టైటిల్: పెంగ్విన్
జానర్: సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్
నటీటులు: కీర్తి సురేష్, లింగా, మదంపట్టి రంగరాజ్, మాస్టర్ అద్వైత్, నిత్య తదితరులు
నిర్మాత: కార్తీక్ సుబ్బరాజ్, కార్తికేయన్ సంతానం, సుధన్ సుందరం, జయరాం
రచన- దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్
సంగీతం: సంతోష్ నారాయణ్
ఛాయాగ్రహణం: కార్తీక్ పళని
బ్యానర్: స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ఫ్యాషన్ స్టూడియోస్
విడుదల: అమెజాన్ ప్రైమ్ (జూన్ 19)
లాక్‌డౌన్ సినిమా పరిశ్రమకు లాక్ వేసింది. దీంతో కొన్ని షూటింగ్‌లు ఆగిపోగా మరికొన్ని విడుదల వాయిదా వేసుకున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఓటీటీ బాట పట్టాయి. ఇప్పటికే "అమృతరామమ్" చిత్రం ఓటీటీలో రిలీజైన విషయం తెలిసిందే. తాజాగా మహానటి కీర్తి సురేష్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ పెంగ్విన్ కూడా ఓటీటీకే ఓటేసింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా జూన్ 19న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? దీన్ని ప‌్రేక్షకులు ఆదరిస్తారా? లేదా? వంటి విషయాలను తెలుసుకుందాం..
కథ: రిథమ్(కీర్తి సురేష్), రఘు(లింగ)ల ఒక్కగానొక్క కొడుకు అజయ్. అజయ్ అంటే రిథమ్‌కు పంచప్రాణాలు. ఓ రోజు అజయ్ కిడ్నాప్ అవుతాడు. దీంతో అతడి కోసం తల్లిదండ్రులిద్దరూ అడవిలో అంగుళం అంగుళం జల్లెడ పట్టినప్పటికీ అజయ్ జాడ దొరకదు. పైగా ట్రైలర్‌లో చూపినట్లు అజయ్ దుస్తులు కనిపించగానే అతడు చనిపోయాడని అందరూ భావిస్తారు.. రిథమ్ తప్ప! ఇదే సమయంలో అజయ్ కోసం మానసికంగా కుంగిపోతున్న రిథమ్ నుంచి రఘు విడాకులు తీసుకుంటాడు. అయిన్పటికీ ఆమె తన అన్వేషణ మానదు.
ఈ క్రమంలో ఆమె గౌతమ్(రంగరాజ్)ను వివాహం చేసుకుని గర్భం దాల్చుతుంది. అయితే ఓరోజు సడన్‌గా రిథమ్‌కు అజయ్ కనిపిస్తాడు. ఇన్నిరోజులు అజయ్ ఏమైపోయాడు? అతనితోపాటు అపహరణకు గురైన ఆరుగురు పిల్లలు బతికే ఉన్నారా? అసలు వీరిని ఎందుకు కిడ్నాప్ చేశారు? చార్లీ చాప్లిన్ ముసుగు ధరించిన సీరియల్ కిల్లర్ ఎవరు? గర్భంతో ఉన్న కీర్తి అతడిని ఎలా ఎదుర్కొంది? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (లాక్‌డౌన్ ఎఫెక్ట్: అమెజాన్‌లో ఏడు సినిమాలు)
విశ్లేషణ: ప్రారంభ సన్నివేశంలోనే దర్శకుడు కథను ముందుగా పరిచయం చేస్తాడు. దీంతో ప్రేక్షకుడు స్టోరీ లైన్ అర్థమై కథలో లీనమయ్యేందుకు సిద్ధపడతాడు. తల్లి ప్రేమ కథతో సినిమాను ఎమోషనల్‌గా నడిపిస్తూనే సస్పెన్స్ క్రియేట్ చేశాడు. ప్రథమార్థంలో పట్టును చూపించినప్పటికీ.. ద్వితీయార్థంలో మాత్రం అక్కడక్కడా తేలిపోయాడు. ఎక్కువగా దర్శకుడు రిథమ్(కీర్తి)ని హైలెట్ చేయడానికే ప్రయత్నించాడని కొట్టొచినట్లు కనిపిస్తుంది. సినిమా ఇంకాస్త ఎడిటింగ్ చేస్తే బాగుండనిపిస్తుంది. సాంకేతికంగా సినిమా బాగుంది. సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. కథ బాగానే ఉన్న కథనంలో కొన్ని లోపాలతో కొన్నిచోట్ల గజిబిజిగా అనిపిస్తుంది. ఇక సినిమాలో దాదాపు తెలుగు ప్రేక్షకులకు తెలియని నటీనటులే ఉండటం కూడా ఓ మైనస్. (మిసెస్ సీరియల్ కిల్లర్: ఒక్కసారి చూడ్డమే ఎక్కువ)
కథ చివర్లో వచ్చే ట్విస్ట్ చూసి ప్రేక్షకులు పెదవి విరవడం ఖాయం. పైగా మొదటి నుంచి సీరియల్ కిల్లర్‌ను భయంకరంగా చూపిస్తూ చివర్లో మాత్రం కీర్తి కోసం అతడి బలాన్ని తక్కువ చేసినట్లు అనిపిస్తుంది. అజయ్‌ను ఎత్తుకుపోవడానికి గల కారణం కూడా సిల్లీగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఈ అంశాలను పక్కపెడితే థ్రిల్లర్ చిత్రాలిష్టపడేవారు తప్పకుండా ఓ సారి "పెంగ్విన్"ను చూసేయొచ్చు. నటనా పరంగా చూస్తే ఈ సినిమాను కీర్తి సురేశ్ తన భుజాలమీద మోసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కీర్తి ముందు మిగతా పాత్రలేవీ పెద్దగా కనిపించవు. ఈ చిత్రంలో ఉన్న ఏకైక పాట.. ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. (అజయ్ గురించి ఏమైనా తెలిసిందా?)
ప్లస్ పాయింట్స్
కీర్తి సురేష్ నటన
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
సాంకేతిక బృందం పనితీరు
మైనస్ పాయింట్స్
క్లైమాక్స్
ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు
Comments
Please login to add a commentAdd a comment