కమర్షియల్ సినిమా మూసలో అప్పుడప్పుడు మెరిసే కళాత్మక చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. సామాజిక అంశాలను ప్రస్థావిస్తూ సందేశాత్మకంగా తెరకెక్కే సినిమాలను జయాపజయాలు పక్కన పెట్టి ప్రతీ ఒక్కరూ అక్కున చేర్చుకుంటారు. ఆ బాటలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగీత ప్రధాన చిత్రమే సర్వం తాళమయం. దాదాపు 18 ఏళ్ల విరామం తరువాత రాజీవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జీవీ ప్రకాష్ కుమార్, నెడుముడి వేణు ప్రధాన పాత్రల్లో నటించారు.
కథ విషయానికి వస్తే.. పీటర్ జాన్సన్ (జీవీ ప్రకాష్ కుమార్) సంగీత వాయిద్యాలు తయారు చేసే దళితవర్గానికి చెందిన కుర్రాడు. తమిళ సినీ హీరో విజయ్ అంటే పీటర్‌కు విపరీతమైన అభిమానం. ఎలాంటి బాధ్యత లేకుండా అల్లరి చిల్లరగా తిరిగే పీటర్ జీవితంలోకి అనుకోకుండా కర్ణాటక సంగీతం ప్రవేశిస్తుంది. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు పాలకొల్లు రామశాస్త్రీ దగ్గర సంగీత నేర్చకునేందుకు చేరతాడు. ఎలాగైన గురువు తగ్గ శిష్యుడు అనిపించుకోవాలన్న ప్రయత్నంలో పీటర్‌కు ఎదురైన సమస్యలేంటి..? ఈ ప్రయాణంలో పీటర్‌లో వచ్చిన మార్పులేంటి..? చివరకు పీటర్ అనుకున్నది సాధించాడా? అన్నదే మిగతా కథ.
కథగా చెప్పటానికి ఏమీ లేకపోయినా దర్శకుడు మనసును తాకే భావోద్వేగా సన్నివేశాలను సినిమాను తెరకెక్కించాడు. శాస్త్రీయ సంగీతం యొక్క గొప్పదనాన్ని చెబుతూనే సమాజంలో వేళ్లూనుకుపోయిన అంతరాలను తెర మీద ఆవిష్కరించాడు. సుధీర్ఘ విరామం తరువాత దర్శకత్వం వహించినా.. తన మార్క్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకున్నాడు. రొటీన్ స్టైల్‌లో సినిమాను ప్రారంభించిన దర్శకుడు నెమ్మదిగా ప్రేక్షకుడిని కథలో లీనం చేయటంలో సక్సెస్ అయ్యాడు. సంగీత విద్వాంసుడు రామశాస్త్రీ పాత్ర పరిచయంతో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. తొలి భాగం పాత్రల పరిచయం, ఆసక్తికర సన్నివేశాలతో మలచిన దర్శకుడు.. ద్వితీయార్థాన్ని కాస్త నెమ్మదిగా నడిపించాడు. కథాపరంగా మరిన్ని ఎమోషనల్ సీన్స్‌కు అవకాశం ఉన్నా దర్శకుడు సినిమాను రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నమే చేశాడు.
రాజీవ్ మీనన్ తయారు చేసుకున్న కథలోని పాత్రలకు ప్రతీ ఒక్క నటుడు జీవం పోశారు. సినిమా సినిమాకు నటుడిగా ఎదుగుతూ వస్తున్న జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. అల్లరి చిల్లరి కుర్రాడి, తరువాత సంగీత కళాకారుడిగా మారే క్రమంలో ప్రకాష్ నటన సూపర్బ్ అనిపిస్తుంది. ఇక కీలక పాత్రలో నెడుముడి వేణు నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. హీరోయిన్ అపర్ణ బాలమురళి పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా ఉన్నంతలో తనవంతు ప్రయత్నం చేసింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఒకప్పటి హీరో వినీత్ మంచి నటన కనబరిచాడు.
సంగీత ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరింత హైప్ తీసుకువచ్చింది. తన పాటలు, నేపథ్య సంగీతంతో రెహమాన్ ప్రతీ సన్నివేశాన్ని ప్రేక్షకుల గుండె లోతుల్లోకి చేరేలా చేశాడు. సినిమాకు మరో ప్రధాన బలం సినిమాటోగ్రఫి, ప్రతీ సన్నివేశాన్ని సహజంగా తెర మీద చూపించటంలో కెమెరామేన్ పనితనం స్పష్టంగా కనిపిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment