'ఎంఎస్ ప్రేమపెళ్లి చేసింది నేనే'
హైదరాబాద్ : ఎంఎస్ నారాయణ నటుడుగా, రచయితగా మాత్రమే ప్రేక్షకులకు, చిత్ర పరిశ్రమకు తెలుసునని... అయితే అతడు తనకు విద్యార్థి అని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఎంఎస్కు తాను పాఠాలు చెప్పానని.. కులాంతర వివాహానికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోతే అతని పెళ్లికి పెద్దరికం వహించింది తానేనని చెప్పారు. కళాప్రపూర్ణను ఎంఎస్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్నారు. బతుకుదెరువు కోసం ఎంఎస్ ఓ సినిమా థియేటర్లో బుకింగ్ క్లర్క్గా పనిచేశాడని చెప్పారు.
అనుకున్నది చేయాలి, ఎవరికీ అన్యాయం చేయకూడదనేది ఎంఎస్ నైజం అని పరుచూరి తెలిపారు. ఎంఎస్, అతని భార్య కళాప్రపూర్ణ భీమవరంలో ఉద్యోగం చేసేవారని, చిత్ర పరిశ్రమలోకి వచ్చే ముందు తననే కలిశాడని ఆయన పేర్కొన్నారు. సినీ రచయితగా తన ప్రస్థానం ప్రారంభించాడని, అయితే ఒకానొక సమయంలో అవకాశాలు రాకపోవటంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావటంతో తిరిగి వెళ్లిపోతానని చెప్పాడని, అయితే ప్రతి ఒక్కరికీ మంచి రోజు వస్తుందని, అప్పటివరకూ ఓర్చుకోవాలని ఎంఎస్కు తాను ధైర్యం చెప్పానన్నారు.
ఆ తర్వాత 'మా నాన్నకు పెళ్లి' చిత్రం ద్వారా ఎంఎస్ దశ తిరిగిందని, అప్పటి నుంచి ఇప్పటివరకూ వెనక్కి తిరిగి చూడలేదని పరుచూరి అన్నారు. అనంతరం తనను కలిసిన ఎంఎస్ .. వెళ్లిపోవద్దని మంచి సలహా ఇచ్చారు మాస్టారు అని అన్నాడని ఆయన తెలిపారు. ఆరోగ్యం గురించి ఎంఎస్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని, గురువారం కూడా అతడిని చూశానని, అతనికి ఉన్న ధైర్యాన్ని చూస్తే త్వరగా కోలుకుంటాడనుకున్నానన్నారు. నిన్న ఉంటాడనుకున్న వ్యక్తి నేడు లేకపోవడం బాధాకరమని పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు.