‘రూపీ’తో దేశీ విహారానికి హ్యపీ!
విదేశీ పర్యటనలు చేసే భారతీయ పర్యాటకులపై రూపాయి క్షీణత ప్రభావం బాగా కనిపిస్తోందని, దీంతో వీరు విదేశాల కంటే దేశీయ పర్యాటక స్థలాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు మారియట్ హోటల్స్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ (దక్షిణాసియా) రాజీవ్ మీనన్. ఈ రంగంలో పెట్టుబడులకు అనేక అవకాశాలున్నాయని, అయితే రాష్ట్ర విభజన ప్రక్రియ వల్ల హైదరాబాద్ నగరం వాటిని కోల్పోతోందంటున్న రాజీవ్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.....
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశీయ హోటల్ పరిశ్రమ ఈ ఏడాది ఏ విధంగా ఉంటుంది?
వృద్ధిరేటు బాగా సన్నగిల్లడంతో ఆ మేరకు హోటల్ పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పరిశ్రమ మొత్తం మీద చూస్తే గతేడాదితో పోలిస్తే ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఒక గది సగటు ఆదాయంలో 5 శాతం క్షీణత నమోదయ్యింది. అలాగే ఆక్యుపెన్సీ రేషియో 60 శాతంగా ఉంది. గోవా, బెంగళూరు తప్పించి మిగిలిన అన్ని ప్రధాన పట్టణాల్లో ప్రతికూల వృద్ధే ఉంది. కాని మారియట్ హోటల్స్‌కు వచ్చేసరికి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. 70 శాతం ఆక్యుపెన్సీ రేషియో కలిగి ఉండటమే కాకుండా గదుల అద్దెల్లో 18 నుంచి 20 శాతం ప్రీమియం వసూలు చేస్తున్నాం. దీంతో మా సగటు గది ఆదాయంలో 5 శాతం వృద్ధి నమోదయ్యింది. మొత్తం మీద చూస్తే ఇప్పుడిప్పుడే పరిశ్రమ తిరిగి గాడిలో పడుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్ర విభజన సమస్య మీ ఆదాయం, వ్యాపార విస్తరణపై ఏమైనా ప్రభావాన్ని చూపుతోందా?
తెలంగాణ సమస్య వ ల్ల హోటల్ పరిశ్రమ కొద్దిగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. కాని దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మౌలిక సదుపాయాలు వంటి అంశాలు దృష్ట్యా ఇక్కడ హోటల్ పరిశ్రమ పెట్టుబడులకు అనేక అవకాశాలున్నాయి. ప్రస్తుతం మాకు ఇక్కడ రెండు హోటల్స్ ఉండగా, మరో రెండు నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఈ విభజన సమస్య కొలిక్కి వచ్చేదాకా కొత్తగా రాష్ట్రంలో ఎటువంటి ప్రాజెక్టులు చేపట్టే ఉద్దేశం లేదు.
రూపాయి విలువ తగ్గడం వల్ల ఇండియాకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో ఏమైనా వృద్ధి వుందా? అలాగే రూపాయి క్షీణత లాభాలపై ఏమైనా ప్రభావం చూపుతోందా?
విదేశీ పర్యాటకులు పెరిగారన్నది చెప్పలేను కాని రూపాయి క్షీణత వల్ల భారతీయులు విదేశీ పర్యటనలు తగ్గించుకొని దేశీయ పర్యాటక స్థలాలపై అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో గోవా, జైపూర్, ఆగ్రా వంటి పర్యాటక స్థలాల్లో హోటల్ గదులకు డిమాండ్ పెరగడమే దీనికి ఉదాహరణ. దేశీయ పర్యాటకులు పెరగడంతో రూపాయి క్షీణత ప్రభావం మా లాభాలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అంచనా వేస్తున్నాం.
మారియట్ హోటల్స్ విస్తరణ ప్రణాళికల గురించి వివరిస్తారా?
ప్రస్తుతం మాకు దేశవ్యాప్తంగా 21 హోటల్స్, 5,000 గదులు ఉన్నాయి. ఇవి కాకుండా వివిధ దశల్లో 46 హోటల్స్ నిర్మాణం కొనసాగుతోంది. వచ్చే ఐదేళ్ళలో హోటల్స్ సంఖ్యను 100కి పెంచడమే కాకుండా గదుల సంఖ్యను 10,000కి పెంచాలన్నది లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా మారియట్ 20 బ్రాండ్స్‌తో హోటల్స్‌ను నిర్వహిస్తుంటే ఇండియాలో 8 బ్రాండ్‌లను పరిచయం చేసింది. ఈ మధ్యనే కొత్తగా మధ్యతరగతి ప్రజలను ఆకర్షించే విధంగా ‘ఫెయిర్ ఫీల్డ్’ బ్రాండ్‌ను పరిచయం చేశాం. రానున్న కాలంలో ప్రధానంగా ఫెయిర్ ఫీల్డ్ బ్రాండ్‌పైనే అధికంగా దృష్టిసారించనున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఈ బ్రాండ్‌ను పరిచయం చేసే అవకాశం లేదు.