
అతనంటే కోపం కాదు... ఆమె అంటే ఇష్టం లేక!
బాలీవుడ్‌లో గోల్డెన్ హ్యాండ్ అంటే సల్మాన్ ఖానే. ఆయన సరసన హీరోయిన్ చాన్స్ అంటే స్టార్ హాదాకు షార్ట్ కట్‌గా భావిస్తారు. అలాంటి అవకాశం తలుపు తడితే మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకుంటారు కూడా. కానీ పరిణీతి చోప్రా మాత్రం ఆయన సినిమాలో చేయనని తెగేసి చె ప్పారట. ఆ సినిమా మరేదో కాదు... ‘సుల్తాన్ ’. విశేషమేమిటంటే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న యశ్‌రాజ్ ఫిలింస్ ద్వారానే పరిణీతి బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అయినా సరే ఆదిత్యా చోప్రా ఇచ్చిన ఆఫర్‌కు పరిణీతి చోప్రా ‘నో’ చెప్పేశారు.
ఎందుకనుకుంటున్నారా? ‘సుల్తాన్’ చిత్రం కోసం ఇద్దరు కథానాయికలను ఎంపిక చేయాల్సి ఉంది. దీని కోసం ఆదిత్యా చోప్రా అన్వేషణ మొదలుపెట్టారు కూడా. చాలామంది స్టార్ హీరోయిన్ల పేర్లను కూడా పరిశీలించారు. ఆ లిస్ట్‌లో దీపికా పదుకొనే, కృతీ సనన్, కంగనా రనౌత్‌ల పేర్లు ఉన్నాయి. వాళ్లు బిజీగా ఉండడంతో ఫైనల్‌గా అనుష్కా శర్మ, పరిణీతి చోప్రాలను సంప్రతించారట.
అనుష్క శర్మ మాటేమో గానీ పరిణీతి చోప్రా మాత్రం ‘నో’ చెప్పారట. అనుష్కాశర్మ పక్కన సెకండ్ హీరోయిన్‌గా చేయడం ఇష్టం లేక ఈ ఆఫర్‌ను కాదనుకున్నారట. ఈ చిత్రానికి సల్మాన్ ఖాన్ హీరో అయినా, తనకు లైఫ్‌నిచ్చిన ఆదిత్యా చోప్రా నిర్మాత అయినా సరే ఆమె ఒప్పుకోలేదంటే అనుష్కా శర్మతో ఆమె సంబంధాలు ఎంతగా చెడిపోయాయో ఊహించుకోవచ్చు.