వాటిని మరచిపోయే హిట్‌ని రాక్షసుడు ఇచ్చింది | Producer Bellamkonda Suresh Press Meet About Rakshasudu | Sakshi
Sakshi News home page

వాటిని మరచిపోయే హిట్‌ని రాక్షసుడు ఇచ్చింది

Published Tue, Aug 6 2019 2:33 AM | Last Updated on Tue, Aug 6 2019 2:33 AM

Producer Bellamkonda Suresh Press Meet About Rakshasudu - Sakshi

బెల్లంకొండ సురేశ్‌

‘‘నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లయింది. సినిమాలు నిర్మించడం ప్రారంభించి 21 సంవత్సరాలైంది. ఇన్నేళ్లలో 25 స్ట్రయిట్‌ సినిమాలు నిర్మించా.. 8 చిత్రాలు డబ్బింగ్‌ చేశా. అవేవీ నాకు ఆనందం ఇవ్వలేదు. మా అబ్బాయి చేసిన ‘రాక్షసుడు’ సినిమాకి అందరి ప్రశంసలు దక్కడంతో చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకూ తను చేసిన ఆరు సినిమాలు ఒక ఎత్తయితే ‘రాక్షసుడు’ మరో ఎత్తు.

ఫస్ట్‌ టైమ్‌ ఓవర్‌సీస్‌లో మా సినిమాకి 100 ప్రీమియర్‌ షోలు పడటం విశేషం’’ అని  నిర్మాత  బెల్లంకొండ సురేశ్‌ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా రమేష్‌ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసు డు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాని అభిషేక్‌ నామా గత శుక్రవారం విడుదల చేశారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న సందర్భంగా బెల్లంకొండ సురేశ్‌ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.. ఆ విశేషాలు.


► మా అబ్బాయి ఈ ఐదేళ్లలో 7 సినిమాలు చేశాడు. ‘అల్లుడు శీను’ సినిమాకి చాలా మంది హీరోలకి తీసిపోని విధంగా ఎక్స్‌ట్రార్డినరీ ఓపెనింగ్స్‌తో 6 రోజుల్లో 34కోట్ల షేర్‌ వచ్చింది. అన్ని వాణిజ్య అంశాలతో వీవీ వినాయక్‌గారి దర్శకత్వంలో ఆ సినిమాలో మా అబ్బాయిని హీరోగా పరిచయం చేశా. ఆ తర్వాత బోయపాటి శ్రీనుగారి సినిమాని భారీ బడ్జెట్‌తో, భారీ నటీనటులతో నిర్మించాం. కానీ, వాటికి దర్శకులకు, తోటి నటీనటులకు పేరొచ్చింది. అయితే ‘రాక్షసుడు’ మాత్రం మా అబ్బాయికి మంచి పేరు తీసుకొచ్చింది. రెవెన్యూ సైడ్‌ కూడా సూపర్‌ హిట్‌ అయింది. మాకు ఇంత పెద్ద సూపర్‌ హిట్‌ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు.

► ‘రాక్షసుడు’ కచ్చితంగా హిట్‌ అవుతుంది.. తెలుగులో మంచి పేరు వస్తుందని నెలన్నర పాటు రమేశ్‌ వర్మ తమిళ ‘రాక్షసన్‌’ హక్కుల కోసం ప్రయత్నించాడు.. నేను కూడా తనకు సపోర్ట్‌గా ప్రయత్నించాను. ఈ రోజుల్లో స్ట్రయిట్‌ సినిమా తీయడం ఈజీ కానీ, రీమేక్‌ తీయడం చాలా కష్టం. సరిగ్గా తీయకపోతే మంచి సినిమాని చెడగొట్టారంటూ తిడతారు. రమేశ్‌ వర్మకి కోనేరు సత్యనారాయణ వంటి మంచి నిర్మాత కుదిరారు. మా అబ్బాయికి మంచి సినిమా ఇచ్చినందుకు నిర్మాతకి పాదాభివందనం. సాయిని అందంగా, యూత్‌ఫుల్‌గా చూపించిన కెమెరామేన్‌ వెంకట్‌కి హ్యాట్సాఫ్‌.

► మా అబ్బాయి ‘అల్లుడు శీను, జయ జానకి నాయక’ సూపర్‌ హిట్స్‌.. స్పీడున్నోడు, కవచం, సీత’ వంటి ఫ్లాప్‌ సినిమాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ మరచిపోయేలా ‘రాక్షసుడు’ హిట్‌ కొట్టింది. సౌత్‌ నుంచి హిందీలో డబ్బింగ్‌ అయిన íహీరోల సినిమాల్లో నంబర్‌ వన్‌గా ఉన్నవన్నీ మా అబ్బాయి సినిమాలే. కావాలంటే యూ ట్యూబ్‌లో చూసుకోవచ్చు. ‘జయ జానకి నాయక’ సినిమాకి సరైన విడుదల తేదీ, థియేటర్లు దొరక్కపోవడం వల్ల కొంచెం నష్టం జరిగింది. లేకుంటే ఆ సినిమానే పెద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావాల్సింది.. దీంతో హిట్‌తోనే సరిపెట్టుకున్నాం.

► సాయితో బాలీవుడ్‌లో స్ట్రయిట్‌ హిందీ సినిమా చేస్తామంటూ హాలీవుడ్‌ సినిమాలు తీసే ఓ పెద్ద కంపెనీ నుంచి సోమవారమే మెయిల్‌ వచ్చింది. మేమింకా ఓకే చెప్పలేదు. అన్నీ కుదిరితే తప్పకుండా చేస్తాం. లేదంటై వచ్చే ఏడాది మా సొంత బ్యానర్‌లో తెలుగులో హిట్‌ అయిన ఓ సినిమాని హిందీలో రీమేక్‌ చేస్తాం. ఇప్పటి వరకూ మా అబ్బాయి ఫైట్స్, డ్యాన్సులు బాగా చేయగలడనే పేరుంది.. ‘రాక్షసుడు’తో బాగా నటించగలడని పేరొచ్చింది.

► హీరో అవ్వాలని ఐదో తరగతిలోనే సాయి అనుకున్నాడు. అప్పటి నుంచే ఓ వైపు చదువుతూనే మరోవైపు డ్యాన్స్, ఫైట్స్, జిమ్నాస్టిక్‌ నేర్చుకున్నాడు. నిర్మాత కొడుకు హీరోగా ఎదగడం చాలా కష్టం. కానీ, మా అబ్బాయిది ఎంతో కష్టపడే తత్వం.. దానికి దేవుడి ఆశీర్వాదం, ప్రేక్షకులు అభిమానం తోడవడంతో సక్సెస్‌ అందుకున్నాడు. దానికితోడు మంచి సినిమాని ఎప్పుడూ మన ప్రేక్షకులు ఆదరిస్తారు.

► ‘రాక్షసన్‌’ రీమేక్‌ చేయాలనుకున్నప్పుడు వెంకటేశ్‌బాబు రీమేక్‌ సినిమాల్లా ఏం మార్పులు చేయకుండా చేస్తే సరిపోతుందని చెప్పా. అలా చేయడం వల్లే ‘రాక్షసుడు’ మంచి విజయం సాధించింది. ఇకపై మంచి కథా చిత్రాలే చేయాలనుకున్నాం. మా అబ్బాయి తర్వాతి సినిమాని నిర్మాత ‘దిల్‌’ రాజుగారికి అప్పచెప్పా.. ఆయనే నిర్మిస్తారు. ఆ తర్వాత మా సొంత బ్యానర్‌లో ఓ సినిమా ఉంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement