rajeev menon
-
గుండె లోతులను తాకే ‘సర్వం తాళమయం’
కమర్షియల్ సినిమా మూసలో అప్పుడప్పుడు మెరిసే కళాత్మక చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. సామాజిక అంశాలను ప్రస్థావిస్తూ సందేశాత్మకంగా తెరకెక్కే సినిమాలను జయాపజయాలు పక్కన పెట్టి ప్రతీ ఒక్కరూ అక్కున చేర్చుకుంటారు. ఆ బాటలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగీత ప్రధాన చిత్రమే సర్వం తాళమయం. దాదాపు 18 ఏళ్ల విరామం తరువాత రాజీవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జీవీ ప్రకాష్ కుమార్, నెడుముడి వేణు ప్రధాన పాత్రల్లో నటించారు. కథ విషయానికి వస్తే.. పీటర్ జాన్సన్ (జీవీ ప్రకాష్ కుమార్) సంగీత వాయిద్యాలు తయారు చేసే దళితవర్గానికి చెందిన కుర్రాడు. తమిళ సినీ హీరో విజయ్ అంటే పీటర్‌కు విపరీతమైన అభిమానం. ఎలాంటి బాధ్యత లేకుండా అల్లరి చిల్లరగా తిరిగే పీటర్ జీవితంలోకి అనుకోకుండా కర్ణాటక సంగీతం ప్రవేశిస్తుంది. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు పాలకొల్లు రామశాస్త్రీ దగ్గర సంగీత నేర్చకునేందుకు చేరతాడు. ఎలాగైన గురువు తగ్గ శిష్యుడు అనిపించుకోవాలన్న ప్రయత్నంలో పీటర్‌కు ఎదురైన సమస్యలేంటి..? ఈ ప్రయాణంలో పీటర్లో వచ్చిన మార్పులేంటి..? చివరకు పీటర్ అనుకున్నది సాధించాడా? అన్నదే మిగతా కథ. కథగా చెప్పటానికి ఏమీ లేకపోయినా దర్శకుడు మనసును తాకే భావోద్వేగా సన్నివేశాలను సినిమాను తెరకెక్కించాడు. శాస్త్రీయ సంగీతం యొక్క గొప్పదనాన్ని చెబుతూనే సమాజంలో వేళ్లూనుకుపోయిన అంతరాలను తెర మీద ఆవిష్కరించాడు. సుధీర్ఘ విరామం తరువాత దర్శకత్వం వహించినా.. తన మార్క్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకున్నాడు. రొటీన్ స్టైల్లో సినిమాను ప్రారంభించిన దర్శకుడు నెమ్మదిగా ప్రేక్షకుడిని కథలో లీనం చేయటంలో సక్సెస్ అయ్యాడు. సంగీత విద్వాంసుడు రామశాస్త్రీ పాత్ర పరిచయంతో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. తొలి భాగం పాత్రల పరిచయం, ఆసక్తికర సన్నివేశాలతో మలచిన దర్శకుడు.. ద్వితీయార్థాన్ని కాస్త నెమ్మదిగా నడిపించాడు. కథాపరంగా మరిన్ని ఎమోషనల్ సీన్స్‌కు అవకాశం ఉన్నా దర్శకుడు సినిమాను రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నమే చేశాడు. రాజీవ్ మీనన్ తయారు చేసుకున్న కథలోని పాత్రలకు ప్రతీ ఒక్క నటుడు జీవం పోశారు. సినిమా సినిమాకు నటుడిగా ఎదుగుతూ వస్తున్న జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. అల్లరి చిల్లరి కుర్రాడి, తరువాత సంగీత కళాకారుడిగా మారే క్రమంలో ప్రకాష్ నటన సూపర్బ్ అనిపిస్తుంది. ఇక కీలక పాత్రలో నెడుముడి వేణు నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. హీరోయిన్ అపర్ణ బాలమురళి పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా ఉన్నంతలో తనవంతు ప్రయత్నం చేసింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఒకప్పటి హీరో వినీత్ మంచి నటన కనబరిచాడు. సంగీత ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరింత హైప్ తీసుకువచ్చింది. తన పాటలు, నేపథ్య సంగీతంతో రెహమాన్ ప్రతీ సన్నివేశాన్ని ప్రేక్షకుల గుండె లోతుల్లోకి చేరేలా చేశాడు. సినిమాకు మరో ప్రధాన బలం సినిమాటోగ్రఫి, ప్రతీ సన్నివేశాన్ని సహజంగా తెర మీద చూపించటంలో కెమెరామేన్ పనితనం స్పష్టంగా కనిపిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
'సర్వం తాళమయం'కు కళాతపస్వి ప్రశంసలు
శంకరాభరణం, సాగర సంగమం వంటి అద్భుత సంగీత భరిత చిత్రాలను అందించిన కళాతపస్వి కె. విశ్వనాథ్, రాజీవ్ మీనన్ రూపొందించిన ‘సర్వం తాళ మయం’ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శన చూసిన ఆయన ‘చాలా కాలం తర్వాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూశాను. రాజీవ్ మీనన్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందించి, ఒక మంచి సందేశాన్ని కూడా అందించిన రాజీవ్ మీనన్ కి నా ఆశీర్వాదాలు’ అని అభినందించి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అలాగే ప్రముఖ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, మహానటి దర్శకులు నాగ అశ్విన్, యాత్ర దర్శకులు మహి వీ రాఘవ్ ఈ చిత్రాన్ని చూసి రాజీవ్ మీనన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించిన ఈ సినిమా మార్చ్ 8 న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలవుతోంది. జీవీ ప్రకాష్, అపర్ణ బాలమురళి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నేడుముడి వేణు, వినీత్, దివ్య దర్శిని ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని నిర్మాత లత తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. -
కదిలించేలా ‘సర్వం తాళమయం’ ట్రైలర్
నటుడు, సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ హీరోగా తెరకెక్కిన సంగీత ప్రధాన చిత్రం సర్వం తాళమయం. వాయిద్యాలు తయారు చేసే కుటుంబంలో పుట్టిన కుర్రాడు సంగీత విద్వాంసుడు కావాలనుకుంటే అతనికి ఎదురైన కష్టాలు, అవమానాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మెరుపు కలలు, ప్రియురాలు పిలిచింది లాంటి సూపర్ హిట్ సినిమాలన తెరకెక్కించిన రాజీవ్ మీనన్ 18 ఏళ్ల విరామం తరువాత ఈ సినిమాతో దర్శకుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే తమిళ నాట రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి టాక్ రావటంతో ఈ నెల 8న తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రాయూనిట్. జీవి ప్రకాష్ సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
‘నీపై అరిచింది కేవలం ఒకే ఒక్కసారి’
సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ కుమార్. ‘డార్లింగ్’ సినిమాతో హిట్ కొట్టిన ఈ యువ హీరో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కాగా జీవీ నటించిన తాజా చిత్రం ‘సర్వం తాళమయం’. రాజీవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మ్యూజికల్ డ్రామాకు రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జీవీ, రాజీవ్ మీనన్, రెహమాన్ ఫేస్బుక్లో లైవ్‌చాట్ నిర్వహించారు. వీరి సరదా సంభాషణలో భాగంగా.. ‘నిజంగా నాకు రెహమాన్ అంటే చాలా భయం. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాల్సి వచ్చేది’ అంటూ జీవీ చెప్పుకొచ్చాడు. మేనల్లుడి వ్యాఖ్యలకు స్పందించిన రెహమాన్.. ‘ నేను నీపై అరిచింది కేవలం ఒకే ఒక్కసారి. కానీ నువ్ మాత్రం అంతలా భయపడ్డావా. ఇదంతా నటనే కదా జీవీ. మంచి నటుడివి అని నిరూపించుకున్నావులే’ అంటూ చమత్కరించాడు. -
మ్యూజికల్ డ్రామాగా ‘సర్వం తాళమయం’
కోలీవుడ్ యంగ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మ్యూజికల్ డ్రామా ‘సర్వం తాళమయం’. మిన్సార కనవు, కండుకొండేన్ కండుకొండేన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ సుమారు 18 ఏళ్ల తరువాత దర్శకత్వం వహించిన చిత్రం సర్వం తాళమయం. ఈ సినిమాలో జీవీకి జంటగా అపర్ణా బాలమురళి నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్‌ను రిలీజ్ చేశారు.జియో స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. -
పదిహేడేళ్ల తర్వాత...!
కెమెరామెన్‌గా ‘బాంబే, మార్నింగ్ రాగ, గురు’ వంటి చిత్రాలకు వర్క్ చేసిన రాజీవ్ మీనన్ ‘మిన్సార కనవు’ (మెరుపు కలలు) అనే సినిమాతో దర్శకుడిగా మారారు. దర్శకుడిగా రెండో సినిమా ‘కండుకొండేన్ కండుకొండేన్’ కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌తో కలిసి వర్క్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ కాంబినేషన్ కుదిరింది. ‘‘నా ఫ్రెండ్ ఏఆర్ రెహమాన్‌తో ఆల్మోస్ట్ 17 ఏళ్ల తర్వాత కలసి వర్క్ చేయబోతున్నా’’ అని పేర్కొన్నారు రాజీవ్ మీనన్. దాంతో ఈ ఇద్దరూ ‘సర్వమ్ తలమయమ్’ అనే సినిమా కోసం వర్క్ చేయబోతున్నారనే వార్త మొదలైంది. ‘అది నిజం కాదు. మేమిద్దరం వేరే సినిమా చేయబోతున్నాం’ అన్నారు రాజీవ్ . -
‘రూపీ’తో దేశీ విహారానికి హ్యపీ!
విదేశీ పర్యటనలు చేసే భారతీయ పర్యాటకులపై రూపాయి క్షీణత ప్రభావం బాగా కనిపిస్తోందని, దీంతో వీరు విదేశాల కంటే దేశీయ పర్యాటక స్థలాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు మారియట్ హోటల్స్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ (దక్షిణాసియా) రాజీవ్ మీనన్. ఈ రంగంలో పెట్టుబడులకు అనేక అవకాశాలున్నాయని, అయితే రాష్ట్ర విభజన ప్రక్రియ వల్ల హైదరాబాద్ నగరం వాటిని కోల్పోతోందంటున్న రాజీవ్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ..... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశీయ హోటల్ పరిశ్రమ ఈ ఏడాది ఏ విధంగా ఉంటుంది? వృద్ధిరేటు బాగా సన్నగిల్లడంతో ఆ మేరకు హోటల్ పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పరిశ్రమ మొత్తం మీద చూస్తే గతేడాదితో పోలిస్తే ఈ క్యాలెండర్ ఇయర్లో ఒక గది సగటు ఆదాయంలో 5 శాతం క్షీణత నమోదయ్యింది. అలాగే ఆక్యుపెన్సీ రేషియో 60 శాతంగా ఉంది. గోవా, బెంగళూరు తప్పించి మిగిలిన అన్ని ప్రధాన పట్టణాల్లో ప్రతికూల వృద్ధే ఉంది. కాని మారియట్ హోటల్స్‌కు వచ్చేసరికి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. 70 శాతం ఆక్యుపెన్సీ రేషియో కలిగి ఉండటమే కాకుండా గదుల అద్దెల్లో 18 నుంచి 20 శాతం ప్రీమియం వసూలు చేస్తున్నాం. దీంతో మా సగటు గది ఆదాయంలో 5 శాతం వృద్ధి నమోదయ్యింది. మొత్తం మీద చూస్తే ఇప్పుడిప్పుడే పరిశ్రమ తిరిగి గాడిలో పడుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన సమస్య మీ ఆదాయం, వ్యాపార విస్తరణపై ఏమైనా ప్రభావాన్ని చూపుతోందా? తెలంగాణ సమస్య వ ల్ల హోటల్ పరిశ్రమ కొద్దిగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. కాని దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మౌలిక సదుపాయాలు వంటి అంశాలు దృష్ట్యా ఇక్కడ హోటల్ పరిశ్రమ పెట్టుబడులకు అనేక అవకాశాలున్నాయి. ప్రస్తుతం మాకు ఇక్కడ రెండు హోటల్స్ ఉండగా, మరో రెండు నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఈ విభజన సమస్య కొలిక్కి వచ్చేదాకా కొత్తగా రాష్ట్రంలో ఎటువంటి ప్రాజెక్టులు చేపట్టే ఉద్దేశం లేదు. రూపాయి విలువ తగ్గడం వల్ల ఇండియాకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో ఏమైనా వృద్ధి వుందా? అలాగే రూపాయి క్షీణత లాభాలపై ఏమైనా ప్రభావం చూపుతోందా? విదేశీ పర్యాటకులు పెరిగారన్నది చెప్పలేను కాని రూపాయి క్షీణత వల్ల భారతీయులు విదేశీ పర్యటనలు తగ్గించుకొని దేశీయ పర్యాటక స్థలాలపై అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో గోవా, జైపూర్, ఆగ్రా వంటి పర్యాటక స్థలాల్లో హోటల్ గదులకు డిమాండ్ పెరగడమే దీనికి ఉదాహరణ. దేశీయ పర్యాటకులు పెరగడంతో రూపాయి క్షీణత ప్రభావం మా లాభాలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అంచనా వేస్తున్నాం. మారియట్ హోటల్స్ విస్తరణ ప్రణాళికల గురించి వివరిస్తారా? ప్రస్తుతం మాకు దేశవ్యాప్తంగా 21 హోటల్స్, 5,000 గదులు ఉన్నాయి. ఇవి కాకుండా వివిధ దశల్లో 46 హోటల్స్ నిర్మాణం కొనసాగుతోంది. వచ్చే ఐదేళ్ళలో హోటల్స్ సంఖ్యను 100కి పెంచడమే కాకుండా గదుల సంఖ్యను 10,000కి పెంచాలన్నది లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా మారియట్ 20 బ్రాండ్స్‌తో హోటల్స్‌ను నిర్వహిస్తుంటే ఇండియాలో 8 బ్రాండ్లను పరిచయం చేసింది. ఈ మధ్యనే కొత్తగా మధ్యతరగతి ప్రజలను ఆకర్షించే విధంగా ‘ఫెయిర్ ఫీల్డ్’ బ్రాండ్‌ను పరిచయం చేశాం. రానున్న కాలంలో ప్రధానంగా ఫెయిర్ ఫీల్డ్ బ్రాండ్‌పైనే అధికంగా దృష్టిసారించనున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఈ బ్రాండ్‌ను పరిచయం చేసే అవకాశం లేదు.