ఆగస్టు 15, 1947. భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిన రోజు. ఆ రోజును ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటాం. జాతీయ జెండాను ఎగురవేసి రొమ్ము విరుచుకొని రోమాలు నిక్కబొడుచుకొనేలా దిక్కులు పిక్కటిల్లేలా ‘భారత్ మాతా కీ జై’ ‘మేరా భారత్ మహాన్’ ‘జెహింద్’ అంటూ దేశం నలుమూలలా సంబరాలు జరుపుకుంటాం. అలా దేశమంతా ఒక్కతాటిపైకొచ్చి మనమంతా ఒక్కటే అని చాటి చెప్పే రోజుగా మనందరం పంద్రాగస్టును గుర్తుపెట్టుకుంటాం. అలాంటి ఒక రోజుతో పాటు భారతీయుల మేథాశక్తికి గుర్తుగా ‘నేషనల్ టెక్నాలజీ డే’ అని ఓ రోజును ప్రకటించింది భారత ప్రభుత్వం. ఆ రోజే మే 11. భారతదేశమంతా గర్వించిన రోజు. విజయగర్వంతో ఉప్పొంగిన రోజు. టెక్నాలజీ డేగా ఎందుకు ఆ రోజునే ప్రకటించిందంటే– మొదటిసారిగా భారతదేశంలో అణుపరీక్ష జరిగి విజయవంతమైన రోజు.
మేము ఎవ్వరికంటే తక్కువ కాదు అని ప్రపంచ దేశాలకి చాటిచెప్పిన రోజు. అందుకే ఆ రోజుకంతటి విశిష్టత.ఇక ‘పరమాణు’ సినిమా విషయానికొస్తే ఇది ఒక ట్రూ స్టోరీ అని అందరికి తెలిసిన విషయమే. అణు పరీక్ష నిర్వహించాలంటే ప్రపంచ దేశాలు ఓ పట్టాన ఈ పరీక్ష నిర్వహించటానికి ఒప్పుకోవు. అందుకే ఇది దేశంలోని అన్నిటికంటే చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎంతో రహస్యంగా ఈ మిషన్‌ను ఇండియన్ ఆర్మీ పూర్తిచేసింది. ‘పరమాణు’ పూర్తిగా భారత్ నిర్వహించిన ‘పోఖ్రాన్’ అణుపరీక్షపై రూపొందిన సినిమా. ‘పరమాణు’ సినిమాను ఆద్యంతం ఉత్కంఠతో ముందుకు నడిపించారు దర్శకుడు‘అభిషేక్ శర్మ’. నిజానికి ఇటువంటి తరహాలో సినిమాలు రావడం ఇది మొదలు కాదు... అలియా భట్ ప్రముఖ పాత్రలో నటించిన ‘రాజీ’, తెలుగులో రానా ‘ఘాజీ’ కూడా ఇలాంటివే.
పరమాణు కథ.....
ఈ సినిమా అభిషేక్ శర్మ దృష్టి కోణం నుండి చూస్తే ప్రధానమంత్రి రక్షణ కార్యాలయం నుండి కథ ప్రారంభం అవుతుంది. అశ్వథ్ రాణా (జాన్ అబ్రహామ్) ఓ సిన్సియర్ ఐ.ఏ.ఎస్ అధికారి. అణుపరీక్షలను నిర్శహించటానికి 1995లో అప్పటి ప్రభుత్వం నియమించిన కమిటీలో కీలక సభ్యుడు. ప్రభుత్వం తరపున ప్రధానమంత్రి సెక్రటరీ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేస్తారు. ఆ కమిటీ మీటింగ్‌కు హాజరైన వారందరూ అదొక దేశానికి సంబంధించిన కీలక సమావేశంలా కాకుండా ఏదో పిచ్చాపాటి మీటింగ్‌లా వ్యవహరిస్తుంటారు. ఆ మీటింగ్‌లో అశ్వథ్ రాణా మాత్రం తాను ఎన్నో విషయాలను చర్చించటానికి వచ్చాను ఇలా పిచ్చాపాటి మాట్లాడుకోటానికి కాదు అని చెప్తాడు. అక్కడ ఉన్న అందరూ ఇతన్ని చూసి నవ్వుకొంటారు.
అయినప్పటికీ తను ఊరుకోకుండా తన దగ్గర ఎంతో విలువైన సమాచారంతో పాటు ఈ అణు పరీక్షను ఏ విధంగా నిర్వహించాలి అనే దాని గురించి క్లియర్‌గా వివరిస్తాను అని ప్రధానమంత్రి కార్యాలయ అధికారికి వివరిస్తాడు. ఆ మీటింగ్‌లో ఉన్నవారందరూ అతన్ని చూసి నవ్వుతుంటే ‘ఇంకా టీ, సమోసా రావాటానికి ఎట్లాగూ టైం ఉంది. ఈలోపు నువ్వు చెప్పదలుచుకుంది, మాట్లాడవలసింది నిర్భయంగా చెప్ప’మంటాడు అక్కడున్న ఆఫీసర్. తన ఫ్లాపీలో కొంత సమాచారం ఉందని, దాన్ని ఓపెన్ చేస్తే విషయం తెలిసిపోతుందని అంటాడు అశ్వథ్. ఆ మాట పూర్తి అయ్యేలోపు టీ వస్తుంది. ఆ మీటింగ్‌లో ఉన్న ఒకతను ఆ ఫ్లాపీని తీసుకొని తన టీ కప్ కింద బాటమ్‌లా పెట్టుకుంటాడు. అది చూసి చిన్నబుచ్చుకుంటాడు ఈ ఐఏఎస్ ఆఫీసర్.
ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత పోఖ్రాన్‌లో అణు పరీక్షలు నిర్వహిస్తునట్లు అగ్రదేశమైన అమెరికా గుర్తించి భారత్‌ను హెచ్చరిస్తుంది. అప్పటికి ఆ పరీక్ష విఫలమవుతుంది. ఆ సంఘటనతో అశ్వథ్ రాణాను విధులనుండి తొలగిస్తుంది ప్రభుత్వం. ఆ తర్వాత సంవత్సరమే ప్రభుత్వం మారుతోంది. అప్పుడు ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఉంటారు. ఆయన సెక్రటరీగా హిమాన్ష్ శుక్లా (బొమన్ ఇరానీ) చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఈయన ఈ మిషన్ చేస్తున్నట్లు ఎవ్వరికి తెలియకుండా ‘ఆపరేషన్ శక్తి’ అనే పేరుతో సస్పెండైన ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ అశ్వథ్‌ను తిరిగి అణుపరీక్షను తన ఆధ్వర్యంలో నిర్వహించమని అడుగుతాడు. అప్పుడు జాన్ అబ్రహం ఎటువంటి షరతులతో తాను విధి నిర్వహణలో పాల్గొంటాడో బొమన్ ఇరానీకి చెప్తాడు.
అలా కుదిరిన ఆ ఒప్పందం వల్ల ఏం జరిగింది అనేది తర్వాత కథ. మిషన్లో పాల్గొన్న వారికి వారి వారి సొంత పేర్లు కాకుండా మారు పేర్లు పెట్టుకునే సీన్ చాలా బావుంటుంది. మహాభారతంలో పంచ పాండవుల పేర్లతో వీరిని వ్యవహరించడం అందరినీ ఆకట్టుకునే విషయం. కృష్ణుడి పాత్రను అశ్వథ్ రాణా (జాన్ అబ్రహం) పోషించడమే కాదు, మెప్పించాడు కూడా. ఈ మిషన్ కంప్లీట్ చేసే క్రమంలో శాటిలైట్ కంటపడకుండా అణుపరీక్ష ఎలా నిర్వహించారో, ఇది దేశభద్రతకు సంబంధించిన అంశం కావటంతో తమ ఇంట్లో వాళ్లకి కూడా తెలియకుండా ఎవరెవరు ఎంత కష్టపడ్డారు అనే సీన్స్‌ని చాలా కన్విన్సింగ్‌గా మలిచారు దర్శకుడు. ఈ ‘ట్రూ స్టోరీ’లో భారతదేశ రక్షణ విభాగాలైన బార్క్ (బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్), డీఆర్‌డీఓ(డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) ఇస్రో ( ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) ఇండియన్ ఆర్మీ తదితర అంతర్గత ప్రభుత్వ విభాగాల సహకారంతో ఈ మిషన్ విజయవంతమైనట్లుగా సినిమాలో చూపించారు.
మధ్య మధ్యలో ఆయా దేశాలకు చెందిన అప్పటి ప్రధానమంత్రులు బిల్ క్లింటన్ (అమెరికా) అటల్ బిహారీ వాజ్‌పేయ్ (ఇండియా) బెనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్ (పాకిస్తాన్)ల ఒరిజినల్ ప్రసంగాలను సినిమాలో ఆయా సందర్భాలకు తగ్గట్టు చూపించారు. ఈ సినిమాను జీ స్టూడియోస్‌తో పాటు జాన్ అబ్రహాం కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. కెమెరా పనితీరును ఖచ్చితంగా మెచ్చుకోవలసిందే. ‘పరమాణు: ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్’ 2018 పేరుతో ప్రపంచవ్యాపంగా శుక్రవారం రిలీజైంది. సినిమా బడ్జెట్ సుమారు 50 కోట్ల రూపాయలతో తెరకెక్కింది. ఎంత వసూళ్లను రాబడుతుందో వెయిట్ అండ్ సీ....
తారాగణం : జాన్ అబ్రహాం,
బొమన్ ఇరానీ, డైయానా పెంటీ
దర్శకుడు : అభిషేక్ శర్మ
నిర్మాణ సంస్థలు : జే ఏ(జాన్ అబ్రహాం) స్టూడియోస్, జీ స్టూడియోస్
మ్యూజిక్ : సచిన్ జిగర్
కెమెరా : అశీమ్ మిశ్రా, జూబిన్ మిస్త్రీ.
– శివ మల్లాల
Comments
Please login to add a commentAdd a comment