ప్రియాంకపై కార్మికుల ఆగ్రహం!
బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా అమెరికన్ టీవీ షో ‘క్వాంటికో’తో హాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ గుర్తింపు ప్రియాంకకు హాలీవుడ్ చిత్రం ‘బేవాచ్’లో నటించే అవకాశం తెచ్చిపెట్టింది. అయితే, ఉత్సాహంగా దూసుకెళుతున్న ప్రియాంక ప్రస్తుతం ఇరుకున పడ్డారు. దానికి కారణం ఆమె నిర్మాతగా మారడమే. ‘పర్పుల్ పెబల్ పిక్చర్స్’ పతాకంపై భోజ్‌పురి, పంజాబీ, మరాఠీ భాషల్లో సినిమాలు తీయనున్నట్లు ప్రియాంక ప్రకటించారు.
ఈ చిత్రాలకన్నా ముందే ఓ యాడ్ ఫిలిం నిర్మించడానికి ఆమె సన్నాహాలు చేశారు. దీని కోసం గతేడాది ఆమె కొంతమంది వర్కర్స్‌ను నియమించుకున్నారు. దాదాపు ఏడాది కాలంగా ప్రియాంక బేనర్‌కి పని చేస్తున్నామనీ, తమకు చెల్లించాల్సిన పారితోషికానికి ఆమె బాకీ పడ్డారని వర్కర్స్ యూనియన్‌కి కార్మికులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు పరిశీలించిన వర్కర్స్ యూనియన్.. ప్రియాంక మొత్తం 36 లక్షల్లో 20 లక్షలు మాత్రమే ఇచ్చారని, మిగతా మొత్తం ఇవ్వలేదని నిర్ధారించింది. కానీ, మాట్లాడిన పారితోషికం మొత్తం ఆర్ట్ డైరెక్టర్స్‌కి ఇచ్చేశామనీ, అతనే వర్కర్స్‌కి ఇవ్వలేదని ప్రియాంక బేనర్‌కి సంబంధించిన కార్యకలాపాలు చూస్తున్న ఆమె అత్తయ్య, మరో ఇద్దరు వ్యక్తులు అంటున్నారు.
ప్రియాంక తరఫున ‘ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ రంగంలోకి దిగింది. మొత్తం డబ్బు ఇచ్చినా, మరో ఐదు లక్షలు చెక్ కూడా ఇవ్వడానికి సంస్థ అధినేత సిద్ధపడ్డారని, ఆ చెక్ తీసుకోవడానికి ఆర్ట్ డైరెక్టరే రావడం లేదని పేర్కొంది. డబ్బులు ఇవ్వని ఆర్ట్ డైరెక్టర్ దగ్గర వర్కర్లు ఎందుకు పని చేయాలని, డబ్బులు ఇచ్చిన ‘పర్పుల్ పెబల్ పిక్చర్స్’ని ఎందుకు ఇరుకున పెట్టాలని సదరు అసోసియేషన్ ప్రశ్నించింది. మరి.. ఈ వివాదం ఎంతదాకా వెళుతుందో చూడాలి.