టైటిల్: పలాస 1978
జానర్: రివేంజ్ డ్రామా
నటీనటులు: రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, లక్ష్మణ్, తదితరులు
సంగీతం: రఘు కుంచె
దర్శకత్వం: కరుణకుమార్
నిర్మాత: ధ్యాన్ అట్లూరి
నిడివి: 144 నిమిషాలు
1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్, నక్షత్ర జంటగా తెరకెక్కిన ఈ చిత్రంతో కరుణకుమార్ అనే నూతన దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రఘు కుంచె కీలక పాత్ర పోషిస్తూ సంగీతమందించాడు. ఇప్పటికే విడుదలై చిత్ర ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ 1978లో పలాసలో ఏం జరిగింది? ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? తొలి చిత్రంతో దర్శకుడు విజయం సాధించాడా? అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుందా? అనేది మన రివ్యూలో చూద్దాం.
కథ:
అగ్రవర్ణాల నీరు, ఆహారం, గడప మైల పడకుండా.. సమాజానికి దూరంగా.. వారి అవసరాలకు దగ్గరగా పలాస పొలిమేరలో ఉండే అంబుసొలి అనే కాలనీ ప్రజల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇదే కాలనీలో రంగారావు(తిరువీర్), మోహన్ రావు (రక్షిత్)లు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. తండ్రి పద్యాల సుందర్ రావు (సమ్మెట గాంధీ) చిన్నప్పట్నుంచి నేర్పించిన పద్యాలు, జానపద గీతాలతో అనేక గ్రామాల్లో ప్రోగ్రామ్స్ చేస్తూనే.. ఆ ఊర్లోని పెద్ద షావుకారు లింగమూర్తి (జనార్దన్), చిన్న షావుకారు గురుమూర్తి (రఘు కుంచె)ల జీడిపప్పు బట్టీల్లో పనిచేస్తుండేవారు. అయితే లింగమూర్తి, గురుమూర్తిలు ఇద్దరు అన్నదమ్ములైన వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.
తన చిన్నతనం నుంచి మోహన్ రావుకు మరదలు లక్షి(నక్షత్ర) అంటే ఎంతో ఇష్టం. లక్ష్మికి కూడా బావ మోహన్ రావు అంటే ఎనలేని ప్రేమ. అయితే తన చిన్నతనం నుంచి కుల వివక్ష కారణంగా రగిలిపోయే మోహన్ రావు తరుచూ షావుకార్లతో గొడవకు దిగేవాడు. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా గురుమూర్తి దగ్గరే పనిచేస్తూ అతడికి నమ్మిన బంటుగా మారిపోయాడు. అయితే సవ్యంగా సాగుతున్న సమయంలో ఎన్నికల కారణంగా రంగారావు, మోహన్‌రావుల జీవితాలు తలకిందులవుతాయి. గొడవలు, హత్యలతో పలాసలో భయానక వాతావరణం అలుముకుంటుంది. ఓ వైపు పోలీసులు మరోవైపు గురుమూర్తి.. మోహన్, రంగాలను అంతం చేయాలని పథకాలు రచిస్తుంటారు. ఈ పరిస్థితుల నుంచి రంగా, మోహన్‌లు బయటపడ్డారా? గొడవలు, హత్యలకు ఆ ఇద్దరన్నదమ్ములు ఎందుకు పాల్పడతారు? కథ సుఖాంతమైందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు:
దాదాపు అంతా కొత్త తారాగణమే. పెద్దగా పరిచయంలేని పేర్లు. ఈ చిత్రంలో రంగారావు, మోహన్ రావు పాత్రలు ప్రధానమైనవి. ఈ రెండు పాత్రలకు తిరువీర్, రక్షిత్‌లు న్యాయం చేశారు. ముఖ్యంగా రక్షిత్ అన్ని వేరియేషన్స్ ఉన్న పాత్ర లభించింది. బాధ, కోపం, ప్రేమ ఇలా అన్ని భావాలను చాలా చక్కగా పలికించాడు. యాక్షన్ సీన్స్‌లలో కూడా దుమ్ముదులిపాడు. అయితే నటుడిగా ఇంకాస్త మెరుగుపడాల్సిన అవసరం ఉందని కొన్ని సీన్లను చూస్తే అనిపిస్తుంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌కు ఎక్కువ ప్రాధాన్యత లేదు. అయితే ఉన్న కొన్ని సీన్లలోనైనా నక్షత్ర ఆకట్టుకుంది. నేచురల్‌గా, అందంగా కనిపిస్తుంది. నెగటీవ్ రోల్‌లో కనిపించిన రఘు కుంచె పలు సీన్లలో రావు రమేశ్‌ను తలపిస్తాడు. తన అనుభవంతో గురుమూర్తి ప్రాతలో ఒదిగిపోయాడు. లక్ష్మణ్, తిరువీర్‌లు తమ పాత్రలకు ప్రాణం పోశారు. మిగతా తారాగణం వారి పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
కుల వివక్ష.. అప్పటికీ, ఇప్పటికీ సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. ఇలాంటి అతి సున్నితమైన అంశాన్నే కథాంశంగా తీసుకుని సినిమాను తెరకెక్కించిన దర్శకుడి ప్రయత్నానికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి కథలు కత్తి మీద సాము వంటిది. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పిన బొక్క బోర్లా పడటం ఖాయం. దీంతో తొలి సినిమాతోనే దర్శకుడు కరుణకుమార్ చాలా ధైర్యం చేశాడనే చెప్పాలి. అయితే తాను అనుకున్న కథ, కథాంశాన్ని పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ చేయడంలో కాస్త తడబడ్డాడనే చెప్పాలి.
సినిమా ప్రారంభమైన వెంటనే అసలు కథ ఏంటో అర్థమవుతుంది. అక్కడి నుంచి రొటీన్‌గా సాగిపోతూ ఉంటుంది. ఎందుకుంటే ఇలాంటి కథలు విన్నాం, చదివాం. ఇదివరకే ఎన్నో సినిమాల్లో చూశాం. అయితే ఏదైన డిఫరెంట్ పాయింట్ చెబుతాడనే ఆసక్తి.. ఏమైనా కొత్తదనం చూపిస్తాడని ఆశపడ్డ సగటు ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. ఒకే పంథాలో సినిమా సాగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే లవ్ సీన్స్ అతికించినట్టు ఉంటాయి.
కులవివక్షను కూడా అంత బలంగా తెరపై చూపించలేదు. ఒకవేళ ఎక్కువగా చూపించి ఉంటే ప్రేక్షకుడు కథలో లీనమయ్యేవాడు. ఎమోషన్స్ సీన్లు కూడా ఎక్కడా టచ్ కావు. ఇక సినిమా మొత్తం ఉత్తరాంధ్ర స్లాంగ్‌లోనే మాటలు ఉంటాయి. అయితే ఉత్తరాంధ్ర స్లాంగే సినిమాకు బలం, బలహీనత. ఎందుకంటే కొన్ని చోట్ల ఆ మాటలు ఆకట్టుకోగా.. మరికొన్ని చోట్ల సరిగా అర్థం కాని పరిస్థితి ఎదురవుతుంది. ఇక అన్ని వర్గాల ప్రేక్షకునే విధంగా తీర్చిదిద్దడంలో ఇంకాస్త వర్క్ చేస్తే బాగుండేది.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. పాటలు బాగున్నా సినిమాకు అంతగా ప్లస్ కావు. రఘు కుంచె అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల ఆకట్టుకోగా మరికొన్ని చోట్ల రణగొనధ్వనులను తలపిస్తాయి. స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రేక్షకుడిని 1978 ప్రాంతంలోకి తీసుకెళ్లడానికి సినిమాటోగ్రఫీ, ఆర్ట్ విభాగం చాలానే కష్టపడ్డట్లు సినిమాను చూస్తే అర్థమవుతుంది. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సిఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఇలాంటి చిత్రాలు ఎక్కువగా మనం కోలీవుడ్‌లో చూస్తుంటాం.. మరి అప్‌డేట్ అయిన తెలుగు ప్రేక్షకులు పలాస ‘1978’ ను ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.
ప్లస్ పాయింట్స్:
డైరెక్టర్ ఎంచుకున్న కథ
నటీనటులు
మైనస్ పాయింట్స్:
స్లోనెరేషన్
కమిర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం
- సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్.
Comments
Please login to add a commentAdd a comment