
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొత్త కుంపటి!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొత్త కుంపటి పెట్టెందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా తిరుపతిలో ఈ నెల 30న జరగబోయే 'మెగా ఫ్యాన్స్ డే' అన్నదమ్ముల అభిమానుల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. దాంతో పవన్ అభిమానులు....సొంతంగా అభిమాన సంఘం ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. త్వరలోనే అభిమానుల సమావేశం నిర్వహించి రాష్ట్రస్థాయిలో అభిమాన సంఘం ఏర్పాటు చేయనున్నట్లు చిత్తూరు జిల్లా పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ తెలిపాడు.
'పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువత' పేరుతో అభిమాన సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇందు కోసం ముందుగా పవన్ కళ్యాణ్ అభిమానుల సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రాజమండ్రి లేదా విజయవాడ వేదిక కానుంది. ఇక ఈనెల 30 జరిగే మెగా అభిమానుల సమావేశానికి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని కిరణ్ తెలిపాడు. అలాగే తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న చిరంజీవి అభిమాన సంఘాల సమావేశానికి హాజరు కావద్దని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు అతను పేర్కొన్నాడు. మరోవైపు మెగాస్టార్ అభిమాన సంఘాల అధ్యక్షుడు స్వామినాయుడు మాత్రం చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపాడు. రాజకీయంగా పవన్‌ని వ్యతిరేకిస్తాం తప్ప.. చిరంజీవి సోదరుడిగా ఆయన్ని అభిమానిస్తామని చెప్పటం విశేషం.