
కీర్తి కోసం పేరు మార్పు
పేరులో ఏముందిలే అని కొందరు తేలిగ్గా కొట్టిపారేస్తారు. మరి కొందరు పేరులోనే అంతా ఉందని నమ్ముతారు. అలా పేరు మార్చుకుని వృత్తిలో బిజీ అయిన వారిలో నటి లక్ష్మీరాయ్ ఒకరు. కర్కకచడర చిత్రం ద్వారా తమిళచిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత మంగాత్తా, కాంచన తదితర చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. క్రికెట్ క్రీడాకారుడు ధోనితో షికార్లు అంటూ ఒకప్పుడు సంచలనం సృష్టించింది లక్ష్మీరాయ్.
ఆ తరువాత అవకాశాలు అంతంత మాత్రంగా ఉండడంతో తన పేరును రాయ్ లక్ష్మీగా మార్చుకుంది. దీంతో ఈ భామ దశ కూడా మారిందని చెప్పవచ్చు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ అంటూ బహు భాషా నటిగా రాణిస్తున్నారు. రాయ్ లక్ష్మీ చేతిలో ఇప్పుడు అరడజను చిత్రాలుండడం గమనార్హం. మరో విషయం ఏమిటంటే ఈమెకు నాట్యం అంటే చచ్చేంత ఇష్టం అట. దీని గురించి తను తెలుపుతూ కింద పడేంత వరకూ నృత్యం చేస్తూనే ఉంటానని అంది. ప్రస్తుతం నృత్యంలో కొత్త రీతులు ప్రాక్టీస్ చేస్తున్నానని, అవేమిటన్నది త్వరలోనే ప్రదర్శిస్తానని చెప్పింది.
ఇంతకు ముందు అరణ్మణై వంటి హారర్ చిత్రంలో నటించిన రాయ్ లక్ష్మీ తాజాగా నటించిన షావుకారుపేట్టై చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇందులో ఆమె దెయ్యంగా విభిన్న పాత్రలో నటించింది. ప్రస్తుతం బెంగుళూర్‌డేస్ చిత్రం రీమేక్‌లోనూ, హిందీలో జూలీ-2, అకిరా చిత్రాలతో పాటు తెలుగులో పవన్‌కల్యాణ్‌తో సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రంలో అతిథి పాత్రలో మెరవనుంది. ఇలా పేరు మార్చుకున్న తరువాత తన జీవితం మంచి మలుపు తిరిగిందనీ, ఇప్పుడు మరింత ఫేమ్‌లోకి వచ్చానని సంతోషంగా చెబుతోంది నటి రాయ్‌లక్ష్మీ.