ఆ సెట్ ఖరీదు చాలా ఎక్కువట !
బాహుబలి చిత్రం తరువాత చిత్ర నిర్మాణ వ్యయాన్ని ఊహించలేకపోతున్నాం. ఆ చిత్రం ప్రేక్షకులకు బ్రహ్మాండాన్ని పరిచయం చేసిందనే చెప్పాలి. దీంతో చాలా మంది దర్శక నిర్మాతలు భారీ వ్యయాన్ని వెచ్చించి చిత్రాలను నిర్మించడానికి సాహసిస్తున్నారని చెప్పవచ్చు. తాజాగా ప్రభుదేవా చిత్రంలోనూ అలాంటి బ్రహ్మాండాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుదేవా, నటి హన్సిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం గులేబాకావళి. కేసేఆర్ స్డూడియోస్ పతాకంపై కేసేఆర్.రాజేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవ దర్శకుడు ఎస్.కల్యాణ్ మెగాఫోన్ పట్టారు.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో వివేక్–మెర్విన్‌ల ద్వయం సంగీత బాణీలు సమకూరుస్తున్నారు. ఒక పాట కోసం రూ.2 కోట్లు వ్యచించి ఒక బ్రహ్మాండమైన సెట్‌ను కళాదర్శకుడు కదిర్ నేతృత్వంలో వేశారు. కొరియోగ్రాఫర్ జానీ నృత్యరీతులు సమకూర్చుతున్న ఈ పాటను ఛాయాగ్రాహకుడు ఆనందకుమార్ అతి నవీన సాంకేతిక పరిజ్ఞానంతో హాలీవుడ్ గ్రాఫిక్ నిపుణుల పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారట. గులేబాకావళి చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని సన్‌టీవీ పెద్ద మొత్తానికి కొనుగోలు చేయడం మరో విశేషం.