
అతిథిమీనన్‌కు లక్కీచాన్స్
తమిళసినిమా: మైనా చిత్రంతో అమలాపాల్‌కు, కుంకీ చిత్రంతో లక్ష్మీమీనన్‌కు కోలీవుడ్‌లో లైఫ్ ఇచ్చిన దర్శకుడు ప్రభుసాల్మన్. అంతే కాదు కయల్ చిత్రంతో నటి ఆనందిని పరిచయం చేసిన దర్శకుడు ఈయనే. ప్రభుసాల్మన్ దృష్టిలో పడితే ఆ నటికి బంగారు జీవితమే అంటారు. అందుకే ఈ దర్శకుడి చిత్రాల్లో నటించడానికి చాలా మంది హీరోయిన్లు ఆశ పడుతుంటారు.
అయితే ప్రభుసాల్మన్ హీరోహీరోయిన్లను బట్టి కాకుండా పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంపిక చేసుకుంటారు. తొడరి చిత్రం తరువాత ప్రభుసాల్మన్ కుంకీ చిత్రానికి పార్టు–2 తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. కుంకీ చిత్రంలో నటించిన విక్రమ్‌ప్రభు, లక్ష్మీమీనన్‌లను దాని సీక్వెల్‌లోనూ ఎంపిక చేసుకుంటారని చాలా మంది భావించారు. అయితే ప్రభుసాల్మన్ కొత్తవారికి అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నారు.
అందులో భాగంగా కథానాయకిగా నటించే లక్కీచాన్స్‌ను నటి అతిథిమీనన్ దక్కించుకుందన్నది తాజా సమాచారం. ఈ చిత్రాన్ని దర్శకుడు ఉత్తరాది రాష్ట్రాల్లో చిత్రీకరించడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారట. ఇది పూర్తిగా ప్రేమకథా చిత్రంగా ఉన్నా, ఏనుగు పాత్ర కీలకంగా ఉంటుందట. ఇక ఇందులో హీరోగా నటించే అవకాశం పొందే ఆ అదృష్టవంతుడెవరన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే షూటింగ్‌కు ప్రభుసాల్మన్ సన్నాహాలు చేస్తున్నారు.