కాలా చిత్రంలో రజనీకాంత్
తమిళసినిమా: కాలా అంటే ఎవరు కరాకాలుడు. ఆయనతో పెట్టుకుంటే ఇంకేమైనా ఉందా? సినీ ప్రేక్షకులకు సూపర్‌స్టార్, అభిమానులకు తలైవా రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కాలా.ఆయన అల్లుడు, నటుడు ధనుష్ నిర్మించిన ఈ భారీ చిత్రానికి కబాలి చిత్రం ఫేమ్ పా.రంజిత్ దర్శకుడు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన తరువాత వస్తున్న చిత్రం కాలా కావడంతో దీనిపై పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ మధ్య తూత్తుకుడి కాల్పులనంతరం ఆ సంఘటనలో మరణించిన వారి కటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన రజనీకాంత్ ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలానికి దారి తీశాయి. ముఖ్యంగా ప్రతి విషయానికి పోరాటాలు చేసుకుంటూ పోతే తమిళనాడు శ్మశానంగా మారుతుందన్న రజనీ వ్యాఖ్యలను పలు తమిళ సంఘాలు, రాజకీయ పార్టీలు ఖండించాయి.
కాలా చిత్రంకు నష్టం కలిగించే ప్రయత్నాలు చేశారు. అయినా రజనీకాంత్ అలాంటి వాటిని పట్టించుకోలేదు. అయితే అందకు ముందు కావేరి మేనేజ్‌మెంటట్ బోర్డు ఏర్పాటు కోసం చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర త్యతిరేకతకు గురి చేశాయి. ఎంతగా అంటే కాలా చిత్ర విడుదలను ఆ రాష్ట్రంలో నిషేధించే స్థాయికి. దీంతో కోర్టు తీర్పు, కర్ణాటక ముఖ్యమంత్రి సహకారం, పోలీసుల రక్షణ వంటి చర్యలు కూడా కాలాకు ఆటంకాలను అడ్డుకోలేకపోయాయి. గురువారం కాలా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చినా, కర్ణాటకలో పూర్తిగా విడుదల కాలేదు. అయితే శుక్రవారం నుంచి చిత్రం అక్కడ కూడా థియేటర్లకు వెళ్లింది.
400 వెబ్‌సైట్‌లు మూతబడ్డాయి
కాగా కాలా చిత్రం కూడా పైరసీకి గురి కాక తప్పలేదు. చిత్రం విడుదలైన సాయంత్రమే 45 నిమిషాల చిత్రం ఫేస్‌బుక్‌లోకి వచ్చేసింది. అయితే అందుకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారనుకోండి. కాగా ఆ తరువాత కాలా చిత్రాన్ని 400 వెబ్‌సైట్స్ ప్రసారం చేసి చిత్ర యూనిట్‌కు షాక్ ఇచ్చాయి.అయితే కాలాతో పెట్టుకోవడం అంటే మాటలా? పోలీసులు రంగప్రవేశం చేశారు. ఫలితం ఇప్పుడా వెబ్‌సైట్స్ అన్నీ మూత బడ్డాయన్నది తాజా సమాచారం. అదే విధంగా కాలా చిత్ర పైరసీ వ్యవహారంపై నిర్మాతల మండలి సీరియస్ అయ్యింది. ఎవరైనా కాలా చిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్లలో పైరసీకి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు.
అభిమానుల మధ్య ఘర్షణ
కాగా రజనీకాంత్ రాజకీయరంగప్రవేశం గురించి ప్రకటించిన తరువాత ఆయన నటించిన చిత్రం కావడంతో కాలా చిత్రాన్ని చూడడానికి అబిమానులు విపరీతమైన ఆసక్తిని చూపిస్తున్నారు. కాలా చిత్రాన్ని పుదుకోట్టైలో రెండు థియేటర్లలో విడుదల చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు థియేటర్ల బంధోబస్తు కల్పించారు. ఇలాంటి పరిస్థితిలో పుదుకోట్టైలోని ఒక థియేటర్‌లో 4 గంటల షోకు వచ్చిన గంధర్వకోట్టైకు చెందిన రజనీ అభిమానులకు, వండిపేట్టైకు చెందిన అభిమానులకు మధ్య థియేటర్‌లో సీట్ల విషయంలో జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. చిత్ర ప్రదర్శన అనంతరం ఈ రెండు జట్ల మధ్య గొడవ కొట్లాటకు దారి తీసింది. దీంతో వారి ఇరు వాహనాలు ధ్వంసం అయ్యే స్థాయికి చేరాయి. ఒకరి వాహనంపై మరొకరు రాళ్లు, కట్టెలతో దాడి చేసి ధ్వంసం చేసుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అక్కడి నుంచి పంపేశారు. అయితే ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. పోలీసులు ఘర్షణకు పాల్పడిన వారి గురించి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment