సాక్షి, చెన్నై : జల్లికట్టు ఉద్యమంలో మృతిచెందిన యువకుడి కుటుంబానికి నటుడు, దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ బాసటగా నిలిచాడు. జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ గత ఏడాది చెన్నైలోని మెరీనా తీరంలో ప్రారంభమైన ఉద్యమం తమిళనాడు వ్యాప్తంగా ఊపందుకుంది. ఆ సమయంలో విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంధ సంస్థలు, సినీనటులు స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సేలంలో జరిగిన రైల్‌రోకోలో యోగేశ్వరన్ (17) రైలింజన్ పైకి ఎక్కడంతో విద్యుదాఘాతానికి గురై మరణించాడు.
అతడి భౌతికకాయానికి నివాళులర్పించేందుకు వెళ్లిన లారెన్స్ మృతుడి తల్లిదండ్రులను పరామర్శించి, ఇంటికి పెద్ద కుమారిడిలా ఉంటానని హామీ ఇచ్చాడు. చిన్నతనంలోనే చనిపోయిన యోగేశ్వరన్ కుటుంబ సభ్యుల కోసం ఇంటిని నిర్మిస్తానని తరచూ చెప్పేవాడు. ఇది తెలుసుకున్న లారెన్స్ ఉత్తర అమ్మాపేటలో స్థలాన్ని కొనుగోలు చేసి ఇంటిని నిర్మించాడు. రూ.22 లక్షలతో నిర్మించిన ఇంటి తాళాలను లారెన్స్ మృతుడు యోగేశ్వరన్ కుటుంబసభ్యులకు అప్పగించాడు. నేను చేసింది సాయం కాదు, ఇది నా బాధ్యత అని లారెన్స్ పేర్కొన్నారు. ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాలతో మానవత్వాన్ని చాటుకుంటున్న లారెన్స్ ఈ నిర్ణయంతో అభిమానుల మనసును మరోసారి గెలుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment