* చికిత్స పొందుతూ మృతి
* నాలుగేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న నటుడు
* రెండ్రోజుల క్రితం కిమ్స్‌లో చేరిక
* ప్రసాద్ మృతిపై అభిమానులు, సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి
* ఆహుతి సినిమాతో గుర్తింపు..‘చందమామ’తో ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది అవార్డు
* నేడు అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు ‘ఆహుతి’ ప్రసాద్ (57) కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించారు. ‘ఆహుతి’ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన పూర్తిపేరు అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్. 122 చిత్రాల్లో నటించిన ఆయన విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా మంచి గుర్తింపు పొందారు. నాలుగేళ్ల నుంచి పెద్దపేగు చివరి భాగంలో కేన్సర్‌తో బాధపడుతున్నారు.
శనివారం సాయంత్రం అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. కుటుంబ సభ్యులు ఆయనను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆహుతి ప్రసాద్ మృతితో బంధువులు, అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రసాద్ భౌతిక కాయాన్ని మధ్యాహ్నం ఫిలింనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు.
భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం సోమవారం ఉదయం ఫిలిం చాంబర్‌లో ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రసాద్ మరణంతో ఆయన స్వస్థలమైన కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలంలోని కోడూరు ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన అప్పుడప్పుడు కోడూరుకు వచ్చి అందరినీ కలిసి వెళ్లేవారని గ్రామస్తులు పేర్కొన్నారు.
సినిమాలంటే చాలా ఇష్టం..
కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం కోడూరులో 1958 జనవరి 2న ఉపాధ్యాయుడు రంగారావు, హైమావతి దంపతులకు ఆహుతి ప్రసాద్ జన్మించారు. అనంతరం ఆయన కుటుంబం కర్ణాటకలోని గంగావతికి వలస వెళ్లింది. ప్రసాద్‌కు మొదట్నుంచీ సినిమాలంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్‌కు ఆయన వీరాభిమాని. సినిమాల్లోకి రావాలనే తపనతో ప్రసాద్ హైదరాబాద్‌లోని మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నారు. తర్వాత కొంతకాలం దేవదాస్ కనకాల యాక్టింగ్ స్కూల్‌కు ఇన్‌చార్జిగా ఉన్నారు.
హీరో నాగార్జున తొలి చిత్రం ‘విక్రమ్’తో ప్రసాద్ నటుడిగా పరిచయమయ్యారు. అనంతరం ‘ఆహుతి’ చిత్రంతో మంచి గుర్తింపు రావడంతో... అప్పటి నుంచి ఆయన పేరు ఆహుతి ప్రసాద్‌గా స్థిరపడిపోయింది. తర్వాత కొన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. నాగార్జున హీరోగా వచ్చిన ‘నిన్నే పెళ్లాడుతా’ చిత్రంతో ఆహుతి ప్రసాద్ సెకండ్ ఇన్నిం గ్స్ మొదలైంది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘చందమామ’ ఆయన సినీ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. ఆ తర్వాత తండ్రి పాత్రలు, కామెడీ, విలనీ పాత్రలతో తనదైన శైలిలో రక్తి కట్టించారు.
122 చిత్రాల్లో నటించిన ప్రసాద్... 2007లో ‘చందమామ’ చిత్రానికి ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా, 2002లో ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ చిత్రానికి ఉత్తమ విలన్‌గా నంది పురస్కారాలు అందుకున్నారు. ‘రుద్రమదేవి’లో ఓ కీలక పాత్ర పోషించారు. అదే ఆయన ఆఖరి సినిమా. కాగా.. ఆహుతి ప్రసాద్ మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటని తెలుగు నటీనటుల సంఘం, తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం పేర్కొన్నాయి. ఆయన మృతిపట్ల సంతాపాన్ని ప్రకటించాయి. సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, మోహన్‌బాబులు ప్రసాద్ కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.
కేసీఆర్ సంతాపం..
ఆహుతి ప్రసాద్ ఆకస్మిక మరణంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, హాస్య పాత్రలతో చెరగని ముద్ర వేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన సినీ కళాకారుల సంక్షేమానికి కూడా కృషి చేశారని పేర్కొన్నారు.
ఆహుతి ప్రసాద్ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రసాద్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయిందని కేంద్ర మంత్రి వై.ఎస్.చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ మంచి నటుడని రాజ్యసభ సభ్యుడు కె.చిరంజీవి పేర్కొన్నారు. ప్రసాద్ మృతి చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎంపీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ పేర్కొన్నారు.
ఆహుతి ప్రసాద్ కన్నుమూత
Published Mon, Jan 5 2015 2:26 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
Advertisement
Advertisement