ఉత్తరాది అబ్బాయి అయితే బెటర్
సీనియర్ కథానాయికలు చాలా మంది పెళ్లిపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం అగ్ర నాయకిగా వెలుగొందుతున్న నయనతార దర్శకుడు విఘ్నేశ్‌శివతో ఇప్పటికే సహజీవనం చేస్తున్నారనే వదంతులు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ రహస్య వివాహం చేసుకున్నారనే దుమారం ఒక పక్క రేగుతోంది. ఇక నటి అనుష్క, సమంత, ప్రియమణి ఇలా పలువురు వచ్చే ఏడాది మాంగల్యం తంతుకు సిద్ధం అవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. తాజాగా ఈ పట్టికలో నటి పూర్ణ చేరారు. ఈ కేరళ కుట్టి తాను పెళ్లికి రెడీ అంటున్నారు. ఈ అమ్మడు ఒక ఉత్తరాది యువకుడిని మనువాడడానికి రెడీ అవుతున్నట్లు ఇప్పటికే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీని గురించి పూర్ణ స్పందిస్తూ ఇంట్లో తనకు వరుడ్ని చూసే ప్రయత్రాలు ముమ్మరంగా జరుగుతున్న విషయం తెలిసిందేనన్నారు.
తన భవిష్యత్‌ను ఎలా తీర్చిదిద్దాలన్నది వారికి బాగా తెలుసన్నారు. అందుకే తాను ఎవరినీ ప్రేమించలేదన్నారు. తన పెళ్లి వచ్చే ఏడాది కచ్చితంగా ఉంటుందని అన్నారు. అయితే ఒక మలయాళ పత్రిక విలేకరి ఎలాంటి జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారని అడగ్గా ఉత్తరాదికి చెందిన యువకుడైతే బాగుంటుందని బదులిచ్చాననీ, దాన్ని పట్టుకుని పూర్ణ నార్త్ ఇండియన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేస్తున్నారనీ చెప్పారు. నిజానికి వరుడు కుదిరితే తానే బహిరంగంగా వెల్లడిస్తానని పూర్ణ అన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన రెండు తెలుగు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయట. తమిళంలో సవరకత్తి, చతురంగవేట్టై–2, అమ్మాయి చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు.