పాక్ నటీనటులపై భారత్ నిషేధం!
దాయాది దేశాల మధ్య జరుగుతున్న ఉగ్రవాద పోరు సెగ పాకిస్తాన్ నటీనటులకు తాకింది. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో అల్లకల్లోల పరిస్థితులు కుదుటపడే వరకూ పాక్ నటులపై భారత్ లో తాత్కాలికంగా నిషేధం విధించారు. తాజాగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లోని భూభూగంలో భారత ఆర్మీ పటిష్టమైన సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. దీంతో భారత్-పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో కాస్త ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాక్ నటులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని భావించిన భారతీయ సినీ ఇండస్ట్రీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు పాక్ నటులు నటించిన రెండు బాలీవుడ్ మూవీలు త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ప్రతికూల పరిస్థితులు తలెత్తకుండా చూడటంలో భాగంగా పాక్ నటీనటులపై తాత్కాలికంగా నిషేధం విధించారు. ఇటీవల జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉడీ ఉగ్రదాడిలో 18 మంది భారతీయ జవాన్లు అమరులైన నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన ఎంఎన్ఎస్ పాక్ నటులపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 48 గంటల్లోగా పాక్ నటీనటులు దేశం విడిచి వెళ్తే అది వారికే మంచిదంటూ ఎంఎన్ఎస్ సభ్యులు హెచ్చరించారు. పీఓకేలో భారత ఆర్మీ జరిపిన దాడుల్లో దాదాపు 38 మంది ఉగ్రవాదులు హతమైనట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ ఇదివరకే వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.