సినిమా జ్ఞానానికి కాలం చెల్లిందని అన్నారు. ఆయనదంతా ఔట్ డేటెడ్ సినిమా నాలెడ్జి అంటూ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం బాలీవుడ్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉడ్తా పంజాబ్ చిత్ర వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ మీడియా ఆయనను ఆ చిత్ర విడుదలపై సెన్సార్ బోర్డు పనితీరును ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఇది పూర్తిగా హాస్యాస్పదం. అసలు సమస్య ఏమిటంటే ఒక అర్హత లేని వ్యక్తికి ఆపదవి కట్టబెట్టారు. పహ్లాజ్ నిహ్లానీకి నాకు ఎలాంటి వైరుద్యం లేదు. కానీ, ఈరోజుల్లో ఒక వ్యక్తికి ఉండాల్సిన సినిమా నాలెడ్జితో పోలిస్తే ప్రస్తుతం ఆయనకు ఉన్న సినిమా జ్ఞానం పూర్తిగా కాలం చెల్లినది. దాని ఫలితమే ప్రస్తుత సమస్య' అంటూ ఆయన విమర్శించారు.