రాధారవి
‘‘యంజీఆర్, శివాజీ గణేశన్’ మరణం లేని ఇమేజ్ పొందినవాళ్లు. అలాంటి గొప్పవాళ్లతో నయనతారను పోలుస్తున్నారు. నాకు బాధగా ఉంది. నయనతార స్టారే. లేడీ సూపర్‌స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న మాట వాస్తవమే. కానీ వాళ్లతో పోలికేంటి?’’ అని నయనతార గురించి తమిళ నటుడు రాధారవి కామెంట్ చేశారు. నయనతార ముఖ్య పాత్రలో చక్రి తోలేటి తెరకెక్కించిన చిత్రం ‘కొలైయుదిర్ కాలమ్’. కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చే శారు.
ఈ కార్యక్రమానికి హాజరైన రాధారవి మాట్లాడుతూ– ‘‘నయనతార మంచి నటే. నేనొప్పుకుంటాను. ఇండస్ట్రీలో చాలా కాలంగా కొనసాగుతున్నారు. తన మీద పలు ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా టాప్‌లోనే కొనసాగుతున్నారు. తమిళ ప్రజలు ఏ విషయాన్నయినా నాలుగైదు రోజుల్లో మరచిపోతారు. తను ప్రస్తుతం ఫేమస్ కావచ్చు. తనే సీత పాత్ర చేస్తోంది, దెయ్యం పాత్రలూ చేస్తోంది. ఇంతకుముందు దేవుళ్ల పాత్రలో నటించాలంటే కేఆర్ విజయగారి వద్దకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు? ఎవరైనా చేయొచ్చు. గౌరవప్రదమైన వాళ్లనైనా నటింపజేయొచ్చు, ఎవరెవరితో తిరిగేవాళ్లనైనా నటింపజేయొచ్చు.
ఈ మధ్య హారర్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు నయనతార. తనని మామూలుగా చూస్తే దెయ్యాలే పారిపోతాయి’’ అని నయనతారపై కామెంట్ చేశారు. అలాగే ‘మీటూ’ ఉద్యమం మీద కూడా కామెంట్ చేశారు రాధారవి. ‘‘సినిమా ప్రమోషన్లలో పాల్గొనమని నటీనటుల మధ్య అగ్రిమెంట్ కుదుర్చుకోమని మది (‘కొలైయుదిర్ కాలమ్’ చిత్రనిర్మాత, రాధారవి అల్లుడు) కి చెప్పాను. అలాగే షూటింగ్‌లో భాగంగా హీరోయిన్‌ను హీరో ఎక్కడైనా తాకుతాడు. ఆ విషయంలో మళ్లీ సినిమా తర్వాత గొడవ చేయకూడదు అనే అగ్రిమెంట్ కూడా ఉండాలి’’ అని పేర్కొన్నారు. ఈ సంచలన వ్యాఖ్యలను పలువురు తమిళ నటీనటులు, దర్శకులు వ్యతిరేకించారు. తమ అభిప్రాయాలను ట్వీటర్‌లో షేర్ చేశారు.
‘‘రాధారవిగారి ప్రవర్తన విసుగు పుట్టించింది. ఆయనలా స్త్రీలను తక్కువ చేసేవాళ్లను నా సినిమాల్లో తీసుకోకూడదని పర్సనల్‌గా స్టాండ్ తీసుకుంటున్నాను.
– మిలింద్ రావ్, దర్శకుడు
ఒక గొప్ప కుటుంబం (రాధారవి తండ్రి ప్రముఖ నటుడు ఎం.ఆర్. రాధ) నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇంత అసభ్యకరంగా మాట్లాడినప్పుడు తనని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సపోర్ట్ చేయరు, ఎటువంటి యాక్షన్ తీసుకోరు. ఆయన స్పీచ్‌కు ప్రేక్షకులు కూడా నవ్వుతూ, చప్పట్లు కొట్టడం బాధగా ఉంది. నాకు తెలిసి ఈ సినిమాను మొదలుపెట్టిన దర్శకులు, నిర్మాతలు ఈ సినిమాను సగంలోనే వదిలిపెట్టారు. ఇలాంటి ఒక ఈవెంట్ జరుగుతుందని మాకు తెలియదు. అనవసరమైన ఈవెంట్ నిర్వహించి, అందులో ఇలాంటి అనవసరమైన వాళ్లను కూర్చోబెట్టి సినిమాను ప్రమోట్ చేయడం కంటే అలాంటి ఈవెంట్స్‌కు దూరంగా ఉండటమే మంచిది. ఇలాంటి ఈవెంట్స్ ద్వారా ఇలాంటి పనికిమాలిన వారి వ్యర్థమైన భావాలను బయటకు చెప్పడానికి ప్రోత్సహించడమే అవుతుంది. నడిగర్ సంఘం, ఇంకేదో సంఘం నుంచి ఎవ్వరూ ఎలాంటి యాక్షన్ తీసుకోరు. బాధాకరం’’
– విఘ్నేశ్ శివన్, దర్శకుడు
స్త్రీల మీద అసభ్యకర జోక్స్ వేయడం (అది అసభ్యకరం కాదని వాళ్లు అనుకోవడం), తక్కువ చేయడం, స్త్రీలను కేవలం ఐ క్యాండీల్లా చూడటం ఇండస్ట్రీలో భాగం అయిపోయింది. ఇదంతా ఓకే అనుకుని ఇప్పటివరకూ మాట్లాడని స్త్రీ, పురుషులకు థ్యాంక్స్ (వ్యంగ్య ధోరణిలో). అదీ మన పరిస్థితి. ఇలాంటి అనుభవం మీకు ఎదురైతేనే ఈ విషయం అర్థం అవుతుంది. అప్పుడు కనువిప్పు కలుగుతుంది. చిన్మయి, నేను, ఇంకెందరో స్త్రీలు ‘మీటూ’ అంటూ పోరాటం చేస్తున్న సమయంలో ఇండస్ట్రీలో ఉన్న ఉమెన్ మాతో నిలబడి ఉంటే.. ఏమో పరిస్థితుల్లో కొంచెమైనా మార్పు వచ్చేదేమో? మౌనం మనల్ని ఎక్కడికీ తీసుకెళ్లదు. ఈ సంఘాలన్నీ నడిపేది కూడా మగ అహంకారులే. ఈ విషయాలపై ఎటువంటి చర్యలు తీసుకోరు. కానీ స్త్రీలను సపోర్ట్ చేస్తున్నాం అని యాక్షన్ మాత్రం చేస్తుంటారు.
– వరలక్ష్మీ శరత్‌కుమార్, హీరోయిన్
ఒక సక్సెస్‌ఫుల్ ఫిమేల్ యాక్టర్‌ను స్టేజ్ మీద తిట్టేస్తున్నారు రాధారవి. వేరే యూనియన్స్ వాళ్ల విషయాల్లో ఇన్వాల్వ్ కాకూడదని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, నడిఘర్ సంఘం ఎటువంటి చర్య తీసుకోవడం లేదు’’
– చిన్మయి, గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్
రాధారవి సోదరి, ప్రముఖ నటి రాధిక కూడా సోదరుడి కామెంట్స్‌ను సపోర్ట్ చేయలేదు. ‘మనకున్న డెడికేటెడ్ నటుల్లో నయనతార ఒకరు. తను నాకు తెలుసు. తనతో పని చేశాను కూడా. తను చాలా మంచి మనిషి. రాధారవి మాట్లాడిన వీడియో మొత్తం చూడలేదు. రవిని ఇవాళ కలిశాను. తను మాట్లాడింది కరెక్ట్ కాదని చెప్పాను’’ అని ట్వీట్ చేశారు రాధిక.
ఐరా..నయనతార
నయనతార కథానాయికగా నటించిన లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘ఐరా’. గంగా ఎంటర్‌టైన్మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కేఎమ్ సర్జున్ దర్శకత్వం వహించారు. నయనతార తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది. ‘‘ఎమోషనల్ ఫ్యామిలీ హారర్‌గా రూపొందింది. భవాని, యమున పాత్రల్లో నయనతార కనిపిస్తారు. ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. భావోద్వేగాల సన్నివేశాల్లో నయనతార నటన హైలైట్’’ అని సర్జున్ అన్నారు. కళైయరసి, యోగిబాబు, ఎం.ఎస్. భాస్కర్, వంశీకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి కె.ఎస్. సుందరమూర్తి సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment