వర్మ ఓ నికృష్టుడు.. అల్లు అరవింద్ ఫైర్‌ | Producer Allu Aravind Fire On Ram Gopal Varma | Sakshi
Sakshi News home page

వర్మ.. ఓ నికృష్టుడు: అల్లు అరవింద్

Published Thu, Apr 19 2018 4:58 PM | Last Updated on Thu, Apr 19 2018 5:35 PM

Producer Allu Aravind Fire On Ram Gopal Varma - Sakshi

సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నికృష్టుడని, సాఫ్ట్ మర్డర్ క్రిమినల్ అని సినీ నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు తనను బాధించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫిలిం చాంబర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను మెగా ఫ్యామిలీకి పెద్దగా ఇన్ని రోజులు సహనంగా ఉన్నానని, కానీ కొన్ని సంఘటనలు చూశాక ప్రెస్‌మీట్ పెట్టానన్నారు. శ్రీరెడ్డి ఆరోపణలపై సినీ పరిశ్రమ సానుకూల దృక్పథంతో ఉందన్నారు. ఇండస్ట్రీ మంచిపని చేయబోతోంది. రిడ్రెస్సల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కమిటీలో 50 శాతం ఇండస్ట్రీ వ్యక్తులతో పాటు మహిళలు, ఎన్‌జీవోలు ఉంటారు. తప్పు చేసిన నిర్మాత, దర్శకులు ఎవరైనా ఉన్నారని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

'మూడు తరాలుగా ఇండస్ట్రీనే నమ్ముకున్నాం. కానీ కొందరు అనవసరంగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. నేను రాంగోపాల్ వర్మను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను. వర్మ ఓ నికృష్టుడు అని చెబుతున్నా. సినీ పరిశ్రమలో పుట్టి పెరిగిన వర్మ.. ఇప్పుడు తల్లిలాంటి ఇండస్ట్రీకి ద్రోహం చేస్తున్నాడు. శ్రీరెడ్డితో పవన్ కల్యాన్‌ను తిట్టించింది తానేనని వర్మ స్వయంగా ఒప్పుకున్నాడు. శ్రీరెడ్డి విషయం బయటకు చెబుతుందని తెలిసే.. తన వెదవ తెలివితేటలు చూపిస్తూ వర్మ హడావుడిగా వీడియో రిలీజ్ చేశాడు. వర్మ నీ బతుక్కి ఇదంతా అవసరమా.. నీకు పవన్‌పై ఉన్న కోపాన్ని శ్రీరెడ్డితో తీర్చుకోవాలి అనుకున్నావంటూ' అల్లు అరవింద్ మండిపడ్డారు.

వర్మ కుట్ర వెనుక ఎవరున్నారు
ఇండస్ట్రీలో అందరూ చాలా బాధపడుతున్నారు. ఛాతీ విరుచుకుని మేం తెలుగువారమని చెప్పుకునేలా ఉండాలి. కానీ తల్లిలాంటి ఇండస్ట్రీని వర్మ మోసం చేశాడు. వర్మ కుట్ర వెనుక ఎవరున్నారు. నిర్మాత సురేష్ ఫ్యామిలీ నుంచి 5 కోట్ల రూపాయలు ఇప్పించాలని చూశానని వర్మ ఒప్పుకున్నాడు. అప్పుడే నేను సురేష్ ఫ్యామిలీకి ఫోన్ చేశా. మేం ఎవరికీ భయపడం. హుందాపరంగా వెళ్తామని ఆ కుటుంబం తెలిపిందని అల్లు అరవింద్ వివరించారు.

ఆ నింద పవన్‌పై వేసేద్దామనుకున్నావా వర్మ?
కాస్టింగ్ కౌచ్ వివాదంపై ఇటీవల స్పందించిన పవన్ కల్యాణ్.. తన వద్ద ఆధారాలుంటే ఇలా అర్ధనగ్న నిరసనలకు బదులుగా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడం ఉత్తమమని నటి శ్రీరెడ్డికి సూచించారు. దీంతో నువ్వు నిరసనలు ఎందుకు చేస్తున్నావు.. నువ్వు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయ్ అంటూ శ్రీరెడ్డి బదులిచ్చింది. కాగా, తాజాగా అల్లు అరవింద్ ఈ విషయంపై స్పందించారు. శ్రీరెడ్డి, పవన్ కల్యాణ్ వివాదంలో దర్శకుడు వర్మ తలదూర్చి తన ప్రతీకారం తీర్చుకోవాలని చూశాడని ఆరోపించారు. ఒకవేళ ఎవరైనా శ్రీరెడ్డిపై దాడి చేస్తే.. ఆ నింద పవన్ కల్యాణ్‌పై, అతడి ఫ్యాన్స్‌పై వేద్దామనుకున్నావా వర్మ అని అల్లు అరవింద్ ప్రశ్నించారు. ఆ దర్శకుడి నీచపు తెలివి అందరికీ తెలుసునంటూ వర్మపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement