జగపతిబాబు, సుకుమార్, రామ్‌చరణ్, నవీన్ ఎర్నేని, చంద్రబోస్, రత్నవేలు, రవిశంకర్, రామకృష్ణ
‘మీరు ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు ఒప్పుకుంటారా?’ అని అడుగుతుంటారు. నేనెప్పుడూ అలా సినిమాలు ఒప్పుకోలేదు. కథ ముందు నాకు నచ్చాలి. ఆ తర్వాత అందరికీ నచ్చుతుంది. అందరూ గర్వపడే సినిమా చేయాలనే కథ వింటాం’’ అని రామ్‌చరణ్ అన్నారు. రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సీవీఎం (మోహన్) నిర్మించిన ‘రంగస్థలం’ గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా చిత్రబృందం ‘థ్యాంక్స్ మీట్’ నిర్వహించారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘సుకుమార్‌కి థ్యాంక్స్. మమ్మల్ని నమ్మి తను ఓ క్రేజీ మిషన్‌ను మా భుజాలపై పెట్టాడు. తన మిషన్‌ను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు, సినిమా సక్సెస్‌లో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఇలాంటి సక్సెస్ ఇండస్ట్రీకి ఎంతో అవసరం. వేసవిలో రాబోయే మరో రెండు సినిమాలు కూడా పెద్ద సక్సెస్ కావాలి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అంటే నాకెంతో ఇష్టం.
సినిమా రంగంలో వచ్చే ప్రతి రూపాయిని వారు మళ్లీ తర్వాతి సినిమాపైనే పెడతారు. వాళ్లందరూ హ్యాపీగా ఉండాలి’’ అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘నాకు, చరణ్‌కి కామన్ ఫ్రెండ్ రంగ. అతని ద్వారా ‘నాన్నకు ప్రేమతో’ సమయంలో చరణ్‌ని కలిశా. తను నా మైండ్‌లో ఉండిపోయాడేమో.. కాబట్టి ‘రంగస్థలం’ టైటిల్ పెట్టా. జగపతిబాబుగారు ఏ ప్రాత చేసినా బంగారమే. ఆయనతోనే ప్రేమలో పడిపోయా. ఆయనతో నా ప్రతి సినిమా చేయాలనుకుంటున్నాను.
రత్నవేలుగారు ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్. హీరోయిన్‌కు పెళ్లయితే ఆమెను ప్రేక్షకులు ఆదరించరని అంటుంటారు. కానీ, సమంత విషయంలో అలా జరగలేదు. రూల్స్‌ను బ్రేక్ చేసిన సినిమా ఇది. చిట్టిబాబుగా రామ్‌చరణ్‌ని తప్ప వేరే ఎవరినీ ఊహించలేదు’’ అన్నారు. ‘‘సెకండ్ ఇన్నింగ్స్‌లో నాకు ‘లెజెండ్’ చిత్రం ఓ లైఫ్ అయితే.. ‘రంగస్థలం’తో మరో లైఫ్ వచ్చింది. ఇది సుకుమార్ ఇచ్చిన ఇంకో లైఫ్’’ అన్నారు జగపతిబాబు.
‘‘రంగస్థలం తొలి మూడురోజులకు ఎంత కలెక్షన్స్ వచ్చాయో, నాలుగోరోజు సోమవారం కూడా అంతే కలెక్షన్స్ రావడం సినిమా బ్లాక్‌బస్టర్ అనడానికి పెద్ద నిదర్శనం. ‘ఆర్య’ తర్వాత సుక్కు చిత్రాల్లో పూర్తిగా నచ్చిన సినిమా ‘రంగస్థలం’. సుక్కు కెరీర్‌లో వన్నాఫ్ ది బెస్ట్ మూవీ ఇది. స్టార్ హీరో కొత్తగా ట్రై చేసినప్పుడు వచ్చే ఫీలింగ్ వేరేలా ఉంటుంది. అది ‘ధృవ’, ‘రంగస్థలం’ చిత్రాలకు వర్కవుట్ అయ్యింది. ‘మగధీర’ను కూడా ఈ సినిమా క్రాస్ చేయబోతోంది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘రంగస్థలం’ స్టార్టింగ్ షాట్ నుంచి ఎండింగ్ వరకు చరణ్‌గారి నటన సూపర్బ్ అని అందరూ చెబుతున్నారు.
‘రంగస్థలం’ ఫస్ట్ షెడ్యూల్ కాగానే మరో సినిమా చేయమని సుకుమార్‌గారితో కమిట్ అయ్యామంటే మా జర్నీ ఎంత బాగా సాగిందో అర్థం చేసుకోవాలి. మా మూడు సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ‘బాహుబలి, బాహుబలి 2’ తర్వాత ‘రంగస్థలం’ టాప్ గ్రాసర్ అవుతుంది. ‘ఖైదీనంబర్ 150’ చిత్రాన్ని కూడా చరణ్‌గారు దాటేస్తారు’’ అన్నారు నవీన్ ఎర్నేని. నిర్మాత సీవీఎం, రవిశంకర్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, నటి అనసూయ, ఎడిటర్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ, మోనిక తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment