‘పేపర్‌ బాయ్‌’ మూవీ రివ్యూ | Paper Boy Telugu Movie Review | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 31 2018 1:56 PM | Last Updated on Fri, Aug 31 2018 3:45 PM

Paper Boy Telugu Movie Review - Sakshi

టైటిల్ : పేపర్‌ బాయ్‌
జానర్ : రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌
తారాగణం : సంతోష్‌ శోభన్‌, రియా సుమన్‌ , తాన్య హోపే
సంగీతం : భీమ్స్‌ సిసిరొలియో
రచన : సంపత్‌ నంది
దర్శకత్వం : జయశంకర్‌
నిర్మాత : సంపత్‌ నంది, రాములు, వెంకట్‌, నరసింహా

మాస్ మసాలా చిత్రాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సంపత్‌ నంది నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తను నేను ఫేం సంతోష్‌ శోభన్‌ హీరోగా సంపత్‌ నంది నిర్మాణంలో జయశంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ పేపర్‌ బాయ్‌. ఈ సినిమా ట్రైలర్‌పై మహేష్ బాబు, ప్రభాస్‌ లాంటి స్టార్‌ హీరోలు ప్రశంసలు కురిపించటంతో సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. మరి ఆ అంచనాలను పేపర్‌ బాయ్‌ అందుకున్నాడా..? సంతోష్‌ శోభన్‌ హీరోగా ప్రూవ్‌ చేసుకున్నాడా..? సంపత్‌ నంది నిర్మాతగా విజయం సాధించాడా..?

కథ ;
రవి (సంతోష్‌ శోభన్‌) బీటెక్‌ చదివినా కుటుంబ పరిస్థితుల కారణంగా పేపర్‌ బాయ్‌గా పనిచేస్తుంటాడు. తన లాంటి ఆలోచనలే ఉన్న ధరణి (రియా సుమన్) అనే పెద్దింటి అమ్మాయిని ఇష్టపడతాడు. రవి మంచి తనం విలువలు గురించి తెలుసుకున్న ధరణి కూడా రవిని ఇష్టపడుతుంది. కూతురి ప్రేమకు గౌరవమిచ్చిన ధరణి తల్లిదండ్రులు తమ అంతస్తును పక్కన పెట్టి ఆటో డ్రైవర్‌ కొడుకు, పేపర్‌ బాయ్‌ అయిన రవితో పెళ్లికి ఓకె చెప్తారు. కానీ అనుకోని  పరిస్థితుల్లో రవి, ధరణి దూరమవుతారు. వారి విడిపోవడానికి కారణాలేంటి..? వీరి ప్రేమకథకు ముంబైలో ఉండే మేఘ (తాన్యా హోపే)కు సంబంధం ఏంటి..? రవి, ధరణిల ప్రేమకథ ఎలా ముగిసింది..?  అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
రెండో సినిమానే ఎంతో బరువైన పాత్రను ఎంచుకున్న సంతోష్‌ శోభన్‌ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. లవర్‌ బాయ్‌గా కనిపిస్తూనే ఎమోషనల్‌ సీన్స్‌లో కంటతడి పెట్టించాడు. బాధ్యత గల కుర్రాడి పాత్రలో కనిపించిన సంతోష్‌ ఫుల్‌ మార్క్స్‌ సాధించాడు. హీరోయిన్‌  రియా సుమన్‌ హుందాగా కనిపించారు. నటన పరంగానూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సీన్స్‌లో రియా చూపించిన ఎమోషన్స్‌ సూపర్బ్‌. తాన్య హోపే తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా  ఉన్నంతలో తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇతర పాత్రలో విద్యుల్లేఖ రామన్‌, మహేష్‌, బిత్తిరి సత్తి, అభిషేక్‌ కాసేపు నవ్వించే ప్రయత్నం చేశారు.

విశ్లేషణ ;
పేదింటి అబ్బాయి.. పెద్దింటి అమ్మాయిని ప్రేమించటం అనే కాన్సెప్ట్ తెలుగు సినిమాకు హిట్ ఫార్ములా. ఇప్పటికే ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే అదే కథను కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు జయశంకర్‌. సంపత్‌ నంది రచన సినిమాకు హెల్ప్‌ అయ్యింది. కవితాత్మకంగా సాగే సంభాషణలు ఆకట్టుకుంటాయి. భీమ్స్‌ సంగీతం, సురేష్‌ బొబ్బిలి నేపథ్య సంగీతం సరిగ్గా కుదిరాయి. అయితే సినిమాను ఇంట్రస్టింగ్‌ పాయింట్‌తో మొదలు పెట్టిన దర్శకుడు ఆ టెంపోను కంటిన్యూ చేయటంలో కాస్త తడబడ్డాడు. నెమ్మదిగా సాగే కథనం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. అదే సమయంలో కథతో సంబంధం లేని కామెడీ సీన్స్‌ కథనంలో స్పీడ్‌ బ్రేకర్లలా మారాయి. సౌందర్‌ రాజన్‌ సినిమాటోగ్రఫి సినిమాకు కలర్‌ ఫుల్ లుక్‌ తీసుకువచ్చింది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ ;
సంతోష్‌ శోభన్‌, రియా సుమన్‌ నటన
నేపథ్య సంగీతం
మాటలు

మైనస్‌ పాయింట్స్‌ ;
నెమ్మదిగా సాగే కథనం
కథకు అడ్డుపడే కామెడీ సీన్స్‌

సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement