ఎర్రజెండా ఉన్నంతవరకూ నారాయణమూర్తి గుర్తుంటాడు : కె. రాఘవేంద్రరావు
‘‘మేం ఏసీ గదుల్లో కూర్చుని కథలు రెడీ చేస్తుంటే, నారాయణమూర్తి ఎర్రటి ఎండలో రోడ్ల మీద నడుస్తూ కనిపిస్తాడు. అప్పుడు కథలు అల్లుకుంటాడు. ఎర్రజెండా ఉన్నంతకాలం అతను గుర్తుంటాడు’’ అని సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. ఆర్. నారాయణమూర్తి స్వీయదర్శకత్వంలో నిర్మించి, నాలుగు పాత్రలు పోషించిన చిత్రం ‘రాజ్యాధికారం’. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. బుధవారం హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపారు.
ఈ వేడుకలో పాల్గొన్న రాఘవేంద్రరావు మాట్లాడుతూ,‘‘1980లో నేను దర్శకత్వం వహించిన ‘మోసగాడు’లో స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించిన పాటలోని ఒక్క లైన్‌కి జాతీయ జెండా పట్టుకుని నారాయణమూర్తి చాలా ఆవేశంగా నటించాడు’’ అంటూ అప్పటి సంగతులు గుర్తుచేసుకున్నారు. రచయిత, దర్శకుడు జేకే భారవి, ప్రజా గాయకుడు గద్దర్, ప్రజా కవులు జయరాజు, గిద్దె రామనర్సయ్య, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. గద్దర్ మాట్లాడుతూ -‘‘సినిమా ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం గొప్ప విషయం. గత ముప్ఫై ఏళ్లుగా నారాయణమూర్తి ఈ దిశగానే సినిమాలు తీస్తున్నారు. ఇలాంటి మంచి చిత్రాలకు మా వంతు సహకారం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం’’ అన్నారు. మంచి, చెడుల మధ్య పోరాటమే ఈ చిత్రమని నారాయణమూర్తి పేర్కొన్నారు.