
హాలీవుడ్ స్టార్ మేఘన్ మార్కల్ ఇంకో ఐదు నెలల్లో ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకొని బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ మెంబర్ కానుంది. నవంబర్ 27న హ్యారీ ఉంగరం తొడిగి ప్రపోజ్ చేశాక మేఘన్ నటనకు దూరమైపోయింది. అప్పటికే బాగా పాపులర్ అయిన ‘సూట్స్’ టీవీ సిరీస్ నుంచి బయటకొచ్చేసింది. ఇకపై సినిమాలు చేయనని మాట కూడా ఇచ్చేసింది. అలాగే అదేమీ కష్టంగా తీసుకుంటున్న నిర్ణయం కాదని, సినిమాలకు దూరమవ్వడం ఒక కొత్త జీవితం మొదలుపెట్టడానికే అని చెప్పుకొచ్చింది.
ఇంతవరకూ బాగానే ఉంది కానీ, హ్యారీతో మేఘన్ ప్రేమలో ఉన్న విషయం తెలియని రోజుల్లో జేమ్స్‌బాండ్ 25వ సినిమాకు ఆమెను హీరోయిన్‌గా అనుకున్నారట. అనుకోవడమేంటీ? ఆమెనే బాండ్ భామ అని ఫిక్స్ చేసుకొని, అడిగేసారట! సరిగ్గా అప్పుడు చెప్పింది మేఘన్.. అసలు విషయం. ఇంకేముంది.. ‘బాండ్ 25’ టీమ్ వేరొకర్ని ఎంపిక చేసే పనిలో పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని మూవీ సిరీస్‌లో ఒకటైన జేమ్స్‌బాండ్ సిరీస్‌లో వస్తోన్న 25వ సినిమా కావడంతో ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ అవ్వని బాండ్ 25పై ఇప్పట్నుంచే భారీ అంచనాలున్నాయి. డేనియల్ క్రెయిగ్ జేమ్స్‌బాండ్‌గా నటిస్తోన్న ఈ సినిమా 2019 నవంబర్‌లో విడుదలవుతుంది.