
పెరంబూరు: నటుడు రజనీకాంత్ ముఖ్యమంత్రి కావాలని ఆయన సోదరుడు యాగం నిర్వహించారు. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి గత మూడు దశాబ్దాలుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అదిగో వస్తున్నా, ఇదుగో పార్టీ పెడుతున్నా అంటూ రజనీకాంత్ కాలం వెలబుచ్చుతూనే వచ్చారు. కాగా ఎట్టకేలకు గత ఏడాది రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు బహిరంగంగా వెల్లడించిన రజనీకాంత్ ఆ తర్వాత ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. తన పాటికి తను కొత్త చిత్రాలను ఒప్పుకుంటూ నటిస్తున్నారు.
ఇలాంటి పరిస్ధితుల్లో ఆయన సోదరుడు సత్యనారాయణన్ మాత్రం రజనీకాంత్ రాజకీయ పార్టీని నెలకొలపడం ఖాయం అనీ, ఈ జూన్ నెల తర్వాత పార్టీకి సంబంధించిన ప్రకటన చేస్తారనీ పలు మార్లు చెబుతూవచ్చారు. ఈ క్రమంలోనే రజనీకాంత్ ముఖ్యమంత్రి కావాలని యాగం చేశారు. చిదంబరంలోని నటరాజ ఆలయంలో సత్యనారాయణన్ శుక్రవారం ఈ ప్రత్యేక యాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితుల వేదమంత్రోచ్ఛరణ నడుమ యాగం కొనసాగింది. రజనీకాంత్ పూర్తి ఆయురారోగ్యాలతో 2021లో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికలో అమోఘ విజయం సాధించి ముఖ్యమంత్రి కావాలని సత్యనారాయణన్ పూజలు చేశారు. ఈ యాగంలో ఆయనతో పాటు కర్ణాటక రాష్ట్ర రజనీకాంత్ అభిమాన సంఘం అధ్యక్షుడు చంద్రకాంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment