యూ సర్టిఫికెట్ కోసం బతిమాలుతున్నారు
చిత్రాలకు యూ సర్టిఫికెట్ కావాలంటూ నిర్మాతలు బతిమలాడుతున్నారని సీనియర్ నటుడు,సెన్సార్ బోర్డు సభ్యుడు ఎస్‌వి.శేఖర్ వ్యాఖ్యానించారు. ఎంఎస్‌జీ. మూవీస్ పతాకంపై జి.హరి నిర్మించిన చిత్రం జంబులింగం. 3డీ ఫార్మెట్‌లో రూపొందిన ఈ చిత్రానికి హరి అండ్ హరీష్ ద్వయం కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించారు. వీరు ఇంతకు ముందు జంబులి 3డీ తదితర ప్రయోగాత్మక సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. ఈ చిత్రానికి మహిళా సంగీత దర్శకురాలు శ్రీవిద్య సంగీతాన్ని అందించడం విశేషం. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది.
కార్యక్రమంలో పాల్గొన్న ఎస్‌వీ.శేఖర్ మాట్లాడుతూ నిర్మాతలు బాగుంటేనే చిత్ర పరిశ్రమ బాగుంటుందన్నారు.అయితే చాలా మంది నిర్మాతలు చిత్ర నిర్మాణంపై అవగాహన లేకుండానే చిత్రాలు నిర్మించడానికి సిద్ధం అవుతున్నారన్నారు. విదేశాల్లో చిత్రీకరణ అంటూ స్క్రిప్ట్ లేకుండానే అక్కడ చిత్ర నిర్మాణాలు చేస్తున్నారన్నారు. చాలా మంది నిర్మాతలు తమ చిత్రాలకు ఎలాగైనా యూ సర్టిఫికెట్ కావాలంటూ సెన్సార్ బోర్డు సభ్యులను బతిమలాడుతున్నారన్నారు. నిజానికి అలా బతిమలాడాల్సిన అవసరం లేదన్నారు. మంచి స్క్రిప్ట్‌తో ప్రణాళిక ప్రకారం చిత్రాలు చేసుకోవాలని హితవు పలికారు.
మరో విషయం ఏమిటంటే నిర్మాతలు ము సర్టిఫికెట్ల కోసం బతిమలాడడానికి ప్రభుత్వం కూడా ఒక కారణం అని పిస్తోందన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కోసమే యూ సర్టిఫికెట్ కోసం పడరాని పాట్లు పడుతున్నారని, అసలు ప్రభుత్వం యూ, యూఏ అనే భేదాలు లేకుండా చిత్రానికి ఇంత సబ్సిడీ అని చెల్లిస్తే నిర్మాతలకు ఈ సమస్యలు ఉండవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక జంబులింగం చిత్రం గురించి చెప్పాలంటే ఈ చిత్ర యూనిట్ జపాన్‌లో చిత్రీకరణ నిర్వహించినా మంచి స్క్రిప్ట్‌ను తీసుకెళ్లినట్లుందన్నారు. జంబులింగం ఈ వేసవి కాలంలో కుటుంబ సభ్యులు పిల్లలను తీసుకుని చూసి ఆనందించే చిత్రం అన్నారు. దర్శకుడు పి.వాసు, వైజీ.మహేంద్రన్, సంగీత దర్శకుడు గంగై అమరన్, కృష్ణ స్వీట్స్ మురళి, జపాన్ దేశ కోఆర్డినేటర్ సుహానో జెనిసీ పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ఎంపీఎస్ ఫిలింస్ సంస్థ ఈ నెల 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.