మలేసియాలో రాధికా ఆప్టే
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ షూటింగ్ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. మలేసియాలో జరుగుతున్న ఈ తమిళ చిత్రం షూటింగ్ చివరి షెడ్యూల్‌లో తాజాగా నటి రాధికా ఆప్టే వచ్చి చేరారు. హీరో రజనీకాంత్ భార్యగా ఆమె ఈ చిత్రంలో నటిస్తున్నారు. ‘‘రజనీకాంత్‌కూ, రాధికా ఆప్టేకూ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం. అలాగే, కొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తాం’’ అని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. దాదాపు మూడు వారాల పాటు ఈ తుది షెడ్యూల్ జరగనుంది.
పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఒక గ్యాంగ్‌స్టర్ జీవితం చుట్టూ తిరుగుతుంది. నిజజీవిత నేర సామ్రాజ్య నేత కపాలీశ్వరన్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని, ఈ చిత్ర కథ అల్లుకున్నట్లు కోడంబాకమ్ వర్గాల కథనం. ధన్సిక, దినేశ్, కలై అరసన్, రిత్విక తదితరులు ప్రధాన పాత్రధారులు. అలాగే, మలేసియన్ నటులు కీలక ప్రతినాయక పాత్రలు పోషిస్తుండడం విశేషం.
ఇప్పటికే, ‘అహల్య’ లాంటి షార్ట్ ఫిల్మ్స్ ద్వారా దేశవ్యాప్తంగా పేరున్న రాధికా ఆప్టే తమిళంతో పాటు తెలుగులోనూ వచ్చే ఈ చిత్రం తనకు ఒక కొత్త పాస్‌పోర్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఆమె ఆశలు ఏ మేరకు నెరవేరతాయన్నది తెలియాలంటే, మే నెలలో సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే!