ఆరేళ్లప్పుడు వేధింపులకు...పన్నెండేళ్లప్పుడు అత్యాచారానికి గురయ్యా!
‘‘లైంగిక వేధింపులు చేసేవాళ్లను క్షమించకూడదు. అలాంటివాళ్లు మనిషి రూపంలో ఉన్న మృగాలు’’ అని ఘాటుగా స్పందించారు పమేలా ఆండర్‌సన్. ఈ హాలీవుడ్ హాట్ లేడీ ఇటీవల ఓ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన గతాన్ని గుర్తు చేసుకుంటూ, ఆరేళ్ల వయసులోనే తాను లైంగిక వేధింపులకు గురయ్యానని పేర్కొన్నారు. ఇంకా అనేక విషయాలను పంచుకుంటూ - ‘‘నా చిన్నప్పుడు నన్ను చూసుకోవడానికి ఒకావిడ ఉండేది. మావాళ్లు లేని సమయంలో తను ఏదో చేసేది. నాకేమీ అర్థమయ్యేది కాదు. పెద్దయిన తర్వాతే ఆమె చేష్టలకు అర్థం తెలిసింది.
ఇక, పన్నెండేళ్ల వయసులో జరిగిన రెండు ఘోరాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఒకరోజు నా స్నేహితురాలి బోయ్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను. అతని అన్నయ్య ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. అదను చూసి అతను నా మీద అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఓ సందర్భంలో కొంతమంది నాపై సామూహిక అత్యాచారం జరిపారు. ఆ వయసులో ఆ విషయాన్ని బయటకు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాను... భయపడ్డాను కూడా. ఎక్కడ నన్ను తప్పుపడతారోనని నా సందేహం. కానీ, అప్పుడు మౌనం వహించడం తప్పు అని ఇప్పటికీ పశ్చాత్తాపపడుతున్నా. అందుకే, అంటున్నా అత్యాచారానికి గురైనవాళ్లు మౌనంగా ఉండకూడదు. న్యాయం కోసం ఏ స్థాయికైనా వెళ్లి, పోరాడాలి. సరైన శిక్ష పడేలా చేస్తే, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడాలనుకునేవారి సంఖ్య తగ్గుతుంది’’ అన్నారు పమేలా ఆండర్సన్.