
అనిరుధ్‌తో లవ్వా?
యువ సంగీత దర్శకుడు అనిరుధ్, నటి ప్రియా ఆనంద్ మధ్య లవ్వాట జెట్ వేగంగా సాగుతుందనే ప్రచారం మొదలైంది. ప్రియా ఆనంద్ ఎదిర్ నీశ్చల్ చిత్రానికి ముందు కొన్ని చిత్రాల్లో నటించినా ఆశించిన విజయాలేవీ ఆమె ఖాతాలో పడలేదు. శ్రీదేవితో కలసి ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలో నటించినా ఆ చిత్ర సక్సెస్ శ్రీదేవికే పరిమితమై పోయింది. ఎదిర్‌నీశ్చల్ చిత్రం ప్రియా ఆనంద్‌కు తొలి విజయానందాన్ని అందించింది. విశేషం ఏమిటంటే ఆ చిత్ర హీరో శివకార్తికేయన్‌ను పక్కన పెట్టి చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్ - ప్రియాఆనంద్‌ల గురించి వదంతులు ప్రచారం అవుతున్నాయి. అనిరుధ్‌పై అంతకుముందే నటి ఆండ్రియాతో రాసలీలలు అంటూ ఇంటర్‌నెట్‌లో ఫొటోలతో సహా ప్రచారం హల్‌చల్ చేసింది.
తాజాగా ప్రియా ఆనంద్‌తో చెట్టాపట్టాల్ అంటూ కోలీవుడ్ చెవులు కొరుక్కుంటోంది. అయితే ఈ ప్రచారాన్ని నటి ప్రియా ఆనంద్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ అసత్య ప్రచారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వదంతులన్నీ నిజం అయితే తనకిప్పటికే నలుగురైదుగురు లవర్స్ ఉండాలన్నారు. తాను నటించే ప్రతి చిత్రం సమయంలోనూ ఇలాంటి వదంతులు ప్రచారం చేస్తున్నారన్నారు. అయినా ఇలాంటి వాటిని లైట్‌గా తీసుకుని జాలీగా ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పారు. నిజానికి తానెవరినీ ప్రేమించలేదని, ఒక వేళ ఎవరినైనా ప్రేమిస్తే ఆ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదని ప్రియా ఆనంద్ అంటున్నారు.