
సాక్షి, హైదరాబాద్: తన భర్త పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని ప్రముఖ నటి, దర్శక నిర్మాత జీవితా రాజశేఖర్ తెలిపారు. అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రేమాభిమానాలతో కారు ప్రమాద ఘటన నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారని చెప్పారు. రాజశేఖర్ కారు ప్రమాదంపై మీడియా, సోషల్ మీడియాలో భిన్నమైన వార్తలు రావడంతో ఆమె స్పందించారు. ఈ మేరకు మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు.
‘కారు ప్రమాదంపై రకరకాల వార్తలు వస్తుండటంతో వాస్తవాలు వెల్లడించేందుకు మీ ముందుకు వచ్చాను. రాజశేఖర్ గారు మంగళవారం అర్ధరాత్రి ఘాటింగ్ ముగించుకుని ఇంటికి వస్తుండగా కారు టైరు పేలిపోవడంతో నియంత్రణ తప్పి డివైడర్‌ను ఢీకొని పక్కవైపు పడిపోయింది. ఎదురుగా వస్తున్న కారులో ఉన్నవారు ఆగి రాజశేఖర్ గారిని గుర్తించారు. వారి సహాయంతో కారులోంచి బయటకు వచ్చారు. ఆయన ఫోన్ స్విచ్చాఫ్ అయిపోవడంతో ఎవరైతే ఆయనను బయటకు తీశారో వాళ్ల ఫోన్ నుంచి పోలీసులకు, మాకు ఫోన్ చేశారు. నేను వీళ్ల కారులోనే వస్తున్నాను మీరు ఎదురురండి అని మాతో చెప్పారు.
మేము బయలుదేరి సగం దూరం వెళ్లి ఆయనను మా కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చాం. పోలీసులకు విషయాన్ని వివరించాను. రాజశేఖర్ గారు క్షేమంగానే ఉన్నారు కదా అని ఒకటికి రెండుసార్లు అడిగారు. ఆయనతో కూడా ఫోన్‌లో మాట్లాడారు. ఎటువంటి దెబ్బలు తగల్లేదని చెప్పారు. ఈ ఉదయం కూడా శంషాబాద్ సీఐ వెంకటేశ్ గారితో మాట్లాడాను. ప్రమాదం జరిగిన తీరుపై ఒకసారి స్టేషన్‌కు వచ్చి స్టేట్‌మెంట్ ఇవ్వాలని చెప్పారు. రాజశేఖర్ కోలుకున్నాక స్టేషన్‌కు రమ్మన్నారు. ఇది కచ్చితంగా పెద్ద ప్రమాదం. రాజశేఖర్ గారిని అభిమానించే అందరి ప్రేమాభిమానాలతో ఆయన క్షేమంగా బయటపడ్డార’ని జీవిత వివరించారు. (ప్రాథమిక వార్త: హీరో రాజశేఖర్ కారుకు మరో ప్రమాదం)
Comments
Please login to add a commentAdd a comment