
తమిళసినిమా: ఇళయదళపతితో మరోసారి నటించాలని ఉందన్న కోరికను వ్యక్తం చేసింది బాలీవుడ్ క్రేజీ నటి. ఎవరా బ్యూటీ గెస్ చేయగలరా? బాలీవుడ్ నుంచి ఈ మధ్యనే హాలీవుడ్‌ను చుట్టొచ్చిన ఈ భామ ఇంతకు ముందే కోలీవుడ్‌లోనూ ఒక చిత్రంలో నటించింది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు నటి ప్రియాంక చోప్రా. బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్న ఈమె చాలా కాలం ముందే తమిళన్ అనే చిత్రంలో విజయ్‌కు జంటగా నటించి కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తరువాత చాలా మంది ప్రియాంక చోప్రాను తమిళ చిత్రాల్లో నటింపజేసే ప్రయత్నాలు చేసినా ఆమె అంగీకరించలేదు. ఇటీవల కూడా ప్రియాంకచోప్రా కోలీవుడ్‌కు రీఎంట్రీ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది.
ఈ అమ్మడు ఇటీవల ఒక భేటీలో నటుడు విజయ్ అంటే తనకు చాలా ఇష్టమని తాను ఆయనకు వీరాభిమానినని పేర్కొన్నారు. అంతే కాదు మరోసారి విజయ్‌తో కలిసి నటించాలని కోరుకుంటున్నానని చెప్పారు. కాగా విజయ్ తదుపరి ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తన 62వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ను కథానాయకిగా ఎంపిక చేసినట్లు ప్రచారం జరగుతోంది. ఈ చిత్రంలో ప్రియాంకచోప్రా నటించే అవకాశం లేదనే చెప్పాలి. మరి అలాంటిది ఈ అమ్మడికి ఇళయదళపతితో నటించే అవకాశం ఎప్పుడొస్తుందో చూడాలి. అయితే కోలీవుడ్ దర్శక నిర్మాతలకు ఒక హింట్ ఇచ్చారు కాబట్టి అలాంటి ప్రయత్నాలు జరిగే అవకాశం లేకపోలేదు.