రాజు గారి గది... లోపల ఏముంది?
చిత్రం: రాజు గారి గది
తారాగణం: అశ్విన్, ‘షకలక’ శంకర్, ధన్‌రాజ్, సప్తగిరి
మాటలు: సాయిమాధవ్ బుర్రా
కెమేరా: ఎస్. జ్ఞానమ్
సంగీతం: సాయికార్తీక్
నిర్మాత: ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ఓంకార్
గతంలో ‘జీనియస్’ అనే సినిమాతో దర్శకుడిగా తొలి అడుగు వేసిన ఓంకార్ ఈసారి లో-బడ్జెట్‌లో చేసిన హార్రర్ - కామెడీ -క్రైమ్ సినిమా ‘రాజు గారి గది’. అనగనగా నందిగామ అనే ఊరు. అక్కడ ఓ పాడుబడిన మహల్... దానిలోకి వెళ్ళినవాళ్ళంతా చనిపోతుంటారు. ఆ మహల్‌లో దయ్యం ఉందని ఊరంతా పుకారు. ఆ బంగళాలో ఉన్నదేమిటో నిజం నిరూపించడానికి కొందరు బయలుదేరతారు. తీరా ఆ ముగ్గురూ కూడా చనిపోతారు.
అలా అప్పటికి 34 మంది బలైపోయిన ఆ రాజమహల్ రహస్యం ఛేదించడానికి అన్నట్లుగా ఒక టీవీ చానల్ ఒక షో పెడుతుంది. దానిలో పాల్గొనడానికి ఏడుగురు సెలక్ట్ అవుతారు. ఆ ఏడుగురూ అక్కడకు వెళ్ళి, ఆ మహల్‌లో ఏడు రోజుల పాటు ఉండి, దయ్యాలున్నాయా, లేదా అన్నది కనిపెట్టాలన్నది గేమ్. అలా ఏడు రోజులూ అక్కడే గడిపి, గెలిచినవాళ్ళకు రూ. 3 కోట్లు ప్రైజ్‌మనీ. అందుకు ఒప్పుకొని, ఆ ఏడుగురూ అక్కడకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందన్నది సినిమా.
వెళ్ళిన ఏడుగురిలో ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. అశ్విన్ (అశ్విన్)కు ఓ ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. అతని అన్నయ్య డాక్టర్ (రాజీవ్ కనకాల). ఆర్గాన్ డొనేషన్ గురించి జనంలో చైతన్యం తెచ్చే ఆ డాక్టర్ కూడా అనుమానాస్పదంగా ఆ మహల్‌లోని పాడుబడ్డ బావిలో మరణిస్తాడు. ఆ కథకూ, ఈ మహల్‌లో పెళ్ళి కాకుండా తిరుగుతున్న బొమ్మాళి (పూర్ణ) దయ్యానికీ ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ మహల్‌లో దయ్యాలున్నాయా? ఎందుకవి అందరినీ చంపుతున్నాయన్నది మిగతా కథ.
ఓంకార్ తన తమ్ముడు అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ, డెరైక్షన్ చేసిన సినిమా ఇది. చూడడానికి అన్న పోలికలు పుష్కలంగా ఉన్న అశ్విన్‌ది ప్రధాన పాత్ర. డాక్టర్ నందన్‌గా చేతన్ చీను వినూత్నంగా కనిపిస్తారు. బాలా త్రిపురసుందరి అలియాస్ బాలాగా ధన్యా బాలకృష్ణన్ తెలంగాణ మాండలికంలో, గుంటూరు జిల్లా యాసలో శివుడుగా ధన్‌రాజ్, క్రైస్తవ మత ప్రబోధకుడి కుమారుడిగా ఎం.వై. దానం అలియాస్ మైదానంగా ‘షకలక’ శంకర్, బుజ్జిమాగా తమిళ నటి విద్యుల్లేఖా రామన్ - ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో రకం డైలాగ్ డెలివరీ. స్క్రిప్టుకు తగ్గట్లే అందరూ నవ్వించడానికి ప్రయత్నించారు.
ఈ సినిమాకు ప్రధాన బలం - ‘షకలక’ శంకర్ చేసిన కామెడీ, చూపిన హావభావాలు. క్షణాల్లో రకరకాల వేరియేషన్స్ చూపిస్తూ, ఆయన పండించిన సన్నివేశాలు ఆడియన్స్‌కు నచ్చుతాయి. మరిన్ని ఛాన్స్‌లు తెచ్చిపెడతాయి. ధన్‌రాజ్‌తో కాంబినేషన్ సీన్లు పండాయి. సెకండాఫ్‌లో సప్తగిరి చేసే ‘కచ్చేరీ’ లాంటి కామెడీ మాస్‌ను ఉద్దేశించినదనుకోవాలి.
పాటలు ఎక్స్‌పెక్ట్ చేయలేని హార్రర్ సినిమాకు... తగ్గట్లుగా బాగా కుదిరినవి - కెమేరా వర్క్, రీరికార్డింగ్. సౌండ్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకుల్ని ఉద్విగ్నతకు గురి చేస్తారు. నిడివి పరంగా కేవలం రెండు గంటల చిల్లరే ఉన్న ఈ సినిమాకు ఎడిటింగ్‌లో షాట్స్ ఎంపిక, వాటి ప్లేస్‌మెంట్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే, హార్రర్ ఎఫెక్ట్ పెరిగేదనిపిస్తుంది.
అలవాటైన టీవీ చానల్ గేమ్‌షో కాన్సెప్ట్‌నే... ఈ సినిమాకూ తీసుకున్నారు యాంకర్ ఓంకార్. ఇవాళ టీవీల్లో ఫేమస్ అయిన ‘బిగ్ బాస్’ తరహా గేమ్‌షోను ఆశ్రయించారు. అక్కడ బాహ్య ప్రపంచానికి దూరంగా ఒక ఇంట్లో అభ్యర్థులందరూ ఉండడమనే కాన్సెప్ట్‌కు ఇక్కడ దయ్యాలున్న రాజమహల్‌ను పెట్టుకున్నారు. పేరుకిది హార్రర్ జానర్ సినిమా అయినా, దానికి సోషల్ క్రైమ్ జత చేసి, సందేశం ఇవ్వాలని చూశారు. ఆ మధ్య వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ దగ్గర నుంచి జనరంజక ఫార్ములా అయిన హార్రర్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ మిళాయింపు పద్ధతినీ పాటించారు.
ఇలా అది కొంత, ఇది కొంత - అంటూ విజయసూత్రాలన్నీ వాడుకోవాలని చూశారు. ఫస్టాఫ్ అంతా హార్రర్ ధోరణిలో ఆసక్తిగా నడిచిపోతుంది. నిజానికి, ఈ సినిమాకు ‘రాజు గారి గది’ అని పేరు పెట్టారు కానీ, మొత్తం మహల్‌కే తప్ప, ప్రత్యేకంగా ఆ గదికి సినిమాలో ఇచ్చిన ఇంపార్టెన్స్ తక్కువే. క్రైమ్ సీరియల్‌గా బాగా నప్పే కాన్సెప్ట్‌ను ఒక చిన్న సినిమాగా తీశారు. మొత్తానికి, రాజు గారి గదిలో ఏముందా అని అతిగా ఊహించుకోకుండా కాసేపు కాలక్షేపానికి వెళితే, ఆశాభంగం తప్పుతుంది. టాయిలెట్ కామెడీల లాంటి జుగుప్సను పక్కన పెడితే, రీరికార్డింగ్ ఎఫెక్ట్‌లు, ‘షకలక’ శంకర్ కామెడీలతో సర్దుకుపోవచ్చనిపిస్తుంది.