‘కాలా సినిమాను నేను రెండు మూడు సార్లు చూశాను. చాలా బాగా వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ కాదు.. ఒక మంచి మెసెజ్ ఉంటుంద’ని సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ‘నేను ఇక్కడకు వస్తే నా గత సినిమాలు గుర్తొస్తాయి. అంతులేని కథ, అన్నదమ్ముల సవాల్ ఇలా ఓ పదిహేను తెలుగు సినిమాలు చేశాను. అయితే నేను తెలుగులో సినిమాల్లో కొనసాగాలా.. లేదా తమిళంలో చేయాలా అని ఆలోచించాను.
నా గురువు బాలచందర్ గారు తమిళ్‌లో నాకు మొదటి సినిమాను ఇచ్చారు. నా సినీ జీవితం తమిళంలో మొదలైంది. అలా నా కెరీర్ తమిళ్‌లో కంటిన్యూ అయింది. తరువాత కొద్ది కాలానికి మోహన్‌బాబు పెదరాయుడు సినిమాలో పాత్ర ఇచ్చారు. దాని తరువాత మళ్లీ భాషా, ముత్తు, అరుణాచలం, నరసింహా, చంద్రముఖి, రోబో, శివాజి లాంటి సినిమాలతో మీ ముందుకు వచ్చాను. తమిళ్ ప్రేక్షకులు నన్నుఎంతగా అభిమానిస్తారో తెలుగు ప్రేక్షకులు కూడా అంతే అభిమానిస్తున్నారు. ఇది నా భాగ్యం.
ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ గారిని కలిసి వారి ఆశీర్వాదాన్ని తీసుకునే వాడిని. దాసరి గారు చనిపోవడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. నేను అమెరికాలో ఉండడం వల్ల కబాలి సినిమా సమయంలో నేనిక్కడికి రాలేకపోయాను. కబాలి చేస్తున్నప్పుడు ఇంత చిన్న కుర్రాడికి ఎందుకు చాన్స్ ఇచ్చారని అడిగారు. అతను కథ చెప్పినప్పుడు చేసినప్పుడే నాకు చాలా నచ్చింది. కబాలి సినిమాను ఎంత బాగా తీశాడో చూశాం. అందుకే మళ్లీ రంజిత్‌తో కలిసి చేయాలని అనిపించింది. అందుకే కాలా చేశాను.
నా అల్లుడు (ధనుష్) నిర్మాత అంటే సినిమాను బాగా తీయగలడా అనే అనుమానం కలిగింది. కానీ అతను మంచి నటుడే కాదు, మంచి నిర్మాత అని కూడా నిరూపించుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన హ్యూమా ఖురేషి కూడా ఎంతో సహకరించింది. అందుకు ఆమెకు ధన్యవాదాలు. సినిమాకు సంతోష్ నారాయణ మంచి సంగీతం అందించారు. ఆసియాలో అతి పెద్ద మురికివాడ అయిన ధారావి ప్రాంతానికి సంబంధించిన ఈ సినిమాలో, వారి జీవన పరిస్థితులు, అక్కడి మనుషుల ప్రేమలను అందంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పాత్ర ఆకట్టుకుంటుంద’ని రజనీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment