పవన్ కల్యాణ్ టీవీ ఛానల్ పెడుతున్నారా?
హైదరాబాద్: ఇంట్లో పని వాళ్లకు జీతాలు ఇచ్చేందుకు, పార్టీ నడిపేందుకు డబ్బుల్లేవని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత మీడియాను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారా? టీవీ చానల్,లేదా పేపర్ పెట్టబోతున్నారా? 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్టు ఇటీవల తేల్చిచెప్పిన పవర్ స్టార్ తన ప్రచారం కోసం తన సొంత టీవీ, పత్రికా మాద్యమాన్ని ఉపయోగించుకోబోతున్నారా? అంటే అవుననే ఊహాగానాలు టాలీవుడ్ లో జోరుగా సాగుతున్నాయి.
సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టి 2019 ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జనసేన పోటీ చేయనున్నామని ఇటీవల జనసేన అధినేత మీడియాకు స్పష్టం చేశారు. తద్వారా పూర్తి సమయం రాజకీయాలకు అంకితం కానున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన టీవీ ఛానల్, లేదా పేపర్ పెట్టనున్నారనే వార్తలకు బరింత బలం చేకూరింది.
మరోవైపు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే క్రమంలో, తనపై , పార్టీపై చెలరేగే విమర్శల్ని సమర్ధవంతంగా తిప్పికొట్టాలనే ఆలోచనతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సొంత మీడియా ఉంటే మేలనే ఆలోచనతో కొత్త టీవీ ఛానల్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగా ముందు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించనున్నారని అంటున్నారు. ఆ తర్వాత ఓ ఛానల్ కూడా కొంటారని తెలుస్తోంది. దీనిద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలనే ప్రణాళికతో ముందుకు వెడుతున్నట్టుసమాచారం.
ఇప్పటికే పార్టీ నడిపేందుకు డబ్బులు లేవని చెప్పిన పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారనే ప్రశ్నలు గతంలోనే చాలా వినిపించాయి. మరి నెలగడవడం కష్టంగా ఉంది. ..చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని మీడియా ముందు ప్రకటించిన పవన్ ఓ టీవీ ఛానల్ పెట్టడం, ఓ న్యూస్ పేపర్ పెట్టడం లేదా టీవీ ఛానల్ కొనడం సాధ్యమయ్యే పనేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే.. మరింతకాలం వేచి చూడాల్సిందే..