ఒంటరి మగవాళ్ల గురించి లోకం ఆలోచించదు. ఎక్కడో తింటాడు. ఎక్కడో నిద్రపోతాడు. సరే. ఒంటరి ఆడవాళ్ల గురించి లోకం ఆలోచిస్తుందా? భర్త చనిపోయి ఉండవచ్చు. లేదా విడాకులు తీసుకుని ఉండవచ్చు. లేదా పెళ్లి ఆలస్యమై ఉండవచ్చు. వారి మనసులో ఏముంది? వారి శరీరం ఏమంటోంది? వారు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు? వారు ఏమని మాట్లాడాలనుకుంటున్నారు? ఎవరికి పట్టింది... పద్ధతిగా ఉంటూ సంఘానికి ప్రమాదం తెచ్చిపెట్టకుండా మర్యాదకరంగా జీవించాలనే అగోచర హద్దు గీసి లోకం తన పనుల్లో తాను బిజీగా ఉంటుంది. మరి వారి గోడు?
ఈ సినిమాలో హీరోయిన్ విడో. భర్త మిలటరీలో మరణించి ఉంటాడు. గతం గతః అనుకోలేకపోతోంది. వయసు 35. చక్కటి రూపం. ఆరోగ్యవంతమైన దేహం. కాని సింగిల్‌గా ఉంటోంది. తమ్ముడు ఎక్కడో అమెరికాలో చదువుకుంటున్నాడు. తల్లి ఏదో ఊళ్లో ఉంది. తను ముంబైలో. మంచి ఉద్యోగమే. మంచి ఇల్లే. మంచి కారే. సరా? తనకు కావలసినవన్నీ ఉన్నట్టేనా? ఒంటరితనం ఆమెను బాధిస్తూ ఉంది. కాని భర్త జ్ఞాపకాల పట్ల లాయల్‌గా ఉండాలన్న సగటు భారతీయ అభిప్రాయం ఆమెలో ఉంది. గతం తాలూకు లగేజ్ ఆమెను వదల్లేదు.
అలాంటి హీరోయిన్ ఒక డేటింగ్ సైట్‌లో తన వివరాలు పోస్ట్ చేస్తే ఇర్ఫాన్ ఖాన్ పరిచయం అవుతాడు. హీరోయిన్ వాలకం గమనిస్తాడు. ‘మీ అరేంజ్డ్ మేరేజ్ వాళ్లంతా ఇంతే. భర్తలకు అవసరానికి మించి ప్రాధాన్యం ఇస్తారు’ అంటాడు. ‘ప్రేమలో అలా కాదు. ప్రేమ ఒక కవిత్వం’ అంటాడు. తనకు ముగ్గురు మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారని వాళ్లంతా తనను తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంటారని చెబుతాడు. హీరోయిన్ ‘నీ మొహం’ అన్నట్టు చూస్తుంది. తన మాట నిరూపించుకోవడానికి ఆమెను ఆ ముగ్గురూ ఉన్న మూడు ఊర్లు– డెహరాడూన్, జైపూర్, గాంగ్‌టక్ తీసుకువెళతాడు. ఆ ప్రయాణమే ఈ కథ.
సినిమాలో ఇర్ఫాన్ చాలా భోళామనిషి. వాగుడుకాయ. మనసులో అనిపించింది చెప్పి, అనుకున్నది చేసేయాలనుకునే రకం. కాని ఆడవాళ్లంటే గౌరవం. ‘ఈ క్షణంలో ఈ నిమిషంలో జీవితాన్ని ఎలా ఉంటే అలా ఎంజాయ్ చేయ్’ అనేది అతడి ఫిలాసఫీ. అందుకే మొదటి ట్రిప్పులోనే ఆమెను ఫ్లయిట్ ఎక్కించి, తను ఫ్లయిట్ మిస్సయినా హాయిగా తర్వాతి ఫ్లయిట్‌లో వస్తాడు. ఆమె మాత్రం టెన్షన్‌తో చస్తుంది. ఢిల్లీలో కూడా అంతే. జైపూర్ ట్రైన్ ఎక్కించి, తను పొరపాటున వేరే ట్రైన్ ఎక్కేస్తాడు. ఆమెకు మళ్లీ టెన్షన్. అతను మాత్రం ఏ ట్రైన్‌లో ఎక్కాడో ఆ ట్రైన్‌లో హాయిగా పేకాటలో కూర్చుంటాడు.
ఇది ఆమెకు నచ్చదు. కాని ఇది ఆమెకు బాగుంది కూడా. నిజానికి ముందు ట్రిప్పు ముగిసే టైముకే ఆమె అతడి ప్రేమలో పడుతుంది. రెండో ట్రిప్పులో అతడు రెండో మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను కలవాలని అనుకున్నప్పుడు అసూయతో రగిలి నానా గోల చేస్తుంది. మూడో ట్రిప్‌లో అసలు అతడి గర్ల్‌ఫ్రెండ్‌నే చూడదు. అతణ్ణి ఉడికించాలని తనకో మాజీ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడంటూ ఎవరినో చూడటానికి వెళుతుంది. కాని ఆశ్చర్యం ఏమిటంటే అతడు కూడా తన మూడో మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడు. ఎందుకంటే అప్పటికే హీరోయిన్ ప్రేమలో మునిగిపోయాడు కాబట్టి. ఈ మూడు ప్రయాణాల్లో వాళ్లు ఒకరినొకరు తెలసుకుంటారు. తమను తాము తెలుసుకుంటారు. పాత బ్యాగేజ్ వదిలించుకుని పరస్పరం కొత్త గమ్యం వైపు అడుగు వేయడానికి నిశ్చయించుకుంటారు. కథ అందంగా ముగుస్తుంది.
మెచ్యూర్ లవ్ స్టోరీలు సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే నీరసంగా ఉంటాయి. కాని ఈ సినిమా మొదలైనప్పటి నుంచి పెదాల మీద నవ్వులతో హాయిగా సాగిపోతుంది. ‘జీవితం ఆగిపోవడానికి కాదు. ముందుకు సాగిపోవడానికే. గతంలో ఏవో జరుగుతాయి. వర్తమానంలో ఏవో జరుగుతుంటాయి. ఎన్ని జరిగినా ముందుకు నడవాల్సిందే’ అని ఈ సినిమా చెబుతుంది. ఇర్ఫాన్ గతంలో ప్రేమించిన ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ వాళ్ల వాళ్ల జీవితాల్లో స్థిరపడి ఉంటారు. ఆగిపోలేదు. అలా ఆగిపోయి ఉంటారనుకోవడం, ఆగిపోయి ఉండాలనుకోవడం తప్పు అని ఈ సినిమా చెబుతుంది. అంతేనా? మన చుట్టూ ఉండేవాళ్లలో సింగిల్‌గా ఉంటున్న వాళ్లను అలాగే ఆపకుండా ఆపేయకుండా వాళ్ల జీవితాల్లో ‘ప్రేమ’, ‘బంధం’ అవసరాన్ని గ్రహించమని మనకు హితబోధ చేస్తుంది.
ఇర్ఫాన్ సంగతి తెలిసిందే కాని ఇందులో హీరోయిన్‌గా చేసిన మలయాళ నటి పార్వతి కూడా చాలా బాగా చేసింది. డైలాగ్స్ చాలా క్యాజువల్‌గా, విట్టీగా ఉంటాయి. జోక్ మీద జోక్ పడుతుంటుంది. హిందీ తెలిస్తే మజా. సినిమాలో ఒకసారి ఫ్లయిట్ ఒకసారి ట్రైన్ మిస్సయిన ఇర్ఫాన్ హీరోయిన్‌తో తాను ప్రేమలో పడ్డానని రూఢీ చేసుకున్నాక ఆమె ఉన్న రోప్ వేను మాత్రం మిస్ కాకుండా పట్టుకుంటాడు. అంతవరకూ తన వాటర్ బాటిల్‌ను అతడితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడని ఆమె క్లయిమాక్స్‌లో అతడి వాటర్ బాటిల్‌ను పెదాలకు అంటించుకుని తాగుతుంది. చిన్న సజెషన్. ప్రేక్షకులకు మాత్రం వాళ్ల ప్రేమ కన్ఫర్మ్ అయినందుకు సంతోషం వేస్తుంది.
ఉమన్ డైరెక్టర్ తనూజా చంద్ర తీసిన ఈ సినిమా చక్కటి ముచ్చటైన సినిమా. చూడటం ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’లో వేడి వేడి పకోడి తినడం లాంటిది. ఈ రిఫరెన్స్ ఏమిటో తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
– కె
ఒంటరి జీవితాల్లో లవ్ వెలుతురు కరీబ్ కరీబ్ సింగిల్
Published Sat, Nov 11 2017 12:29 AM | Last Updated on Sat, Nov 11 2017 5:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment