'ప్రేమమ్' మూవీ రివ్యూ
టైటిల్ : ప్రేమమ్
జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్
తారాగణం : నాగచైతన్య, శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్
సంగీతం : గోపిసుందర్
దర్శకత్వం : చందూ మొండేటి
నిర్మాత : ఎస్ రాధాకృష్ణ, పిడివి ప్రసాద్, ఎస్ నాగవంశీ
రొమాంటిక్ సినిమాల కేరాఫ్ అడ్రస్గా మారిన అక్కినేని ఫ్యామిలీ యువ కథానాయకుడు.., నాగచైతన్య హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేమమ్. మలయాళంలో ఘనవిజయం సాధించిన ప్రేమమ్ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు దర్శకుడు చందూ మొండేటి. మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ తెలుగు ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంది..? మలయాళీ ప్రేమకథలను టాలీవుడ్ జనాలకు నచ్చేలా చూపించటంలో చిత్రయూనిట్ సక్సెస్ సాధించారా?
కథ :
ప్రతీ వ్యక్తి జీవితంలోని మూడు దశల్లో కలిగే ప్రేమ కథలనే ప్రేమమ్లో సినిమాటిక్గా చూపించారు. 15 ఏళ్ల వయసులో పదోతరగతి చదువుతున్న విక్రమ్(నాగచైతన్య), ఆ ఊళ్లో కుర్రాళ్లంతా వెంటపడే అందమైన అమ్మాయి సుమ(అనుపమా పరమేశ్వరన్)ను ఇష్టపడతాడు. ఆ వయసులోనే కవితలతో ప్రేమలేఖలు రాస్తాడు. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి అన్నిరకాల కష్టాలు పడతాడు. అంతా ఓకె అయ్యిందనుకున్న సమయంలో విక్రమ్, సుమల ప్రేమకథ అర్థాంతరంగా ముగిసిపోతుంది.
అలా ఆ బాధను మర్చి పోయే ప్రయత్నంలోనే ఐదేళ్లు గడిచిపోతాయి. విక్రమ్ కాలేజ్లో జాయిన్ అవుతాడు. ఆ వయసుల్లో ఉండే దూకుడుతో కాలేజీలో గ్యాంగ్ మెయిన్టైన్ చేస్తూ గొడవలు, సస్పెన్ష్లతో హీరోయిజం చూపిస్తుంటాడు. అదే సమయంలో కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయిన సితార వెంకటేషన్(శృతిహాసన్)తో మరోసారి ప్రేమలో పడతాడు. కానీ విధి మరోసారి విక్రమ్ జీవితంతో ఆడుకుంటుంది. విక్రమ్, సితారల ప్రేమ కథ కూడా మధ్యలోనే ముగిసిపోతుంది.
అలా మరికొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. విక్రమ్ ఎస్ రెస్టో పేరుతో రెస్టారెంట్ స్టార్ చేసి లైఫ్లో సెటిల్ అవుతాడు. కానీ సితార జ్ఞాపకాలు మాత్రం విక్రమ్ను వెంటాడుతూనే ఉంటాయి. ఆ సమయంలో మరోసారి విక్రమ్ మనుసును ప్రేమ పలకరిస్తుంది. సింధు(మడోనా సెబాస్టియన్), విక్రమ్ జీవితంలోకి వచ్చిన మరో(మూడో) ప్రియురాలు. అసలు విక్రమ్ జీవితంలోకి వచ్చిన సింధు ఎవరు..? ఈ మూడో ప్రేమకథ అయినా సుఖాంతం అయ్యిందా..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
నటన పరంగా ప్రేమమ్ సినిమాతో వంద మార్కులు సాధించాడు నాగచైతన్య. తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. స్కూల్ ఏజ్లో కనిపించే అమాయకత్వం, కాలేజ్ కుర్రాడిగా హీరోయిజం, లైఫ్ సెటిల్ అయిన తరువాత వచ్చే మెచ్యూరిటీ లాంటి వేరియేషన్స్ను చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా మూడు దశల్లోనూ లుక్, ఫిజిక్ విషయంలో నాగచైతన్య తీసుకున్న కేర్ సినిమాకు ప్లస్ అయ్యింది. హీరోయిన్లుగా అనుపమా పరమేశ్వరన్, శృతిహాసన్, మడోనా సెబాస్టియన్లు పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. అనుపమా ఓన్ డబ్బింగ్ కాస్త ఇబ్బంది పెట్టిన నటన పరంగా మాత్రం ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో ప్రవీణ్, కృష్ణచైతన్య, శ్రీనివాస్ రెడ్డి, నోయల్, 30 ఇయర్స్ పృథ్వి తమ పరిథి మేరకు మెప్పించారు. విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జునల అతిథి పాత్రలకు థియేటర్స్లో విజిల్స్ పడుతున్నాయి.
సాంకేతిక నిపుణులు :
ఇప్పటికే సక్సెస్ ఫుల్ సినిమాగా ప్రూవ్ చేసుకున్న సినిమాను రీమేక్ చేసి, ఒరిజినల్ స్థాయిని అందుకోవటం చాలా కష్టం. కానీ ఆ రిస్క్ చేయడానికి ముందుకు వచ్చిన చందూ మొండేటి మంచి విజయం సాధించాడు. కథా కథనాలలో ఎక్కడ మలయాళ సినిమా అన్న భావన కలుగకుండా తెలుగు నేటివిటికీ తగ్గట్టుగా చేసిన మార్పులు సినిమాకు ప్లస్ అయ్యాయి. ప్రేమమ్కు మరో ఎసెట్ గోపిసుందర్ సంగీతం, సినిమా రిలీజ్కు ముందే ఆడియోతో ఆకట్టుకున్న గోపిసుందర్ నేపథ్య సంగీతంతోనూ అలరించాడు. ముఖ్యంగా ఎవరే పాట ఆడియోతో పాటు విజువల్గా కూడా సూపర్బ్ అనిపించేలా ఉంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
నాగచైతన్య నటన
కథ
సంగీతం
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్ లెంగ్త్
ఓవరాల్గా ప్రేమమ్.. నాగచైతన్య కెరీర్లో బెస్ట్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న 'అందమైన ప్రేమకథల రొమాంటిక్ జర్నీ'
- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్