
సాక్షి, చెన్నై: ప్రైవేటు నగల దుకాణానికి విచ్చేసిన హీరోయిన్ సమంతను చూసేందుకు వచ్చిన అభిమానులు దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సివచ్చింది. తమిళనాడు కృష్ణగిరి జిల్లా కేంద్రంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓ ప్రైవేట్ నగల దుకాణం ప్రారంభోత్సవానికి అంబాసిడర్‌గా ఉన్న సమంత వచ్చారు. ఈ విషయం తెలుసుకుని ఆమెను చూసేందుకు వేలాది మంది దుకాణం ముందు గుమిగూడారు. దుకాణం ప్రారంభించిన అనంతరం బయటకు వచ్చిన సమంత అభిమానులకు చేతులు ఊపుతూ తన కారు ఎక్కేందుకు ప్రయత్నించింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఆమె కారు వద్దకు దూసుకు వచ్చారు.
పోలీసులు అప్రమత్తమై సమంతను కారులో ఎక్కించి అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశారు. కానీ అభిమానులు కారు వైపుకు దూసుకురావడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అభిమానులను చెదరగొట్టేందుకు పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయటంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అభిమానుల హడావుడి, పోలీసుల లాఠీచార్జ్ నేపథ్యంలో కృష్ణగిరిలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment