పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది
సదువు సక్కంగా బుర్రకు ఎక్కని ఓ ఆవారా కుర్రాడు బీటెక్ పూర్తి చేస్తాడు. షెఫ్ కావాలనేది అతడి కోరిక. పిల్లను సూడనీకి ఓ ఇంటికి వెళ్లబోయి మరో ఇంటికి వెళ్తాడు. ఆ పిల్లేమో ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. మరక మంచిదే అన్నట్టు... రాంగ్ అడ్రస్‌కు వెళ్లడం వల్ల ఇద్దరికీ మేలు జరిగింది. విభిన్న వ్యక్తిత్వాలు గల ఇద్దరూ కలసి ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, తర్వాత ప్రేమలో పడతారు.
చిన్న సంఘర్షణ తర్వాత ఒక్కటవుతారు – తరుణ్ భాస్కర్ దర్శకునిగా పరిచయమైన ‘పెళ్ళి చూపులు’ చిత్రకథ సాదాసీదాగానే అనిపిస్తుంది. మరి, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఒకటి, ఉత్తమ సంభాషణలకు గాను తరుణ్ భాస్కర్‌కి మరొకటి... రెండు నేషనల్ అవార్డులు ఎందుకొచ్చాయి? అనడిగితే... ‘పెళ్లి చూపులు’లో సహజత్వం ఉంది. ‘నా సావు నేను సస్తా... నీకెందుకు?’ వంటి మాటలు నుంచి మొదలుపెడితే... ఇప్పటి యువతీయువకుల ఆలోచనా ధోరణి వరకూ ప్రతి అంశంలోనూ దర్శకుడు సహజత్వం చూపించాడు. ఏదో మన పక్కింట్లో, మనింట్లో జరిగే కథగా అనిపిస్తుంది. అందుకే, సూపర్ హిట్టయ్యింది.
కంటెంట్ ఈజ్ కింగ్
సినిమా సక్సెస్, ఇప్పటివరకూ వచ్చిన అవార్డులు ఒకెత్తు అయితే... నేషనల్ అవార్డు రావడం మరో ఎత్తు. సూపర్ స్టార్స్ చేసిన చిత్రమా? కొత్తవాళ్లు చేసిన చిత్రమా? అని ఆలోచించకుండా... సినిమా హైప్‌తో, బడ్జెట్‌తో సంబంధం లేకుండా... మా చిత్రాన్ని గౌరవించిన ప్రేక్షకులకు నమస్కరిస్తున్నా. ‘కంటెంట్ ఈజ్ కింగ్’ అని మేము ఏ నమ్మకంతో అయితే సినిమా తీశామో? ప్రేక్షకులు ఆ నమ్మకాన్ని నిలబెట్టారు.
‘పెళ్లి చూపులు’కు భారీ విజయాన్ని అందించారు. దీనివల్ల నేను లేదా మరో కొత్త నిర్మాత... ఎవరైనా కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీయడానికి ముందుకొస్తారు. ఈ ప్రోత్సాహాన్ని మరో పదిమంది స్ఫూర్తిగా తీసుకుంటారని ఆశిస్తున్నా. ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందిస్తే... మిగతా అంశాలు ఏవీ చూడకుండా ఓటు వేస్తారని మరోసారి రుజువైంది. ఈ సందర్భంగా ‘పెళ్లి చూపులు’ టీమ్, నిర్మాత డి. సురేశ్‌బాబుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. – నిర్మాత రాజ్ కందుకూరి
ప్రేక్షకుల వల్లే ఇది సాధ్యమైంది!
‘‘సూపర్ హ్యాపీ. ‘పెళ్ళి చూపులు’కు నేషనల్ అవార్డు వస్తుందని ఊహించలేదు. ఈ సినిమా రిలీజవుతుందా? లేదా? అని భయపడేవాణ్ణి. ప్రతి ఒక్కరి (ప్రేక్షకుల) ప్రశంసలతో ఇంత దూరం వచ్చింది. 2015లో మా నాన్నగారు చనిపోయారు. ఆయన ఆశీస్సులతోనే ఇవన్నీ దక్కుతున్నాయని అనుకుంటున్నా.
నాన్నగారు ఉండుంటే ఈ సంతోషం వేరేలా ఉండేదేమో. పైనుంచి ఆయన చూసి, ఆశీర్వదిస్తున్నారనే నమ్మకంతో హ్యాపీగా ఉన్నాను. ఇది పక్కన పెడితే... మా నిర్మాతలు నా ప్రతి అడుగులోనూ సపోర్ట్ చేశారు. మంచి ప్రయత్నం చేద్దామనుకున్నాం తప్ప... డబ్బులొస్తాయి, వందరోజులు ఆడుతుంది, నేషనల్ అవార్డు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది. దీన్నో గొప్ప బాధ్యతగా భావిస్తున్నా. – దర్శకుడు తరుణ్ భాస్కర్