
మహేశ్‌బాబుతో పరిణీతీ చోప్రా!
ఈ సమ్మర్ సీజన్‌లో అందరూ ఎదురుచూస్తున్న సినిమాల జాబితాలో ముందు వరుసలో ఉన్న సినిమా - మహేశ్‌బాబు ‘బ్రహ్మోత్సవం’.
ఈ సమ్మర్ సీజన్‌లో అందరూ ఎదురుచూస్తున్న సినిమాల జాబితాలో ముందు వరుసలో ఉన్న సినిమా - మహేశ్‌బాబు ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉండడంతో హీరో మహేశ్‌బాబు బిజీ బిజీ. ఈ నెల 24న తిరుపతిలో ఈ సినిమా పాటల్ని విడుదల చేసేందుకు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి బృందం సన్నాహాలు చేస్తోంది. మే నెలలో సినిమా రిలీజ్. ఒకపక్క ఈ వ్యవహారం సాగుతూ ఉండగానే మహేశ్‌బాబు తరువాయి చిత్రానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నట్లు కృష్ణానగర్ కబురు.
పరిణతి చెందిన దర్శకుడు - పరిణీతి హీరోయిన్
ఇంతకీ, మహేశ్‌బాబు తరువాత సినిమా ఏమిటి? దర్శకుడెవరు? ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్‌కు ఈ లక్కీ ఛాన్స్ దక్కింది! ప్రముఖ నిర్మాతలు ‘ఠాగూర్’ మధు, ఎన్.వి. ప్రసాద్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశేషం ఏమిటంటే, ఈ సినిమాలో మహేశ్‌బాబు సరసన ఒక ప్రముఖ హిందీ హీరోయిన్ నటించనున్నారు. ఆమె ఎవరో కాదు... ప్రస్తుతం అందరి నోటా హాట్ టాపిక్కైన ప్రియాంకా చోప్రా కజిన్ పరిణీతీ చోప్రా అని బోగట్టా.
అయిదేళ్ళ క్రితం హిందీ చిత్రం ‘లేడీస్ వర్సెస్ రికీ బెహ్ల్’ (2011)తో పరిచయమై ఉత్తమ నూతన నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకొన్న చరిత్ర పరిణీతిది. అలాగే, ఆ వెంటనే ‘ఇషక్‌జాదే’ (2012)తో ప్రత్యేక ప్రశంసగా జాతీయ అవార్డు, ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘హసీ తో ఫసీ’ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారామె. ఆమెను మహేశ్‌బాబు సరసన నటింపజేయడానికి దర్శక, నిర్మాతలు చర్చలు జరిపినట్లు సమాచారం. ఆమిర్‌ఖాన్ హిందీ ‘గజినీ’తో ఉత్తరాదినా పేరున్న మురుగదాస్ తన స్క్రిప్ట్‌తో 27 ఏళ్ళ పరిణీతిని మెప్పించారట! సినిమా చేయడానికి అంగీకరించిన ఈ నార్త్ హీరోయిన్ త్వరలోనే లాంఛనంగా ఆ విషయాన్ని ప్రకటిస్తారట!
తండ్రి పుట్టినరోజున ప్రారంభం?
ది ఇలా ఉండగా, ఈ చిత్రానికి మరో స్టార్ ఎట్రాక్షన్ కూడా ఉంది. సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మణిరత్నం తీసిన ‘రోజా’, ‘ఇరువర్’ (ఇద్దరు), ‘దిల్ సే’ నుంచి ‘అశోక’, ‘కాలాపానీ’, ‘ఉరిమి’ తదితర చిత్రాలకు వెన్నెముకగా నిలిచింది ఈ జాతీయ అవార్డు విజేతే. ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అన్నట్లు, మహేశ్‌బాబు తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31వ తేదీన లాంఛనంగా ఈ చిత్ర ప్రారంభోత్సవం జరపాలని యోచిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల కథనం.