దక్షిణాది సినీ అవార్డుల సంరంభం షురూ!
హిందీ సినిమాకు సంబంధించి పదహారేళ్ళుగా ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ’ (ఐఫా) ఉత్సవాలు తొలిసారిగా దక్షిణాదికి విస్తరించాయి. దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రాంతీయ భాషల (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం) సినిమాల ప్రముఖులనూ ఒకే వేదికపై తీసుకు వచ్చాయి. రెండు రోజుల ఈ దక్షిణాది సినీ అవార్డుల సంరంభానికి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఔట్‌డోర్ స్టేడియమ్ వేదిక అయింది. జియోనీ, రేనాల్ట్ సంస్థల సహ సమర్పణలో ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అందిస్తున్న ఈ ‘ఐఫా - ఉత్సవమ్’ తొలి నాటి వేడుకలు ఆదివారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఉత్సవాల ప్రారంభానికి ముందు ఆదివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ‘ఐఫా’ నిర్వాహకులైన ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ ‘విజ్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్’ డెరైక్టర్ విజ్ సబ్బాస్ జోసెఫ్ వేడుకల వివరాలను తెలిపారు. ‘ఐఫా-ఉత్సవమ్’ పేరిట దక్షిణాది లోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలు నాలుగింటిలోని ప్రతిభను గుర్తించి, అవార్డులు అందించడానికి ‘ఐఫా’ సన్నద్ధమైనట్లు ఆయన చెప్పారు. ఆదివారం రాత్రి పొద్దుపోయాక తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. సోమవారం నాడు తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల వేడుక జరుగనుంది. ఈ వేడుక కోసం పలువురు ప్రముఖ తారలు, సాంకేతిక నిపుణులు భాగ్యనగరానికి విచ్చేశారు.
ఈ అవార్డులకో బ్రాండ్ ఇమేజ్ ఉంది!
- పార్లమెంటు సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి
‘‘హిందీ పరిశ్రమ తర్వాత అత్యధిక సంఖ్యలో సినిమాలను నిర్మించే పరిశ్రమగా తెలుగు చిత్ర పరిశ్రమకు గుర్తింపు ఉంది. ‘ఐఫా’ అవార్డులకు ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. విజ్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతి ఏటా ఈ వేడుకలను చాలా అద్భుతంగా నిర్వహిస్తుంది. అలాంటి ఈ అవార్డు వేడుకలు తొలిసారిగా దక్షిణాదికి రావడం, హైదరాబాద్‌లో నిర్వహించడం ఆనందంగా ఉంది.’’
హైదరాబాద్ బెస్ట్ ప్లేస్!
- బి. వెంకటేశమ్, తెలంగాణ ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి
‘‘మొదటి నుంచి సాంస్కృతిక వేదికగా హైదరాబాద్‌ను నంబర్‌వన్ చేయాలనే ఆలోచనతో విశేషమైన కృషి చేస్తున్నాం. ఇలాంటి వేడుకలకు హైదరాబాద్ అనువైన స్థలం. ‘ఐఫా’ వేడుకలకు హైదరాబాద్‌ను శాశ్వత వేదికగా మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.’’
విజ్ సబ్బాస్ జోసఫ్, విజ్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్
- ‘ఐఫా’ డెరైక్టర్
‘‘‘ఐఫా- ఉత్సవమ్’ వేడుకలను డిసెంబరులోనే నిర్వహించాల్సి ఉంది. కానీ హఠాత్తుగా చెన్నైను వరదలు ముంచెత్తడంతో సంఘీభావంగా ఈ వేడుకలను వాయిదా వేశాం. గతంలో జరిగిన ఉత్తరాది వేడుకలకు ఏ మాత్రం తీసిపోకుండా చరిత్రలో నిలిచిపోయేలా ఈ అవార్డు వేడుకలను ప్లాన్ చేస్తున్నాం.’’
అప్పట్లో అందరూ చెన్నయ్‌లోనే
- శివరాజ్‌కుమార్, ప్రముఖ కన్నడ హీరో
‘‘హిందీ పరిశ్రమకే కాకుండా దక్షిణాది పరిశ్రమకు కూడా ఈ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉంది. మా నాన్నగారు రాజ్‌కుమార్ ఉన్న సమయంలో అన్ని భాషల సినీ పరిశ్రమల వాళ్ళూ చెన్నైలోనే ఉన్నారు. అలాంటి చెన్నై వరదబాధితుల బాధను అర్థం చేసుకుని అన్ని భాషల వాళ్ళూ ముందుకు వచ్చారు. ఇప్పుడు జరిగే వేడుకల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.’’
వాళ్ల డ్యాన్స్ కోసం ఎదురుచూస్తున్నా!
- ప్రియమణి
‘‘ చెన్నై వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించడం కోసం ఫండ్‌రైజర్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉంది. హీరోయిన్స్‌తో పాటు రామ్‌చరణ్, అఖిల్, జీవా లాంటి అగ్ర హీరోలు కూడా పెర్ఫార్మ్ చేస్తున్నారు. అగ్ర హీరోలు ఇలా ఆహూతుల సమక్షంలో వేదికపై నర్తించడం ఇదే తొలిసారి. వాళ్ళందరి డ్యాన్స్ కోసం ఎదురుచూస్తున్నా!’’
తమిళనాడు ప్రభుత్వం తరపున థ్యాంక్స్!
- నాజర్, ప్రముఖ సినీ నటుడు
డిసెంబర్‌లో జరగాల్సిన ‘ఐఫా- ఉత్సవమ్’ వేడుకను తమిళనాడు వరద బాధితులకు సంఘీభావంగా ఇప్పటి దాకా వాయిదా వేసినందుకు నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. వచ్చే ఏడాది చెన్నైలో ఈ వేడుకలను జరపాలని కోరుకుంటున్నా.’’
మన హైదరాబాద్‌కు కొత్త కళ
- దేవిశ్రీ ప్రసాద్, ప్రముఖ సంగీత దర్శకుడు
‘‘ ‘ఐఫా’ వేడుకలు మన ఊరికి రావడంతో హైదరాబాద్‌కు కొత్త కళ వచ్చింది. ‘శ్రీమంతుడు’ సినిమాకుగానూ మ్యూజిక్ డెరైక్టర్ గా, అలాగే ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ‘సూపర్ మచ్చీ’ సాంగ్‌కు గీత రచయితగా అవార్డులకు నామినేట్ అయ్యాను. అవార్డు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నాకు ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ కావడం ఇష్టం. అందుకే, ఈ వే డుకల్లో మంచి పాటలతో ఓ ఊపు ఊపడానికి రెడీ అవుతున్నా’’
సినీ పరిశ్రమలో దాదాపు సగం దక్షిణాదిదే!
- ర సూల్ పూకుట్టి, ‘ఆస్కార్’ అవార్డ్ గెలిచిన ప్రముఖ సౌండ్ ఇంజనీర్
‘‘ ‘ఐఫా’ వేడుకలను నిర్వహిస్తున్న విజ్ క్రాఫ్ట్ సంస్థతో నాకు 20 ఏళ్ల అనుబంధం ఉంది. దక్షిణాదిలో ఎందుకు చేస్తున్నారని నిర్వాహకులను అడిగాను. భారతీయ సినీ పరిశ్రమ వ్యాపార గణాంకాలను చూస్తే, పరిశ్రమలో 45 శాతం వాటా దక్షిణాదిదే. దాదాపు 17 వేల కోట్ల టర్నోవర్ ఉన్న దక్షిణాదిలో ఇలాంటి వేడుకలను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ‘ఐఫా - ఉత్సవమ్’లో కేవలం గ్లామరే కాకుండా చెన్నై వరద బాధితులను ఆదుకోవడమనే మానవీయ కోణం కూడా ఉంది.’’ ఈ మీడియా సమావేశంలో ప్రముఖ నిర్మాతలు డి.సురేశ్‌బాబు, కె.ఎస్. రామారావు, కథానాయికలు తాప్సీ, మమతా మోహన్‌దాస్, ఆదాశర్మ, నిఖిత, పారుల్ యాదవ్, హీరో నవదీప్ తదితరులు పాల్గొన్నారు.
సూపర్‌హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తున్నా!
- రామ్‌చరణ్, ప్రముఖ హీరో
ఈ వేడుకల గురించి అగ్ర తెలుగు హీరో రామ్‌చరణ్ ఒక ప్రకటన చేస్తూ, ‘‘దక్షిణాది పరిశ్రమను సత్కరించడానికి ‘ఐఫా’ చేస్తున్న కృషి అభినందనీయం. ఎంటర్‌టైన్‌మెంట్ దృష్టితోనే కాకుండా ఓ ఫండ్ రైజర్‌గా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి సారిగా సౌత్‌లో జరిగే ఈ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో సౌత్ ఇండియన్ సినిమాల్లోని సూపర్‌హిట్ సాంగ్స్‌కు లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నా’’ అని తెలిపారు.