Keerthy Suresh Chinni Movie Review in Telugu - Sakshi
Sakshi News home page

Chinni Movie Review In Telugu: కీర్తి సురేష్ 'చిన్ని' సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే?

Published Fri, May 6 2022 3:33 PM | Last Updated on Sat, May 7 2022 12:57 PM

Keerthy Suresh Chinni Movie Review In Telugu - Sakshi

టైటిల్‌: చిన్ని
నటీనటులు: కీర్తి సురేష్, సెల్వ రాఘవన్, మురుగదాస్‌, కన్నా రవి, లిజీ అంటోని తదితరులు
కథ, దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్
నిర్మాత: డి. ప్రభాకరన్, సిద్ధార్థ్‌ రావిపాటి
సంగీతం: సామ్‌ సీఎస్‌
సినిమాటోగ్రఫీ: యామిని యజ్ఞమూర్తి
ఎడిటింగ్‌: నాగూరన్‌ రామచంద్రన్‌
విడుదల తేది: మే 6, 2022 (అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో)

'మహానటి' కీర్తి సురేష్‌ డీ గ్లామరైజ్‌ పాత్రలో నటించిన తాజా చిత్రం 'చిన్ని'. 'సాని కాయిధం' అనే తమిళ చిత్రాన్ని తెలుగులో 'చిన్ని' పేరుతో మే 6న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల చేశారు. ఈ మూవీలో కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌  సోదరుడు, డైరెక్టర్‌ సెల్వ రాఘవన్‌ కూడా ఓ కీలక పాత్రలో నటించారు. అయితే ఓవైపు కమర్షియల్‌ మూవీస్‌ చేస్తూనే మరోవైపు హీరోయిన్‌ సింట్రిక్‌ ఫిలీంస్‌తో అలరిస్తోంది కీర్తి సురేష్. అలా అరుణ్ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిన్ని సినిమా కథేంటి ? ఇందులో కీర్తి సురేష్‌ నటన ఎలా ఉంది ? సెల్వ రాఘవన్‌ పాత్ర ఏంటి ? అనే తదితర విషయాలను రివ్యూలో చూద్దాం.

కథ:
భర్త మారప్ప, ఐదేళ్ల కూతురు ధనతో కానిస్టేబుల్‌గా జీవితం సాగిస్తుంటుంది చిన్ని (కీర్తి సురేష్). గ్రామంలోని రైస్‌ మిల్లులో పని చేస్తున్న మారప్ప స్థానిక ఎన్నికల్లో పోటీ చేయలనుకుంటాడు. అది మారప్ప పని చేసే మిల్లు ఓనర్‌కు నచ్చదు. ఈ క్రమంలో మిల్లు ఓనర్‌తో జరిగిన గొడవ అతనిపై మారప్ప చేయిచేసుకునే వరకు వెళ్తుంది. దీన్ని పెద్ద అవమానంగా భావించిన మిల్లు ఓనర్‌, అతడి స్నేహితులు మారెప్ప కుటుంబాన్ని నాశనం చేయాలని అనుకుంటారు. చిన్ని కుటుంబాన్ని మిల్లు ఓనర్‌ ఏం చేశాడు ? దానికి చిన్ని ఏం చేసింది ? వారిపై ఎలా ప్రతికారం తీర్చుకుంది ? చిన్నికి రంగయ్య (సెల్వ రాఘవన్‌)కు ఉన్న సంబంధం ఏంటి ? అనే విషయాలే సముహారమే 'చిన్ని' సినిమా.

విశ్లేషణ: 
చిన్ని సినిమా స్టోరీ అంతా 1989 నాటి కాలంలో సాగుతుంది. అప్పటి సమాజంలో అగ్రవర్ణాలవారు పేదవారిని ఎలా చూసేవారనేది కథగా తెరకెక్కించాడు డైరెక్టర్‌ అరుణ్ మాథేశ‍్వరన్‌. ఇలాంటి రివేంజ్‌ డ్రామా కథలు ఇప్పటివరకు మనం చాలానే చూశాం. అయితే కథలో ఎంత భావోద్వేగపు సన్నివేశాలు ఉంటే ప్రేక్షకులు అంతగా ఆ సీన్లకు కనెక్ట్‌ అవుతారు. ఈ విషయంలో డైరెక్టర్‌ సఫలం అయ్యారనే చెప్పవచ్చు. చిన్ని కుటుంబంపై మిల్లు ఓనర్‌ చేసే దారుణాలు ఆడియెన్స్‌ను ఎమోషనల్‌ అయ్యేలా చేస్తాయి. సినిమాను బ్లాక్‌ అండ్‌ వైట్‌ థీమ్‌తో మొదలు పెట్టి, గతంలో జరిగిన విషయాలకు కనెక్ట్‌ అయ్యేలా ఆ సీన్లను కలర్‌లో చూపించడం బాగుంది. రివేంజ్‌ డ్రామా కాబట్టి ఈ మూవీలో సన్నివేశాలన్ని ప్రేక్షకుడు ఊహించినట్లే సాగుతాయి. 

చిన్ని, రంగయ్య చేసే హత్యలు హింసాత్మకంగా ఉన్నా ఆకట్టుకుంటాయి. ఈ సన్నివేశాలను ఆసక్తికరంగా, ఉత్కంఠగా తీర్చిదిద్దడంలో దర్శకుడు సక్సెస్ సాధించారనే చెప్పవచ్చు. కాకపోతే ఈ సీన్లు రియాల్టీకి దూరంగా ఉంటాయి. సినిమా పూర్తిగా లాజిక్‌గా దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. సినిమాలో ప్రతి పాత్రను వివరంగా చూపించే క్రమంలో సాగాదీసినట్లుగా ఉంటుంది. ఇలాంటి స్టోరీలో పాటలు లేకుండా ప్రేక్షకుడి సహనానికి పరీక్షపెట్టలేదనే చెప్పవచ్చు. క్రైమ్‌ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేసే సినీ ప్రియులకు 'చిన్ని' కచ్చితంగా నచ్చుతుంది. ఈ వారంలో ఓటీటీలో టైంపాస్‌కు సినిమా చూడాలనుకనే వారికి 'చిన్ని' ఒక బెటర్‌ ఆప్షన్.

ఎవరెలా చేశారంటే:
'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్ 'పెంగ్విన్', 'మిస్‌ ఇండియా', 'గుడ్‌లక్‌ సఖి' వంటి లేడి ఒరియంటేడ్‌ మూవీస్‌కే ఓటు వేసింది. అయితే కీర్తి సురేష్‌కు అవి అంతగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి. కానీ 'చిన్ని'తో తన నటనలోని కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసినట్లయింది. కుటుంబంతో కలిసి బతకాలన్న ఆశయం కలిగిన కానిస్టెబుల్‌గా 'చిన్ని' పాత్రలో కీర్తి సురేష్‌ ఆకట్టుకుంది. పగ, ప్రతీకారం తీర్చుకుంటునే తనను తాను కాపాడుకునే మహిళగా తాను చేసిన నటన ఎంతో అలరిస్తుంది. ఇక రంగయ్య పాత్రలో సెల్వరాఘవన్ ఒదిగిపోయారు. నటనలో ఆయన మార్క్‌ను చూపించారు. తదితర నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పవచ్చు. 

ఈ సినిమాకు సంగీతం ప్రధాన బలంగా అనిపిస్తుంది. సామ్‌ సీఎస్‌ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఎంతో ఆకట్టుకుంటుంది. దీంతో ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేస్తుంది. అయితే ఫైనల్‌గా డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్‌ తెరకెక్కించిన ఈ చిన్ని మూవీ కథ కొత్తేమి కాకున్నా తీర్చి దిద్దిన విధానం బాగుంది. స్క్రీన్‌ప్లే స్లోగా కాకుండా ఉంటే ప్రేక్షకుడికి సాగదీసినట్లుగా అనిపించేది కాదు. కాబట్టి స్లోగా ఉన్నా మంచి రివేంజ్‌ డ్రామా చూడాలనుకుంటే 'చిన్ని' మూవీని ట్రై చేయవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement