
దేశాన్ని ప్రేమిస్తే ఓటేయండి
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. గెలుపు కోసం రాజకీయ నాయకులు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సినిమా వాళ్ల పాత్ర అధికంగానే ఉంది. కొందరు ప్రత్యక్షంగాను, మరి కొందరు పరోక్షంగానూ రాజకీయాల్లో మమేకం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో నటుడు మాధవన్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది.
తానే పార్టీ గురించి మాట్లాడడం లేదంటూనే ఓటు హక్కును ఉపయోగించుకోండంటూ ప్రకటనలు చేయడంతో ఆయన ఆలోచనా ధోరణి ఏమిటి అన్న ఆరా తీసే పనిలో కొందరు నిమగ్నమయ్యారు. ఇంతకీ నటుడు మాధవన్ ఏమన్నారంటే రానున్న పార్లమెంటు ఎన్నికలు చాలా ముఖ్యమైనవి.
కాబట్టి ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది సగటు మనిషి బాధ్యత. అయితే నేనే రాజకీయ పార్టీ గురించి ప్రస్తావించడం లేదు. ‘‘దేశాన్ని ప్రేమించే వారైతే ఓటేయండి. మీ ఓటు ఈ దేశ తలరాతను మారుస్తుంద’’ని మాధవన్ వ్యాఖ్యానించారు.