ఇప్పుడు కూడా నేను తెలియని వారున్నారా!
స్టార్‌డమ్ వస్తే... కనీసం సరదాగా షాపింగ్ కూడా చేసే పరిస్థితి ఉండదు. అందుకే... స్టార్లందరూ సాధారణ జీవితం అనుభవించడానికి ఇతర దేశాలకు వెళుతుంటారు. అక్కడ యదేచ్ఛగా షాపింగులు గట్రా చేస్తుంటారు. ఎందుకంటే... అక్కడి జనాలు మనవాళ్లను గుర్తు పట్టరు కాబట్టి. అది కూడా ఓ విధంగా ఓ గొప్ప అనుభూతే. అయితే... ఇక్కడున్న మన జనాలే మన స్టార్లను గుర్తు పట్టకపోతే? అది నిజంగా అవమానం. అలాంటి పరిస్థితే ఇటీవల ప్రణీతకు ఎదురైంది. ఇటీవల హైదరాబాద్‌లోనే ఓ వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి అతిథిగా వెళ్లి రిబ్బన్ కట్ చేసిందట ప్రణీత.
అయితే... అక్కడి ప్రణీతను చూసిన చాలామంది ‘ఎవరు?’ అని చెవులు కొరుక్కున్నారట. ఇది విని షాక్ తినడం ప్రణీత వంతు అయ్యిందట. ‘‘ ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్‌లో హీరోయిన్‌గా నటించిన, నేను కూడా తెలీని వారు ఉన్నారా!’’ అని సదరు సంస్థ యాజమాన్యంతో ఆశ్చర్యం వెలిబుచ్చిందట ప్రణీత. ఇది ముస్లిం ఏరియా అని, ఇక్కడ తెలుగు సినిమాలు చూడరని, బాలీవుడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, ఈ విషయంలో మీరు బాధపడాల్సిన అవసరం లేదని సంస్థ యాజమాన్యం సర్ది చెప్పడంతో ప్రణీత ఊపిరి పీల్చుకుందట. ఏదిఏమైనా ప్రణీతకు ఇది కాస్త చేదు అనుభవమే.