
ముంబై: టాప్ హీరో జాన్ అబ్రహం తాజాగా హిందీ చిత్రపరిశ్రమ బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో ఎంతమాత్రం లౌకికవాదం లేదని ఆయన తేల్చిచెప్పారు. బాలీవుడ్ సెక్యులర్‌గా ఉంటుందన్న వాదన ఫేక్ అని ఆయన కొట్టిపారేశారు. తన తాజా సినిమా ‘బాట్లా హౌస్’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్న జాన్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సెక్యులరిజంపై ఆయన మాట్లాడుతూ.. ‘బాలీవుడ్ సెక్యులర్ పరిశ్రమ అని ఎవరు చెప్పారు మీకు? బాలీవుడ్ వందశాతం సెక్యులర్ కాదు. పరిశ్రమ మతపరంగా చీలిపోయింది. ఇది జీవితకాల సత్యం’ అని పేర్కొన్నారు.
ప్రపంచమే మతపరంగా చీలిపోయందని, ప్రస్తుతమున్న ప్రపంచాన్ని మాత్రమే చిత్రపరిశమ్ర ప్రతిబింబిస్తోందని ఆయన వివరించారు. మతపరమైన చీలిక అనేది ఒక దేశానికి పరిమితమైన సమస్య కాదని, ఇది ప్రపంచమంతటా ఉందని, ఇదే విషయమై తన సినిమాలో డైలాగ్ కూడా ఉందని జాన్ పేర్కొన్నారు. ‘నా సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ‘ఒక వర్గమని కాదు. యావత్ ప్రపంచం ఈ సమస్యను ఎదుర్కొంటోంది. (డొనాల్డ్) ట్రంప్‌ను చూడండి. బ్రెగ్జిట్‌ను చూడండి. బోరిస్ జాన్సన్‌ను చూడండి. ప్రపంచమే నేడు మతపరంగా చీలిపోయింది. మనం ఈ ప్రపంచంలోనే నివసిస్తున్నాం. దీని మనం ఎదుర్కొని తీరాలి’.. ఇక నా వరకు ప్రపంచంలో మనం దేశం ఉత్తమమైనదని, మన చిత్ర పరిశ్రమ కూడా బెస్ట్ అని భావిస్తాను’ అని జాన్ తెలిపారు. నిజజీవిత సంఘటనలు, నిజజీవిత వ్యక్తులు ఆధారంగా తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని, యూరి, సూపర్ 30 వంటి సినిమాల విజయాలు ఇందుకు నిదర్శనమని జాన్ అభిప్రాయపడ్డారు.