► 18న కొవ్వొత్తులతో ప్రదర్శన
► నటుడు రాఘవ లారెన్స్ పిలుపు
► వీరోచితంగా అలంగానల్లూరు జల్లికట్టు
టీనగర్: ఈనెల 18వ తేదీన జల్లికట్టు విజయోత్సవాలను జరుపుకునేందుకు నటుడు రాఘవ లారెన్స్ తమిళ ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ఇళ్ల ముందు కొవ్వొత్తులు, టార్చిలైట్లు వెలిగించి ప్రదర్శన నిర్వహించాలని కోరారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఇలా తెలిపారు. తమిళుల సంప్రదాయక్రీడగా పేరొందిన జల్లికట్టుపై నిషేధం తొలగించడంతో ఈ ఆనందాన్ని విజయోత్సవంగా జరుపుకోవడానికి అందరికీ ఆసక్తిగా ఉందన్నారు. అలంగానల్లూరులో జల్లికట్టు పోటీని తిలకించేందుకు స్థానిక ప్రజల పిలుపుతో మెరీనా ఆందోళనలో పాల్గొన్న యువకులు 300 మందితో వెళ్లేందుకు నిర్ణయించామని, అనేక ఏళ్ల తర్వాత జరుగుతున్న ఉత్సవం కావడంతో జనరద్దీని దృష్టిలో ఉంచుకుని కేవలం నలభై మందితో అలంగానల్లూరు చేరుకున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజల ఆహ్వానానికి కృతజ్ఞతలని తెలుపుకుంటున్నానని అన్నారు. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు వీలుకానందున తనకు బాధ కలిగిందన్నారు. వారి అసంతప్తిని పోగొట్టే విధంగా ఈ జల్లికట్టు విజయోత్సవాన్ని ఫిబ్రవరి 18వ తేదీన జరుపుకుందామని తెలిపానని, అందుకు వారు సమ్మతించినట్లు తెలిపారు.
ఈ సంతోషంలో ప్రజలందరూ పాల్గొనాలని నిర్ణయించామని, ఇందుకు వేదికగా మెరీనాబీచ్‌ను అనుకున్నప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దష్ట్యా అది వీలుకాదని తెలిసినందున వేరొక చోట జరుపుకోనున్నట్లు తెలిపారు. ప్రపంచ తమిళులందరూ ఈ ఉత్సవాలను వారున్న ప్రాంతాల్లో జరుపుకునేందుకు పిలుపునిచ్చారు. కూలి కార్మికుల నుంచి సాంకేతిక సమాచార స్నేహితులతో కలిపి జల్లికట్టు కోసం గళం విప్పిన అందరూ ఈ విజయోత్సవాలలో భాగం పంచుకోవాలని కోరారు. అనుకున్నది సాధిస్తామని, సాధించిన దాన్ని చారిత్రక విజయంగా వేడుక చేసుకుందామన్నారు.
కొవ్వొత్తుల ప్రదర్శన:
ఈనెల 18వ తేదీన సాయింత్రం ఏడు గంటల నుంచి 7.15 గంటల వరకు ఎవరికీ ఎటువంటి అభ్యంతరం కలగని విధంగా ప్రపంచ తమిళులందరం కలిసి ఇళ్ల డాబాలపై లేదా ఇళ్ల ముంగిళ్లలో కొవ్వొత్తులు, లేదా సెల్‌ఫోన్ టార్చిలైట్లు వెలిగించి ప్రశాంతంగా వేడుకలు జరుపుకుందామన్నారు.
వీరోచితంగా అలంగానల్లూరు జల్లికట్టు: నామక్కల్ సమీపంలోగల అలంగానల్లూరులో జల్లికట్టు పోటీలు ఆదివారం వీరోచితంగా జరిగాయి. ఇందులో 200లకు పైగా ఆంబోతులు రంకెలేస్తూ కదనరంగంలోకి దూకాయి. 150 మంది క్రీడాకారులు పాల్గొని ఆంబోతులను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ పోటీలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో జల్టికట్టు బందాలు ఏర్పాటయ్యాయి. ఈ బందాల్లో జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా ఎస్పీ, నామక్కల్ అసిస్టెంట్ కలెక్టర్ ఇతర అధికారులు ఉన్నారు.
ఈ పోటీలను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇలావుండగా పుదుచ్చేరి లాస్‌పేట్టై ఠాకూర్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం జల్లికట్టు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే జిల్లా కలెక్టర్ సత్యేంద్ర సింగ్ ఇందుకు అనుమతి నిరాకరించారు. ఇలావుండగా అలంగానల్లూరు జల్లికట్టులో రంకెలేసిన ఎద్దులు, క్రీడాకారులను చూసి పరవశం చెందినట్లు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కార్యకర్తలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.